సంక్షిప్త వార్తలు (21)

బోయ/వాల్మీకి, బెంతో ఒరియాలను ఎస్టీ జాబితాల్లో చేర్చాలనే తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ 31న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెంచలయ్య, ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు.

Updated : 29 Mar 2023 05:51 IST

31న రాష్ట్రవ్యాప్త నిరసనలు

యానాదుల సంక్షేమ సంఘం వెల్లడి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: బోయ/వాల్మీకి, బెంతో ఒరియాలను ఎస్టీ జాబితాల్లో చేర్చాలనే తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ 31న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెంచలయ్య, ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. అన్ని జిల్లా, డివిజన్‌ కేంద్రాల్లో అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద నిరసనలు తెలియజేయాలని నిర్ణయించినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.


బోయ, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చే తీర్మానం రద్దుకు పోరాడాలి

మావోయిస్టు పార్టీ ఏవోబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి గణేష్‌

జి.మాడుగుల, న్యూస్‌టుడే: బోయ వాల్మీకులను, బెంతోరియా కులాలను ఎస్టీ జాబితాలో చేర్చుతూ శాసనసభలో తీర్మానం చేయడం ఆదివాసీల హక్కులను, అధికారాన్ని కాలరాయడమేనని మావోయిస్టు పార్టీ ఆంధ్రా - ఒడిశా బోర్డర్‌ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి గణేష్‌ అన్నారు. ఈ తీర్మానాన్ని రద్దు చేసే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఒక లేఖ విడుదల చేశారు. ఆదివాసీల ఓట్లతో గెలిచిన ఏడుగురు ఎమ్మెల్యేలు ఈ నిర్ణయాన్ని ఆమోదించి తాము దోపిడి వర్గ సేవకులమేనని నిరూపించుకున్నారని మండిపడ్డారు.

 


రాష్ట్రంలో ఎస్సీలను చంపేస్తున్నారు

హెచ్‌ఆర్సీకి అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఏపీలో దళితులపై దమనకాండ కొనసాగుతోందని, ఎస్సీలను చంపేస్తున్నారని కేంద్ర మానవ హక్కుల కమిషన్‌కు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య మంగళవారం లేఖ రాశారు. ‘45 నెలల వైకాపా పాలనలో తొలి బాధితులు దళితులే. మాస్క్‌ అడిగినందుకు డాక్టర్‌ సుధాకర్‌ను, మాస్క్‌ పెట్టుకోనందుకు చీరాల కిరణ్‌ను చంపేశారు. పక్కా ప్రణాళికతో డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని హతమార్చి శవాన్ని డోర్‌ డెలివరీ చేశారు.  కృష్ణాయపాలెంలో ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెట్టి దళిత రైతులను 24 రోజులు జైల్లో పెట్టారు. వైయస్సార్‌ జిల్లా పశుసంవర్థక శాఖ ఉన్నతాధికారి డాక్టర్‌ అచ్చెన్నను హతమార్చారు. దళిత మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. తన నియోజకవర్గానికి వెళ్లేందుకు భయంగా ఉందని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రాణహాని ఉందని చెప్పడం దళితులపై దారుణాలకు పరాకాష్ఠ. ఈ సంఘటనలపై విచారణ జరపాలి’ అని లేఖలో కోరారు.


ఎమ్మెల్యే శ్రీదేవిపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి

డీజీపీకి ఏపీఎమ్మార్పీఎస్‌ వినతి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న వారిపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ రాజేంద్రనాథరెడ్డిని ఏపీఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు కోరారు. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేకంగా ఎమ్మెల్యే శ్రీదేవి ఓటు వేశారనే అనుమానంతో వైకాపా అధిష్ఠానం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేని కులం పేరుతో దూషిస్తూ, అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారు’ అని వివరించారు.


ఏపీ పునర్విభజన అంశాలు చాలా అమలు చేశాం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌

ఈనాడు, దిల్లీ: ఏపీ పునర్విభజన చట్టం-2014లోని చాలా అంశాలు అమలు చేశామని, మరికొన్ని అమలు దశలో ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు. విజయవాడ, కడప ఎంపీలు కేశినేని నాని, వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంగళవారం సమాధానమిచ్చారు. మౌలిక వసతులు, విద్యాసంస్థల ఏర్పాటు వంటి వాటి అమలుకు చట్టంలో పదేళ్ల కాల పరిమితి విధించారని పేర్కొన్నారు. ఆయా అంశాల పురోగతిపై ఏపీ, తెలంగాణ నుంచి అందిన వినతుల మేరకు కేంద్ర హోంశాఖ ఆయా శాఖలు/విభాగాలతో ఇప్పటి వరకు 30 సమీక్షలు నిర్వహించిందని తెలిపారు. కొన్ని సమస్యల పరిష్కారానికి రెండు రాష్ట్రాలు పరస్పరం ఒప్పందానికి రావాల్సి ఉందన్నారు.  


ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు చర్యలు

ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు

తిరుపతి, న్యూస్‌టుడే: ఉద్యోగులకు రావాల్సిన అలవెన్సుల బకాయిలను సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. తిరుపతి గ్రామీణ మండలం చిగురువాడలోని ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు, పరపతి సంఘం (క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ- సీసీఎస్‌) రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం ఎన్‌ఎంయూ పాలకమండలి ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచి 300 మందికిపైగా సీసీఎస్‌ ప్రతినిధులు తరలివచ్చారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎండీ, సీసీఎస్‌ ఛైర్మన్‌ తిరుమలరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ‘సీసీఎస్‌’ ఉద్యోగులకు ఆర్థికంగా ఎంతో ఉపయోగ పడుతోందన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు.


విజయవాడ నుంచి కువైట్‌కు విమాన సర్వీసు నేడు ప్రారంభం

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా కువైట్‌కు ప్రతి బుధవారం ప్రత్యేక సర్వీసు నడపనున్నట్లు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సంస్థ ప్రకటించింది. ఈ నెల 29వ తేదీ నుంచి అక్టోబర్‌ 28 వరకు ఈ సర్వీసు కొనసాగనున్నట్లు పేర్కొంది. ఉదయం 9.55 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరనున్న విమానం మధ్యాహ్నం 2.40 గంటలకు కువైట్‌ చేరుకుంటుంది. తిరిగి అక్కడ 3.40 గంటలకు బయలుదేరి రాత్రి 8.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటుందని తెలిపింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ కోరింది.


విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలు పెంపొందించాలి: కమిషనర్‌

ఈనాడు, అమరావతి: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ అన్నారు. విద్య సమాజ మార్పునకు ఉపకరించే అత్యంత విలువైన ఆయుధమని, పరీక్షల్లో మార్కుల కంటే సృజనాత్మక ఆలోచనలు సృష్టించడమే ముఖ్యమని పేర్కొన్నారు. సమగ్ర శిక్ష అభియాన్‌, రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి సంయుక్తంగా విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అంకుర సాధికారిక అభివృద్ధి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసి, తీసుకొచ్చిన 52 ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లల్లో విజ్ఞాన నైపుణ్యాలను పెంపొందించాలని, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను కనుగొనేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో 4,776 మంది విద్యార్థులు బృందాలుగా ఏర్పడి, తమ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు పరిష్కార మార్గాలను అన్వేషించడం అభినందనీయమని తెలిపారు. విశాఖ జిల్లా అగనంపూడి పాఠశాలకు చెందిన సాయి, జయంత్‌, నరేంద్ర బృందానికి మొదటి బహుమతి, కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెదముత్తేవి ఎస్‌ఎల్‌ఎస్‌ ఓరియంటల్‌ పాఠశాలకు చెందిన విద్యార్థులు మల్లీశ్వరి, మేరీజ్యోస్న, రామసీతకు ద్వితీయ, చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం గుతర్లపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన మీనా, అతిఫా, వర్షా జట్టుకు తృతీయ బహుమతి లభించాయి.


ప్రజాపంపిణీ వ్యవస్థను.. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టే కుట్ర

ఈనాడు, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో.. ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టే కుట్ర జరుగుతోందని రేషన్‌ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావు విమర్శించారు. పౌరసరఫరాల సంస్థ నిర్వహణలో ఉన్న మండల స్థాయి నిల్వ కేంద్రాలను తొలగించి.. డీలర్లకు నేరుగా రైస్‌ మిల్లర్ల నుంచే బియ్యం పంపిణీ చేయించేందుకు తీసుకుంటున్న చర్యలను తాము వ్యతిరేకిస్తున్నామని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ‘ప్రభుత్వ నిర్ణయం కారణంగా మండల స్థాయి నిల్వ కేంద్రాల్లో పనిచేసే సుమారు 5వేల మంది హమాలీలు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. రాజకీయ ప్రాబల్యం కలిగిన రైస్‌మిల్లర్లు.. డీలర్లను భయభ్రాంతులకు గురిచేసి ఆధిపత్యం సాగించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి...’ అని ఆయన డిమాండు చేశారు. త్వరలో హమాలీ వర్కర్ల సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, తదుపరి కార్యాచరణ రూపొందించుకుని ఆందోళన చేస్తామని లీలా మాధవరావు తెలిపారు.


విద్యాహక్కు చట్టం నిబంధనకు సవరణ

ఈనాడు, అమరావతి: విద్యాహక్కు చట్టం నిబంధనకు రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. నిబంధన-10లోని సబ్‌ రూల్‌ ఆరు ప్రకారం విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థుల తరఫున ప్రభుత్వం రెండు విడతల్లో ఫీజులను ఆర్టీజీఎస్‌ లేదా నెఫ్ట్‌ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాకు చెల్లించాలి. సెప్టెంబరులో మొదటి విడత 50 శాతం, మిగతా మొత్తాన్ని జనవరిలో ప్రతి ఏటా చెల్లించాలి. దీన్ని నుంచి తప్పించుకునేందుకు ఏకంగా ఈ నిబంధనకు సవరణ చేసింది. అమ్మఒడి    కింద తీసుకునే డబ్బుల నుంచి తల్లిదండ్రులు ఫీజులు చెల్లించాలని పేర్కొంది. బ్యాంకు ఖాతాలో నిధులు పడిన 60 రోజుల తర్వాత కూడా తల్లిదండ్రులు ఫీజులు చెల్లించకపోతే ప్రభుత్వమే ఆ మొత్తాన్ని చెల్లించి, ఆ తర్వాత సంవత్సరం అమ్మఒడి నుంచి మినహాయించుకుంటుందని స్పష్టం చేసింది. అమ్మఒడి డబ్బుల నుంచి ఫీజులు చెల్లించుకుంటే ఇక విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాలు ఎందుకని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.


ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు 70.81% ఖర్చు

మంత్రి మేరుగు నాగార్జున  

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎస్సీ ఉపప్రణాళిక కింద కేటాయించిన రూ.18,518 కోట్లలో ఫిబ్రవరి చివరినాటికి రూ.13,112 (70.81%) కోట్లు ఖర్చు చేసినట్లు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. వంద శాతం నిధులు ఎస్సీలకే చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో ఎస్సీ ఉపప్రణాళిక(కాంపోనెంట్‌) 30వ నోడల్‌ ఏజెన్సీ సమావేశంలో మంత్రి మాట్లాడారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.18,518 కోట్లు కేటాయించినా.. కొన్ని శాఖలు అదనపు నిధులు కావాలని కోరడంతో ఆ మొత్తం రూ.20,605 కోట్లకు చేరాయన్నారు. నిధుల వినియోగంలో వెనుకబడిన శాఖలు పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు.


సాల్ట్‌ ప్రాజెక్టును పరిశీలించిన ప్రపంచబ్యాంకు బృందం

ఈనాడు, అమరావతి: ప్రపంచ బ్యాంకు రుణంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆంధ్ర అభ్యసన పరివర్తన (సాల్ట్‌)’ ప్రాజెక్టు అమలు తీరును ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం పరిశీలించింది. పలు పాఠశాలలను సందర్శించిన అనంతరం సచివాలయంలో మంగళవారం పాఠశాల విద్యాశాఖ అధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ.. సాల్ట్‌ కార్యక్రమం అమలులో పురోగతి, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రధాన కార్యక్రమాలను వివరించారు. క్షేత్రస్థాయిలో పాఠశాలలను సందర్శించిన సమయంలో గుర్తించిన అంశాలు, వారి అనుభవాలను ప్రపంచ బ్యాంకు బృందం అధికారులతో పంచుకుంది. రాబోయే ఐదేళ్లల్లో నిర్దేశించుకున్న సూచికలు మరింత మెరుగ్గా ఉండాలని, లక్ష్యాలను పెంచుకోవాలని ప్రపంచ బ్యాంకు భారత దేశ డైరెక్టర్‌ ఆగస్టె స్నో కౌమే సూచించారు. బాలికలు ఆంగ్ల భాషలో మాట్లాడడం బాగుందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం మెచ్చుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. సాల్ట్‌ ప్రాజెక్టు జులై 2021 నుంచి 2026 వరకు కొనసాగుతుందని, కొవిడ్‌ కారణంగా కార్యకలాపాలు గతేడాది ఫిబ్రవరి 9 నుంచి పూర్తి స్థాయిలో అమలవుతున్నాయని ప్రవీణ్‌ ప్రకాష్‌ తెలిపారు.


వైద్య పోస్టుల భర్తీకి స్పందన కరవు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల నియామకానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనకు వైద్యుల నుంచి స్పందన కరవైంది. వైద్య విధాన పరిషత్తు ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా, సామాజిక ప్రాంతీయ ఆసుపత్రుల్లో 14 విభాగాల్లో వైద్యుల నియామకాలకు మూడో విడత వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించగా.. 51శాతం మంది మాత్రమే విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపారు. ఈనెల 23 నుంచి 27 వరకు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించారు. పోస్టుల కంటే దరఖాస్తులే తక్కువగా వచ్చాయి. 319పోస్టులకు 316 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇందులో రెగ్యులర్‌గా 139, కాంట్రాక్టు విధానంలో 63మంది కలిపి 202మందిని ఎంపిక చేయగా.. ఉద్యోగాలు చేరేందుకు 162మంది మాత్రమే ముందుకు వచ్చారు.


ఆ నియామకాలతో అతిథి అధ్యాపకులకు ఇబ్బంది: శరత్‌

ఈనాడు, అమరావతి: జూనియర్‌ కళాశాలల్లో గతంలో పని చేసి, మానేసిన ఒప్పంద అధ్యాపకులను తిరిగి నియమిస్తుండడంతో తమ ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడుతోందని రాష్ట్ర అతిథి అధ్యాపకుల అసోసియేషన్‌ అధ్యక్షుడు శరత్‌ వెల్లడించారు. గతంలో వివిధ కారణాలతో ఉద్యోగాలు మానేసి వెళ్లిపోయిన ఒప్పంద అధ్యాపకులను మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఇలా 46 మంది ఉన్నారని తెలిపారు.  


పురపాలక ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలు మార్చాలి: ఎంటీఎఫ్‌

ఈనాడు, అమరావతి: పురపాలక ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనల్లో మార్పు చేయాలని అన్ని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయని పురపాలక ఉపాధ్యాయుల సమాఖ్య (ఎంటీఎఫ్‌) అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. పట్టణ మండల, డిప్యూటీ విద్యాధికారుల పోస్టులు లేకుండా చేశారని, జిల్లా యూనిట్‌గా సర్వీసు అమలు చేయడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయని తెలిపారు. పురపాలక, నగరపాలక సంస్థలను విడివిడిగా యూనిట్‌గా తీసుకొని బదిలీలు, పదోన్నతులు కల్పించాలని వెల్లడించారు. పురపాలక పాఠశాలల్లో రెండు మాధ్యమాలు కొనసాగించాలని, బోధనేతర సిబ్బందిని కొనసాగించాలని కోరారు.


‘కొల్లేరు’ కాలుష్య నివేదికకు ఏడాది సమయం

ఈనాడు, చెన్నై: కొల్లేరు సరస్సులో కాలుష్యం పెరుగుతుండటంతో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ దక్షిణాది జోన్‌ (చెన్నై) విచారణను సుమోటోగా స్వీకరించింది. కోరం సభ్యులు జస్టిస్‌ పుష్ప సత్యనారాయణ, డాక్టర్‌ సత్యగోపాల్‌ కొర్లపాటి విచారణ చేపట్టారు. సరస్సు నమూనాలపై నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చి ఇనిస్టిట్యూట్ నుంచి తుది నివేదిక రావడానికి ఏడాది సమయం పడుతుందని ఏపీ ప్రభుత్వం ఎన్జీటీకి వెల్లడించింది. వారి నుంచి వచ్చే మధ్యంతర నివేదికల్ని ఎప్పటికప్పుడు ఎన్జీటీకి సమర్పిస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. మరోవైపు కొల్లేరు అభయారణ్యంపై శాస్త్రీయ పరిశోధన చేపట్టిన ఏపీ కాలుష్య నియంత్రణ మండలి బృందం తమ నివేదికను అందజేసింది. నీరి నివేదికపై ప్రభుత్వ అభ్యర్థనను అంగీకరించిన సభ్యులు.. తదుపరి విచారణను మే 8కి వాయిదా వేశారు.


బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమకు 2 వేల ఎకరాల సేకరణ

ఈనాడు, దిల్లీ: కాకినాడ జిల్లా తొండంగి, ఎ.వి.నగరం రెవెన్యూ పరిధిలో బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన 2000.46 ఎకరాల భూమి సేకరించినట్లు కేంద్ర రసాయనాలు, ఎరువులశాఖ సహాయ మంత్రి భగవంత్‌ కుబ తెలిపారు. భాజపా రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్‌.నరసింహారావు అడిగిన ప్రశ్నకు మంగళవారం కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. రూ. 1672.41 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులో కామన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫెసిలిటీస్‌ (సీఐఎఫ్‌) వ్యయం రూ. 1,441 కోట్లు కాగా అందులో కేంద్ర వాటా రూ.వెయ్యి కోట్లని మంత్రి వెల్లడించారు.


గవర్నర్‌తో సమాచార హక్కు కమిషనర్ల భేటీ

ఈనాడు, అమరావతి: గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌తో సమాచార హక్కు ప్రధాన కమిషనర్‌ ఆర్‌.మహబూబ్‌ బాషా, కమిషనర్లు మంగళవారం భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి కమిషన్‌ కార్యకలాపాల గురించి నివేదించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో రాష్ట్ర సమాచార కమిషనర్లు కట్టా జనార్ధన రావు, ఐలాపురం రాజా, ఆర్‌.శ్రీనివాస రావు, యు.హరిప్రసాద్‌ రెడ్డి, కె.చెన్నారెడ్డి, పి.శామ్యూల్‌ జొనాథన్‌, కార్యదర్శి జి.శ్రీనివాసులు ఉన్నారు.


9 మంది అధికారులకు ఐపీఎస్‌లుగా పదోన్నతి

ఈనాడు-అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సర్వీసులకు చెందిన తొమ్మిది మంది గ్రూపు-1 అధికారులకు కన్ఫ్‌ర్డ్‌ ఐపీఎస్‌లుగా పదోన్నతి లభించింది. 2020 ప్యానల్‌ సంవత్సరానికి సంబంధించి షేక్‌ షరీన్‌ బేగం, కె.వి.మురళీకృష్ణ, కేఎం మహేశ్వర రాజు, కె.శ్రీనివాసరావు, ఎస్‌.శ్రీధర్‌, కె.తిరుమలేశ్వర్‌రెడ్డి, ఎస్‌.వి.మాధవ్‌రెడ్డిలకు, 2021 ప్యానల్‌కు సంబంధించి ఏటీబీఎస్‌ ఉదయరాణి, జి.శ్రీకాంత్‌లకు ఐపీఎస్‌ హోదా లభించింది. జాబితాలో ఉన్న బి.ఉమామహేశ్వర్‌పై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ పెండింగ్‌లో ఉన్నాయి. అవి పరిష్కారమై, ఇంటిగ్రిటీ సర్టిఫికేట్‌ పొందితే ఆయనకు పదోన్నతి లభిస్తుంది.


వైకాపా నాయకులు మా కుటుంబాలను రోడ్డున పడేశారు

దేవరపల్లి, న్యూస్‌టుడే: వారంతా వాయిదా పద్ధతిలో లారీలు కొనుగోలు చేసుకుని యూనియన్‌గా ఏర్పడ్డారు. ఓ ప్రయివేటు కర్మాగారానికి సరకు రవాణా చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అధికార వైకాపా పార్టీ నాయకుల కారణంగా ఇప్పుడు తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు నెలల నుంచి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొంటూ మంగళవారం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఇంటిముందు 60 మంది పురుగు మందుల డబ్బాలతో నిరసనకు దిగారు. ఆ సమయంలో ఎమ్మెల్యే లేరు. అక్కడ ఉన్న ఎస్సై శ్రీహరిరావు, పోలీసు సిబ్బంది వారిని అడ్డుకున్నారు. బుధవారం ఉదయం వచ్చి ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించాలని సూచించడంతో వెనుదిరిగారు. తమకు న్యాయం జరగకపోతే ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని బాధితులు హెచ్చరించారు.


జెన్‌కో సిబ్బందికి బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి

ఈనాడు-అమరావతి: ఏపీ జెన్‌కో సిబ్బందికి బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేస్తూ సంస్థ ఎండీ శ్రీధర్‌ ఆదేశాలు జారీ చేశారు. భోజన విరామ సమయంలోనూ బయోమెట్రిక్‌ను వినియోగించాల్సిందేనని మెమోలో పేర్కొన్నారు. ‘‘హాజరు ఆధారంగానే జీతాల చెల్లింపు ఉంటుంది. ఒకవేళ ఏదైనా సవరణ ఉంటే సంబంధిత కంట్రోలింగ్‌ అధికారి వివరణ ఇవ్వాలి. అలా కాకుంటే సెలవు కింద పరిగణనలోకి తీసుకుంటాం. 15 నిమిషాలు గ్రేస్‌ పీరియడ్‌ కింద అనుమతిస్తాం’’ అని మెమోలో వెల్లడించారు. కొత్త నిబంధనలు ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. విధులకు వచ్చేటప్పుడు, తిరిగి వెళ్లేటప్పుడు బయోమెట్రిక్‌ హాజరుపై అభ్యంతరం లేదని, భోజన విరామ సమయంలోనూ నమోదు చేయాలన్న నిబంధన విధించడమేంటని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దీనిపై ఉద్యోగుల ఐకాస నోటీసు అందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని