ఎస్సీలు, బీసీల భూముల్లో.. గ్రానైట్‌ తవ్వకాలపై ‘యథాతథ స్థితి’

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామ పరిధిలో ఎస్సీలు, బీసీలకు చెందిన 21 ఎకరాల్లో గ్రానైట్‌ మైనింగ్‌ కార్యకలాపాలపై యథాతథ స్థితి (స్టేటస్‌ కో) పాటించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

Published : 29 Mar 2023 04:10 IST

మంత్రి విడదల రజిని, ఎంపీ అవినాష్‌రెడ్డి మామకు హైకోర్టు నోటీసులు

ఈనాడు, అమరావతి: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామ పరిధిలో ఎస్సీలు, బీసీలకు చెందిన 21 ఎకరాల్లో గ్రానైట్‌ మైనింగ్‌ కార్యకలాపాలపై యథాతథ స్థితి (స్టేటస్‌ కో) పాటించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న చిలకలూరిపేట ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, వీరశివ గ్రానైట్స్‌, జీవీ దినేష్‌రెడ్డి గ్రానైట్స్‌ల ఎండీ జి.వీరప్రతాప్‌రెడ్డి (ఎంపీ అవినాష్‌రెడ్డి మామ), శ్వేతారెడ్డిలకు నోటీసులు జారీచేసింది. వారితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమలశాఖ, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులు, గనులశాఖ డైరెక్టర్‌, పల్నాడు జిల్లా కలెక్టర్‌, నరసరావుపేట ఆర్డీవో, చిలకలూరిపేట తహసీల్దార్‌ సుజాత, ఎస్సై రాజేష్‌, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి బాధ్యులు తదితరులకు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్‌ 10కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి మంగళవారం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. మురికిపూడి గ్రామంలోని సర్వేనంబరు 33/3ఏతో పాటు పలు సర్వేనంబర్లలో తమకు చెందిన డీకేపట్టా భూముల్లో గ్రానైట్‌ తవ్వకాల కోసం తహసీల్దార్‌ నిరభ్యంతరపత్రం జారీచేయడాన్ని, గనులశాఖ అధికారులు తవ్వకాలకు అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ జె.పున్నారావుతో పాటు మరో 19మంది హైకోర్టులో వ్యాజ్యం వేశారు. గ్రానైట్‌ లీజు అనుమతులపై స్టే విధించాలని కోరారు. తమ భూముల నుంచి ఖాళీ చేయించకుండా అధికారులను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. రెవెన్యూ రికార్డుల్లో పిటిషనర్ల పేర్లు ఇప్పటికీ ఉన్నాయని తెలిపారు. కొందరికి వంశపారపర్యంగా భూములు దఖలు పడ్డాయని, చాలా ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం వారిని భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని నివేదించారు. మంత్రి రజని, వీరప్రతాప్‌రెడ్డి ప్రోద్బలంతో తహసీల్దార్‌ ఎన్వోసీ ఇచ్చారని తెలిపారు. గ్రానైట్‌ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా మంత్రి రజిని వ్యవహరించారని వివరించారు. ఆ భూములు చెరువుకు, నివాస ప్రాంతానికి దగ్గరగా ఉన్నందున అందులో మైనింగ్‌ చేయడానికి వీల్లేదని, మైనింగ్‌కు కేటాయిస్తే పిటిషనర్ల జీవనాధారం దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. మైనింగ్‌ కార్యకలాపాలపై స్టేటస్‌కో ఉత్తర్వులిచ్చారు.


ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రావు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌కు నోటీసులు

ఇసుక అక్రమ తవ్వకాలకు  పాల్పడుతున్నారంటూ వ్యాజ్యం 

ఈనాడు, అమరావతి: ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ నియోజకవర్గం పరిధిలోని గని ఆత్కూర్‌, జొన్నలగడ్డ, కంచర్ల, ఐతవరం, మాగల్లు తదితర గ్రామాల్లో ఇసుక అక్రమ తవ్వకాలను నిలువరించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. ఇసుక అక్రమ తవ్వకం, రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా నేత, నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌, వారి బినామీ గుడె బుజ్జికి నోటీసులు జారీచేసింది. వారితోపాటు గనులశాఖ ముఖ్య కార్యదర్శి, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌, గనులశాఖ డైరెక్టర్‌, నందిగామ ఆర్డీవోకు నోటీసులు ఇచ్చింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రావు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌, గుడె బుజ్జి జరుపుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను నిలువరించడంలో అధికారులు విఫలమయ్యారని పేర్కొంటూ న్యాయవాది, ‘తెలుగు రాష్ట్ర సమితి’ రాజకీయపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జైభీమ్‌ శ్రీనివాస్‌ హైకోర్టులో పిల్‌ వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని