AP Govt: మార్చి నెల జీతాలు ఎప్పుడొస్తాయో?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నెల జీతాలు సకాలంలో అందుతాయా లేదా అన్న చర్చ అప్పుడే ప్రారంభమైంది.

Updated : 30 Mar 2023 09:00 IST

పెన్షన్లు ఎప్పటికి అందేనో?
జీతాల బిల్లులు సమర్పించేందుకు ఆలస్యంగా అవకాశం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నెల జీతాలు సకాలంలో అందుతాయా లేదా అన్న చర్చ అప్పుడే ప్రారంభమైంది. సాధారణంగా ఉద్యోగులు తమ జీతాల బిల్లులు ప్రతి నెలా ఈ పాటికే చాలా వరకు సమర్పిస్తుంటారు. ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో సీఎఫ్‌ఎంఎస్‌ వెబ్‌సైట్‌ చాలా రోజులుగా మూతపడి ఉంది. జీతాల బిల్లులను సమర్పించేందుకు సోమవారం రాత్రి మాత్రమే ఈ వెబ్‌సైట్‌ను డ్రాయింగ్‌ డిస్‌బర్సుమెంటు, ఖజానా అధికారులకు అందుబాటులో ఉంచారు. బిల్లులు సమర్పించేందుకు ఈ నెలాఖరు వరకు అవకాశం ఇచ్చారు. దాంతో జాప్యం జరగవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నిధుల సమీకరణకు మరికొంత సమయం

జీతాలు, పెన్షన్లు చెల్లింపులకు అవసరమైన నిధులు అందుబాటులో ఉండటమూ కీలకాంశమే. గత కొద్ది నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో సమీకరించే రుణాలు, వేస్‌ అండ్‌ మీన్స్‌ (చేబదుళ్లు) అడ్వాన్సులపై ఆధారపడి జీతాలు, పెన్షన్లను చెల్లిస్తూ వస్తోంది. కొద్ది రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతోంది. రిజర్వుబ్యాంకు నుంచి రుణాలు తీసుకోవాలన్నా కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉంటుంది. ఇందుకు సమయం పడుతుందని అధికారిక వర్గాలే పేర్కొంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఎంత, రాష్ట్ర ప్రభుత్వం ఏ రూపేణా ఎన్ని నిధులు రుణంగా పొందుతోంది? మిగిలిన మేర ఏడాది మొత్తానికి బహిరంగ మార్కెట్‌ రుణం ఎంత మేరకు అనుమతులు ఇవ్వనున్నారు అనే అంశాలు కేంద్ర ఆర్థిక శాఖ తేల్చాల్సి ఉంటుంది. ఇందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉత్తర, ప్రత్యుత్తరాలు జరగాల్సి ఉంది. ఆ అనుమతులు వచ్చే లోపు సాధారణంగా రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ముందస్తుగా కొంత రుణం కోసం అనుమతులు కోరే అవకాశమూ ఉంది. వాటికి అనుమతులు రావడానికి సమయం పట్టవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జీతాలు, పెన్షన్లకు అవసరమైన నిధుల సమీకరణకు కొంత సమయం పట్టే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.

ప్రతికూల నిల్వ సాధ్యం కాదు

ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరి రోజుల్లో.. అనేక బిల్లులు, ఇతరత్రా చెల్లించాల్సి ఉంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.4,000 కోట్ల వరకు వివిధ అవసరాల నిమిత్తం ఖర్చు చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. నెలాఖరులోగా వేస్‌ అండ్‌ మీన్స్‌ సౌలభ్యాన్ని కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా రిజర్వుబ్యాంకు కల్పించిన వెసులుబాట్లు ఉపయోగించుకుని మైనస్‌ నిల్వతో ప్రారంభించేందుకు ఆస్కారం లేదు. అందువల్ల వేస్‌ అండ్‌ మీన్స్‌ వంటి వాటి నుంచి మరో మూడు రోజుల్లో బయటపడాల్సి ఉంటుంది. ఆ మేరకు నిధులు సమకూర్చుకోవాలి. మరో వైపు సామాజిక పెన్షన్ల నిమిత్తం ఏప్రిల్‌ ఒకటి నాటికి దాదాపు రూ.1,600 కోట్లు, జీతాలు, పెన్షన్ల రూపంలో దాదాపు రూ.5,000 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో మార్చి నెల జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో చెల్లించేందుకు ఎంతకాలం పడుతుందో అనే చర్చ సంబంధిత వర్గాల్లో జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని