వివేకా హత్య కేసును ఎన్నాళ్లు సాగదీస్తారు?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో పురోగతి లేకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి దర్యాప్తు ఇంకా ఎన్నేళ్లు కొనసాగిస్తారని నిలదీసింది.
దర్యాప్తులో ఎలాంటి పురోగతీ కనిపించడం లేదు
సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం
మరో దర్యాప్తు అధికారిని నియమించండి
ఇప్పుడున్న అధికారినీ కొనసాగించాలని సూచన
తదుపరి నిర్ణయాన్ని రేపటికల్లా చెప్పాలని సీబీఐ డైరెక్టర్‌కు నిర్దేశం
ఈనాడు - దిల్లీ
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో పురోగతి లేకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి దర్యాప్తు ఇంకా ఎన్నేళ్లు కొనసాగిస్తారని నిలదీసింది. సీబీఐ దాఖలు చేసిన దర్యాప్తు స్థాయీ నివేదికలో.. పాత విషయాలే తప్ప కొత్తవేమీ లేవని అసహనం వ్యక్తం చేసింది. దర్యాప్తు అధికారిని మార్చాలని సూచించింది. అలా చేస్తే దర్యాప్తు సరళి దెబ్బతిని, మరింత జాప్యమయ్యే అవకాశం ఉందని వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది విన్నవించడంతో ప్రస్తుత అధికారిని కొనసాగిస్తూనే కొత్త అధికారిని నియమించాలంటూ నిర్దేశించింది. దీనిపై నిర్ణయాధికారాన్ని సీబీఐ డైరెక్టర్‌కే వదిలిపెడుతున్నామని, వారు బుధవారానికల్లా అభిప్రాయాన్ని తమకు చెప్పాలని ఆదేశించింది. వివేకా హత్య కేసులో సీబీఐ సక్రమంగా దర్యాప్తు చేయడం లేదని, అందువల్ల దర్యాప్తు అధికారిని మార్చాలంటూ ఈ కేసులో నిందితుడిగా ఉన్న డి.శివశంకర్‌రెడ్డి సతీమణి తులశమ్మ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై గత సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం దర్యాప్తు పురోగతిపై స్థాయీ నివేదిక దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. సోమవారం దీనిపై మరోమారు విచారణ చేపట్టింది. వాదనలు ప్రారంభమైన వెంటనే జస్టిస్ ఎంఆర్ షా సీబీఐ సమర్పించిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
కొత్త నివేదికలోనూ పాత విషయాలేనా?
‘సీబీఐ నివేదికలో గతంలో చెప్పిన విషయాన్నే చెప్పారు. గత స్థాయీ నివేదికతో పోల్చితే ఒక సహనిందితుడి వాంగ్మూలం మినహా కొత్త నివేదికలో ఎలాంటి పురోగతీ లేదు. దర్యాప్తులో ఎలాంటి పురోగతీ లేదు. అందువల్ల దర్యాప్తు అధికారిని మార్చమని మీ డైరెక్టర్‌కు చెప్పండి. 2019, 2020, 2021ల్లో ఇది జరిగింది.. అది జరిగిందని మాత్రమే నివేదికలో పేర్కొన్నారు. అందులో రాజకీయ శత్రుత్వం గురించి తప్ప ఇంకేమీ లేదు. అది అంతిమంగా శిక్షకు దారి తీయకపోవచ్చు. హత్యకు రాజకీయ శత్రుత్వం కారణం కావొచ్చు.. అయితే కేవలం ఉద్దేశాల ఆధారంగా నిందితులకు శిక్ష విధించడం సాధ్యం కాదు. తదుపరి దర్యాప్తు పూర్తి చేసి హత్య వెనుక ఉన్న విస్తృత కుట్ర కోణాన్ని తేల్చకపోతే విచారణ జరగదు’ అని సీబీఐ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. తదుపరి దర్యాప్తు ఇంకా ఎన్నేళ్లు కొనసాగిస్తారని ప్రశ్నించారు. ఏప్రిల్ చివరికల్లా దర్యాప్తు పూర్తి చేస్తామని నివేదికలో పేర్కొన్నట్లు నటరాజన్ విన్నవించారు. దర్యాప్తు జాప్యం చేయడానికి పిటిషనర్లు నిరంతరం కేసులు వేస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. జస్టిస్ షా స్పందిస్తూ క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు, ఆ కేసులకేమీ సంబంధం లేదన్నారు. స్థాయీ నివేదికలోని వివరాలు చూడాలని నటరాజన్ కోరగా అన్నీ చూశానని, హత్యకేసులో దర్యాప్తు చేసే తీరు ఇది కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇకపై అత్యంత వేగంగా పూర్తి చేస్తామని నటరాజన్ చెప్పారు. జస్టిస్ షా అందుకు అంగీకరించకుండా.. దర్యాప్తు అధికారిని మార్చాలని సీబీఐకి సూచించారు.
కేసులు వేసి, దర్యాప్తును జాప్యం చేస్తున్నారు..
వివేకానందరెడ్డి కుమార్తె సునీత తరఫున హాజరైన మహిళా న్యాయవాది జేసల్ జోక్యం చేసుకుంటూ ఈ కేసులో అనుమానితులు దర్యాప్తునకు అడ్డంకులు కల్పించడానికి పదేపదే కేసులు దాఖలు చేస్తున్నారని, దానివల్లే జాప్యం జరుగుతోందని చెప్పారు. కేసు దర్యాప్తు సరిగా జరగలేదని గతంలో మీరు కూడా రిట్ పిటిషన్ దాఖలు చేశారు కదా అని జస్టిస్ షా గుర్తు చేశారు. జేసల్ స్పందిస్తూ దర్యాప్తు జరగకుండా అడ్డుకుంటున్నారని నిందితులకు వ్యతిరేకంగా కేసు వేశాను కానీ, సీబీఐకి వ్యతిరేకంగా ఎలాంటి ఆరోపణలూ చేయలేదని పేర్కొన్నారు. ఆమె తన వాదనలను కొనసాగించబోగా.. జస్టిస్ షా స్పందిస్తూ ఈ కేసులో ఏ అధికారి ఉండాలన్నదానితో మీకేం సంబంధమని ప్రశ్నించారు. తాను ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశానని, అధికారిని మారిస్తే దర్యాప్తులో కంటిన్యుటీ దెబ్బతిని, అది మరింత జాప్యానికి దారితీస్తుందని జేసల్ చెప్పారు. ఆ విషయాన్ని సీబీఐ డైరెక్టర్ చూసుకుంటారన్న న్యాయమూర్తి.. ప్రస్తుత దర్యాప్తు అధికారి కొనసాగుతారు, అదనంగా మరో దర్యాప్తు అధికారి ఉంటారని పేర్కొన్నారు. ఏప్రిల్ నెలాఖరులోపు దర్యాప్తు పూర్తి చేస్తామని సీబీఐ చెప్పినందున వారికి ఒక అవకాశమివ్వాలని ధర్మాసనాన్ని జేసల్ కోరారు. జస్టిస్ షా జోక్యం చేసుకుంటూ మరో దర్యాప్తు అధికారిని నియమించండి.. ఇప్పుడున్న అధికారిని కూడా అదనంగా కొనసాగనివ్వండి అన్నారు. అందుకు సీబీఐ న్యాయవాది అంగీకరించారు. పిటిషనర్ బెయిల్ అడిగారని, దాన్ని తిరస్కరిస్తున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు. జస్టిస్ సీటీ రవికుమార్ జోక్యం చేసుకుంటూ ఫలానా వ్యక్తే దర్యాప్తు అధికారిగా ఉండాలని మీరెలా చెప్పగలుగుతారని సునీత తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. తర్వాత సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే స్పందిస్తూ సీబీఐపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, వారు ఏం నిర్ణయం తీసుకున్నా అంగీకారమేనన్నారు. జస్టిస్ షా స్పందిస్తూ కేసు దర్యాప్తు వేగంగా జరపాలని తామిచ్చిన ఉత్తర్వులను పాటించలేదన్నారు. ప్రస్తుత దర్యాప్తు అధికారి త్వరగా విచారణ పూర్తి చేయలేకపోతున్నప్పుడు ఆ అధికారిని మార్చండి, అతని సాయంతో తదుపరి దర్యాప్తు కొనసాగించండని సూచించారు. సీనియర్ అధికారిని నియమించొచ్చని సిద్ధార్థ దవే చెప్పగా.. ఇలాంటి విషయాల్లో మీరు సూచనలు చేయకపోవడమే మంచిదని జస్టిస్ షా సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Weather Update: తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
-
World News
China: భూగర్భంలోకి లోతైన రంధ్రం తవ్వుతున్న చైనా..!
-
India News
Education ministry: 10వ తరగతిలో.. 27.5లక్షల మంది ఫెయిల్..!
-
Crime News
Visakhapatnam: పెందుర్తిలో అర్ధరాత్రి రెచ్చిపోయిన రౌడీ మూకలు
-
Politics News
Andhra News: ఎంపీ అవినాష్ రెడ్డి కేసు అంతులేని కథ: గోరంట్ల
-
Sports News
CSK vs GT: ‘ఫైనల్’ ఓవర్లో హార్దిక్ అలా ఎందుకు చేశాడో..?: సునీల్ గావస్కర్