దళితులపై దమనకాండ

ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలంటేనే భయమేస్తోందని ఓ దళిత మహిళా ఎమ్మెల్యేనే ఆందోళన వ్యక్తం చేశారంటే.. ఇక్కడ ఆ వర్గాలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయో అర్థం చేసుకోవచ్చు.

Updated : 28 Mar 2023 06:37 IST

అణగదొక్కుతున్న అధికార పార్టీ నేతలు
ప్రశ్నిస్తే దాడులు, దౌర్జన్యాలు
పోలీసులను అడ్డు పెట్టుకుని అరాచకాలు
సామాన్యుడి నుంచి శాసనసభ్యుడి వరకూ బాధితులే
ఈనాడు - అమరావతి

ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలంటేనే భయమేస్తోందని ఓ దళిత మహిళా ఎమ్మెల్యేనే ఆందోళన వ్యక్తం చేశారంటే.. ఇక్కడ ఆ వర్గాలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో దళితులపై దమనకాండ హద్దుల్లేకుండా సాగుతోంది. దళితుల హత్యలు, వారిపై నేరాలు, అణచివేత, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసుల బనాయింపు, వేధింపులు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. దళితులపై కక్ష కట్టారా అన్నట్లు సాగుతున్న ఈ ఘటనల్లో అత్యధిక శాతానికి అధికార వైకాపా నాయకులే బాధ్యులు. వారే నిందితులు కూడా. అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం, కావల్సినచోటికి పోస్టింగుల కోసం కొంతమంది పోలీసులు కూడా దళితులపై దుశ్చర్యలకు తెగబడుతున్నారు. తప్పుల్ని ప్రశ్నిస్తే దాడి, అన్యాయంపై ఎదురు తిరిగితే హత్య, అణచివేతకు వ్యతిరేకంగా గొంతెత్తితే దౌర్జన్యాలు.. ఇలా ఒకటేమిటి 45 నెలల వైకాపా పాలనలో దళితులపై జరుగుతున్న అకృత్యాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఇవన్నీ భరించలేక బాధితులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తీవ్ర మానసిక క్షోభతో ప్రాణాలు విడుస్తున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఏ జిల్లాలో చూసినా నిత్యం ఇలాంటి అకృత్యాలు ఎక్కడోచోట బయటపడుతూనే ఉన్నాయి. 

దళిత డ్రైవర్‌ను చంపేసి.. డోర్‌ డెలివరీ

వైకాపా తరఫున ఎన్నికైన ఎమ్మెల్సీ అనంతబాబు.. అతని వద్ద డ్రైవర్‌గా పనిచేసే దళిత యువకుడు వీధి సుబ్రమణ్యాన్ని చంపేసి, ఆ మృతదేహాన్ని దర్జాగా డోర్‌ డెలివరీ చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీ నాయకుల ఇసుక అక్రమాలపై ప్రశ్నించిన పాపానికి దళిత యువకుడు ఇండుగుమల్లి వరప్రసాద్‌కు పోలీసుస్టేషన్‌లో శిరోముండనం చేశారు. కరోనా విజృంభిస్తున్న వేళ మాస్కులు లేకుండా వైద్యం ఎలా చేయాలి? అని అడగటమే నేరమన్నట్లు.. దళిత వైద్యుడు డాక్టర్‌ సుధాకర్‌ను సస్పెండ్‌ చేశారు. చొక్కా విప్పేసి, చేతులు వెనక్కి విరిచేసి, తాళ్లతో కట్టేసి, లాఠీలతో కొట్టారు. మానసిక స్థితి బాగోలేదంటూ పిచ్చాసుపత్రిలో చేర్పించారు. తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆయన చివరికి ప్రాణాలొదిలారు. మాస్కు పెట్టుకోకుండా బయట తిరుగుతున్నారంటూ దళిత యువకుడు కిరణ్‌కుమార్‌ను లారీలతో చితకబాది అతని చావుకు కారణమయ్యారు. వైకాపా ప్రభుత్వ తప్పిదాల్ని ప్రశ్నించినందుకు చిత్తూరు జిల్లాకు చెందిన దళితుడైన మాజీ న్యాయాధికారి రామకృష్ణపై అక్రమ కేసులు బనాయించి, తీవ్రంగా హింసించారు. అదే జిల్లాలో దళిత వైద్యురాలు అనితారాణిని వేధించి, అసభ్యపదజాలంతో దూషించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో దళితులపై సాగుతున్న దమనకాండకు ఇవి తార్కాణాలు మాత్రమే.

వైకాపా నాయకులు, పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్యలు

కొంతమంది అధికార పార్టీ నాయకులు దళితులపై వేధింపులకు తెగబడుతున్నారు.. పోలీసులను అడ్డుపెట్టుకుని దళితుల్ని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వైకాపా నాయకుల పైరవీలతో పోస్టింగులు దక్కించుకుని.. కీలకమైన స్థానాల్లో కొనసాగుతున్న కొందరు పోలీసు అధికారులు దళితులపై అరాచకాలకు తెగబడుతున్నారు. ఆ అవమాన భారాన్ని భరించలేక పలువురు దళితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

* వైకాపా నాయకుడు, పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీ ఉపాధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ, ఆయన సోదరుడు గంగాధర్‌, ఎస్సై కిరణ్‌కుమార్‌ బెదిరింపులు భరించలేకపోతున్నానని లేఖ రాసి గతేడాది అక్టోబరులో దళిత ఆక్వా రైతు బూరగ నాగేశ్వరరావు (37) ఆత్మహత్య చేసుకున్నారు. నాగేశ్వరరావు వద్ద పనిచేసే సురేష్‌ పక్షులను బెదరగొట్టేందుకు నాటు తుపాకీ పేలుస్తూ గాయపడ్డారు. అతనికి రూ.10 లక్షలు చెల్లించాలంటూ సత్యనారాయణ, గంగాధర్‌.. నాగేశ్వరరావును బెదిరించారని, ఇవ్వలేననటంతో పోలీసుస్టేషన్‌కు పిలిపించి కొట్టారని కేసు నమోదైంది.

* పోలీసులు అక్రమ కేసు బనాయించి వేధిస్తున్నారని కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన దళిత యువకుడు అలపు గిరీష్‌బాబు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మున్సిపల్‌ ఎన్నికల్లో గిరీష్‌ అన్నయ్య.. ప్రవీణ్‌కుమార్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో వైకాపా నాయకుడొకరు ఆ కుటుంబాన్ని లక్ష్యంగా చేసి ఓ కేసు పెట్టించారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో పోలీసులు గిరీష్‌ను వేధించారు.

* నెల్లూరు జిల్లా కందమూరుకు చెందిన దళిత యువకుడు ఉదయగిరి నారాయణ (38) గతేడాది జులైలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన్ను పోలీసులు చిత్రహింసలు పెట్టారని.. అది బయటపడకుండా ఆత్మహత్యగా చిత్రీకరించారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుల సంప్రదాయాలకు భిన్నంగా పోలీసులు బలవంతంగా అంత్యక్రియలు చేయించారు.

* ‘వైకాపా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నా రేషన్‌ దుకాణాన్ని తొలగించారు. కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. వైకాపా ఎమ్మెల్యేలు, పోలీసు వేధింపులే నా చావుకు కారణం’ అని పేర్కొంటూ నెల్లూరు జిల్లా కావలిలో పూడి శ్రీహర్ష అనే దళిత యువకుడు ఆత్మహత్యకు యత్నించారు. స్థానికులు స్పందించి కాపాడారు. 

* రూ.20 లక్షలు అప్పు చేసి చెరువులో చేపలు పెంచితే వాటిని పట్టుకోనివ్వకుండా వైకాపా నాయకుడు, శ్రీశైలం ట్రస్టు బోర్డు సభ్యుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, ఆయన అనుచరుడు సురేష్‌రెడ్డి అడ్డుకుంటున్నారంటూ ఎస్పీకి లేఖ రాసి నెల్లూరు జిల్లా కావలికి చెందిన దళిత యువకుడు దుగ్గిరాల కరుణాకర్‌ (36) నిరుడు ఆగస్టులో ఆత్మహత్య చేసుకున్నారు. తల్లితో కలిసి జగదీశ్వర్‌రెడ్డి ఇంటికెళ్లి ఆయన కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని లేఖలో వాపోయారు.

* శ్రీకాకుళం జిల్లా బూర్జ పోలీసుస్టేషన్‌లో దళిత యువకుడు మురపాక మహేష్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

* తమ ఇంటిని కూల్చేశారంటూ అనంతపురం జిల్లా కుందుర్పి మండలం నిజవల్లికి చెందిన హనుమంతరాయుడు, అనితా లక్ష్మి అనే దళిత దంపతులు ఆత్మహత్యకు యత్నించారు.

దళితుల్ని చంపేస్తున్నారు

తమ ఆధిపత్యాన్ని ప్రశ్నించినా, అహాన్ని దెబ్బతీసినా, అడ్డొస్తున్నారని భావించినా,  అక్రమాలపై ఫిర్యాదు చేసినా దళితుల ప్రాణాలే తీసేస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో బాధ్యులపై పోలీసులు కఠినంగావ్యవహరించట్లేదు. దీంతో కొన్ని రోజులు జైల్లో ఉండి బయటకొచ్చేస్తామని, తాము దళితుల్ని చంపినా తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో అధికార పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు.

* ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలోని కడప బహుళార్థ పశువైద్యశాలలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న దళిత అధికారి చిన్న అచ్చెన్నను ఇలాగే చంపేశారు. అచ్చెన్న కనిపించట్లేదంటూ అతని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.

* ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలం ఏకునాంపురంలో దళితుడైన దాసరి వెంకటరమణయ్యను చంపేశారు. ఉపాధి హామీ పథకంలో అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆయన అధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

* గుంటూరు జిల్లా పొన్నూరు వాసి, దళితుడైన అంజి బర్నబాస్‌ను కొందరు అపహరించి హత్య చేశారు. ఈ ఘటనలో వైకాపా నాయకుల ప్రమేయంపై ఆరోపణలున్నాయి.

* అనకాపల్లి జిల్లా పీఎల్‌పురం ఎస్సీ కాలనీకి చెందిన వడ్లమూరి నాగేంద్ర (21)ను కాళ్లు, చేతులూ కట్టేసి బావిలో పడేసి హత్యచేశారు. 

* కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షంలో గ్రామదేవతల జాతర సందర్భంగా చోటుచేసుకున్న గొడవల్లో దళితులపై మరో వర్గం కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో దళిత యువకుడు నడిపల్లి రాము (23) ప్రాణాలు కోల్పోయారు.

* గుంటూరులో దళితుడైన తెదేపా కార్యకర్త పొత్తూరి వెంకట నారాయణపై వైకాపా కార్యకర్తలు హత్యాయత్నం చేశారు.

* అనంతపురం జిల్లా తాడిపత్రిలో దళితుడైన కౌన్సిలర్‌ మల్లికార్జున ఇంట్లోకి చొరబడి, అతనితోపాటు తల్లి, సోదరిపైనా దాడి చేశారు. ఈ కేసులో పోలీసులు హత్యాయత్నం సెక్షన్లు పెట్టలేదు. నిందితుల్ని అరెస్టు చేయకుండా నోటీసులిచ్చి వదిలేశారు.

వారికి బ్రహ్మరథం.. వీరిపై దాడుల పర్వం

* దళిత యువకుడు వీధి సుబ్రమణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబును సస్పెండ్‌ చేయాలంటూ అన్ని వైపుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తే తప్ప వైకాపా ఆయనపై చర్యలు తీసుకోలేదు. ఆయన జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యాక వైకాపా శ్రేణులే భారీ ర్యాలీతో బ్రహ్మరథం పట్టాయి. ఈ హత్య కేసు నీరుగార్చేందుకు, తీవ్రత తగ్గించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

* ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారంటూ దళిత మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వైకాపా తాజాగా సస్పెండ్‌ చేసింది. ఆ వెంటనే వైకాపా శ్రేణులు ఆమె కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి. సామాజిక మాధ్యమాల్లో ఆమెను, ఆమె కుటుంబసభ్యుల్ని కించపరుస్తూ, అసభ్యకరంగా చిత్రీకరిస్తూ విపరీతంగా ట్రోలింగ్‌ చేస్తున్నారు.

* వైకాపా మద్దతున్న నాయకులు దళితులపై ఎంతటి నేరానికి పాల్పడినా వారిని ఉపేక్షిస్తున్నారు. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే చాలు ఆ నాయకులు దళితులైనా వారిపై దాడికి పాల్పడుతున్నారు.. అని చెప్పడానికి ఈ రెండు ఘటనలే నిదర్శనం.

బాధితులైన దళితులపైనే రివర్స్‌ కేసులు

రాష్ట్రంలో పలు సంఘటనల్లో బాధితులైన దళితులపైనే పోలీసులు రివర్స్‌ కేసులు పెడుతున్నారు. దళితులు బాధితులైన కొన్ని ఘటనల్లో అసలు ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్లే వర్తింపజేయట్లేదు. మరోవైపు దళితులపైనే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు బనాయిస్తుండటం అంతకంటే దారుణం. దశాబ్దాల కిందట ప్రభుత్వం తమకు కేటాయించిన ఎసైన్డ్‌ భూములను ప్రభుత్వమే లాక్కోవటమేంటని ప్రశ్నిస్తున్న దళితులపైనే కేసులు పెడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టాన్ని రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులకు, కక్ష సాధించేందుకు వైకాపా వినియోగిస్తోంది.

* తన పేరిట తప్పుడు పత్రాలు సృష్టించి, ధాన్యం కొనుగోళ్లలో కొందరు అక్రమాలకు పాల్పడ్డారంటూ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన దళిత రైతు గాలి జూపాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. తిరిగి అతనిపైనే కేసు పెట్టారు. అక్రమాల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అతనిపై వేధింపులు మొదలయ్యాయి.

* మూడు రాజధానులకు మద్దతుగా చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న వారిని అడ్డుకుని కులం పేరుతో దూషించారంటూ మంగళగిరి గ్రామీణ పోలీసులు 2020 అక్టోబరులో 11 మంది అమరావతి రైతులపై ఎట్రాసిటీ కేసు కట్టి, అరెస్టు చేశారు. అందులో ఉన్న అయిదుగురు దళితులపైనా ఎట్రాసిటీ కేసు పెట్టేసి 18 రోజులు జైల్లో ఉంచారు. కులం పేరుతో దూషించినట్లు తాను ఫిర్యాదే ఇవ్వలేదని ఫిర్యాదుదారే న్యాయస్థానంలో అఫిడవిట్‌ వేసినా పోలీసులు పట్టించుకోలేదు.

* పులివెందులలో హత్యాచారానికి గురైన దళిత మహిళ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డీఎస్పీకి ఫిర్యాదు చేయటానికి వెళ్లిన తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, తెదేపా నాయకుడు ఎంఎస్‌ రాజులపైన ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెట్టారు. వీరిద్దరూ దళితులే కావడం గమనార్హం.

దళితులపై దాడులు

* అనంతపురం జిల్లా గుత్తిలో దళితుడైన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ గోపీనాథ్‌పై వైకాపా నాయకులు దాడి చేసి దుర్భాషలాడారు.

* విశాఖపట్నంలో దళిత యువకుడు వర్రి శ్రీకాంత్‌పై సెల్‌ఫోన్‌ దొంగతనం అభియోగం మోపి, శిరోముండనం చేశారు.

* అనంతపురం జిల్లా వెలిగొండలో కుళాయికి మంచినీరు రాలేదని ప్రశ్నించినందుకు దళితుడైన చిన్నయన్నప్ప కుటుంబంపై దాడికి పాల్పడ్డారు.

* అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం పాతచెదుళ్లలో దళితుడైన రమేష్‌ కుటుంబంపై వైకాపా నాయకులు వీరంగం సృష్టించారు.

* ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు వెంకటేశ్వరనగర్‌ దళిత కాలనీ వాసులపై యువకులు కర్రలు, ఆయుధాలతో దాడి చేశారు.

* చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం బోయకొండ క్రాస్‌లో వైకాపా నాయకులు, వారి అనుచరులు దళిత మహిళల జుట్టు పట్టుకుని ఈడ్చేశారు. కాళ్లతో తన్ని, కర్రలతో కొట్టారు.

* తమ భూమిలో పట్టాలు ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించినందుకు ఓ దళిత రైతు కుటుంబంపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.


డాక్టర్‌ సుధాకర్‌.. డాక్టర్‌ అచ్చెన్నలా.. డాక్టర్‌ శ్రీదేవి చనిపోవద్దనే..

ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలంటేనే భయమేస్తోంది. అక్కడ ఎస్సీలపై దాడులు చేస్తున్నారు. అణగదొక్కుతున్నారు. బెదిరించి హత్యలు చేస్తున్నారు. ఇవన్నీ చూసి ఒక ఎమ్మెల్యేగా నేనే భయపడుతున్నానంటే ఇక సామాన్యుల పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. ఎస్సీలంటే ప్రభుత్వానికి చులకన. గతంలో డాక్టర్‌ సుధాకర్‌, తాజాగా డాక్టర్‌ అచ్చెన్న ఎలా చనిపోయారో మీ అందరికీ తెలుసు. డాక్టర్‌ శ్రీదేవి అలా చనిపోవద్దనే ఉద్దేశంతోనే అజ్ఞాతంలోకి వెళ్లా. సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి నాకు హాని ఉంది. నాకేదైనా జరిగితే ఏపీ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. మూడు రోజుల నుంచి గూండాలతో బెదిరిస్తున్నారు. గుంటూరులోని నా కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.

 వైకాపా నుంచి సస్పెన్షన్‌కు గురైన దళిత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రెండు రోజుల కిందట హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలివి


దేశద్రోహం కేసుల్లో సైతం ఇలా ఇంత తీవ్రంగా కొట్టరు..

కాళ్లలో రాడ్లు ఉన్నాయి.. కొట్టొద్దు సార్‌ అంటూ దళిత యువకుడు ఆలపు గిరీష్‌బాబు ప్రాథేయపడ్డా ఎస్సై అభిమన్యు కనికరించలేదు. ‘రాడ్లు ఎక్కడున్నాయో చెప్పు’ అంటూ లాఠీకి రబ్బరు కట్టి కాళ్ల మీదే కొట్టి రాక్షసానందం పొందారు. హత్య, అత్యాచారం, దేశద్రోహం వంటి కేసుల్లో సైతం ఇంత తీవ్రంగా కొట్టేలా చట్టాల్లేవు. ఎస్సై ఏకపక్షంగా, కక్షపూరితంగా, రాజకీయ నాయకుల మెప్పు పొందేందుకే ఇలా చేశారు.

కాకినాడ జిల్లా సామర్లకోటలో వైకాపా నాయకులు, పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు గిరీష్‌బాబు కుటుంబాన్ని 2022 జనవరి 6న పరామర్శించిన వేళ రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ ఎం.విక్టర్‌ ప్రసాద్‌ వ్యక్తం చేసిన ఆవేదన ఇది.


కలెక్టర్‌ ఆదేశించినా స్పందన శూన్యం

ఇంటికెళ్లే దారిలో మట్టి గుట్టలు పోశారని సుధారాణి ఆవేదన

బాపట్ల, న్యూస్‌టుడే: బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెంలోని తన ఇంటికెళ్లే మార్గంలో మట్టి గుట్టలు పోసి నడవటానికి వీలులేకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని దళిత ఉపాధ్యాయిని గొట్టిపాటి సుధారాణి ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఈ మేరకు ఆమె అధికారులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటికి వెళ్లే మార్గంలో అడ్డుగా ఉన్న గోడను తొలగించాలని ఈ నెల 20న స్పందనలో ఫిర్యాదు చేయగా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ స్పందించి తగిన చర్యలు చేపట్టాలని డీపీవోను ఆదేశించారన్నారు. ఇంత వరకు డీపీవో వచ్చి సమస్య పరిష్కరించలేదని, అడిగితే తహసీల్దారు వద్దకు వెళ్లాలని చెప్పారన్నారు. తహసీల్దారును సంప్రదిస్తే డీపీవో వద్దకే వెళ్లాలని సూచించినట్లు తెలిపారు. తన ఇంటికి వెళ్లే మార్గానికి అడ్డంగా మంచాలు వేసుకుని రాకపోకలు సాగించటానికి ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఆరోపించారు. ఈసారి ఏకంగా లారీలో మట్టి తెప్పించి ఇంటికి వెళ్లే మార్గంలో గుట్టలుగా పోశారని వాపోయారు. ఇంటికి వెళ్లలేక మూడ్రోజులుగా వేరే వారి ఇంట్లో తలదాచుకుంటున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసినా అధికారుల్లో ఎలాంటి స్పందన లేదన్నారు. కలెక్టర్‌ నేరుగా జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.


లెక్కలివీ..

* ఆంధ్రప్రదేశ్‌లో 2020తో పోలిస్తే 2021లో ఎస్సీలపై నేరాలు 3.28% మేర పెరిగాయి.

* 2021లో దేశవ్యాప్తంగా ఎస్సీలపై జరిగిన నేరాల్లో 3.95 % ఏపీలోనే జరిగాయి.

(జాతీయ నేర గణాంక సంస్థ వివరాల ప్రకారం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని