బ్రాండిక్స్‌కు ఇచ్చిన భూమిలో 500 ఎకరాలు ఖాళీ
అనకాపల్లి జిల్లాలో ఏర్పాటైన బ్రాండిక్స్ ఇండియా అపరెల్ సంస్థ ఏర్పాటై పదేళ్లయినా పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేకపోతోందని కాగ్ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.
పదేళ్లైనా పూర్తిస్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేదు
ప్రారంభానికి నోచని నెల్లూరు ఎంఏఎస్ ఫ్యాబ్రిక్ పార్క్
ఆక్షేపించిన కాగ్
ఈనాడు, దిల్లీ: అనకాపల్లి జిల్లాలో ఏర్పాటైన బ్రాండిక్స్ ఇండియా అపరెల్ సంస్థ ఏర్పాటై పదేళ్లయినా పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేకపోతోందని కాగ్ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఆ సంస్థకు కేటాయించిన వెయ్యి ఎకరాల స్థలంలో ఇప్పటికీ 500 ఎకరాలు ఖాళీగా ఉన్నట్లు ఆక్షేపించింది. సంస్థ ఏర్పాటై పదేళ్లు పూర్తయినా పూర్తిస్థాయిలో ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణలో, అనుకున్న స్థాయిలో టెక్స్‌టైల్ యూనిట్ల ఏర్పాటు లక్ష్యాలను చేరుకోలేక పోయిందని పేర్కొంది. ఇక్కడ 60వేల ఉద్యోగాలు కల్పించాలన్నది లక్ష్యంగా కాగా 19వేల మందికే కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ప్రాజెక్టు పూర్తికావడంలోనూ 27నెలల జాప్యం జరిగినట్లు తెలిపింది. అ విషయాలను గురించి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే 14 యూనిట్లు ఏర్పాటు చేయడానికి ఈ సెజ్‌కు అనుమతులు ఇచ్చామని, ఈ పార్కు ప్రారంభమైన తరవాత సెజ్ యూనిట్లపై కనీస ప్రత్యామ్నాయ పన్ను విధింపు, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ విషయంలో పలు విధానపరమైన మార్పులు వచ్చినట్లు తెలిపింది. అది సెజ్‌లోని యూనిట్లకు ఇచ్చిన ఆదాయపన్ను మినహాయింపుపై తీవ్ర ప్రభావం చూపినట్లు కేంద్రం వివరణ ఇచ్చింది. వీటి కారణంగా పెట్టుబడుల ఆకర్షణలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపింది. అయినా కొత్త పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఇక్కడ నడుస్తున్న 15 యూనిట్లలో 21వేల మంది పనిచేస్తున్నారని, మొత్తం పెట్టుబడులు రూ.1,098 కోట్లకు చేరాయని వివరించింది. మరిన్ని పెట్టుబడులు తీసుకురావడానికి మరింత ప్రయత్నం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం ద్వారా ఆడిట్ పరిశీలనలను అంగీకరించినట్లైందని కాగ్ పేర్కొంది.
ఇప్పటికీ ప్రారంభం కాని ఎంఏఎస్ ఫ్యాబ్రిక్ పార్క్
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో 581.68 ఎకరాల్లో ఏర్పాటు చేయాలనుకున్న ఎంఏఎస్ ఫ్యాబ్రిక్ పార్క్ ఇప్పటికీ ప్రారంభం కాలేదని కాగ్ పేర్కొంది. ఇక్కడ కంచెతో ప్రహరీ, కొన్ని రోడ్లు, ఒక గార్మెంట్ యూనిట్ నిర్మించడం మినహా మరే పనీ జరగలేదని తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏర్పాటైన స్పెషల్ పర్పస్ వెహికిల్(ఎస్‌పీవీ) సెజ్ స్థానంలో డొమెస్టిక్ టారిఫ్ ఏరియా (డీటీఏ)లో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుచేయాలని ప్రణాళికను మార్చినట్లు కాగ్ తెలిపింది. సెజ్‌ను డీనోటిఫై చేసి డీటీఏగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ నిరభ్యంతర పత్రం రాలేదని పేర్కొంది. ఇక్కడ యూనిట్లు ఏర్పాటుచేయడానికి అవసరమైన అనుమతులనూ ఎస్‌పీవీ ఇంతవరకూ పొందలేదని గుర్తుచేసింది. ఈ పార్కుకు కేంద్ర ప్రభుత్వం రూ.24కోట్లు విడుదల చేసిందని.. రూ.1,982 కోట్ల పెట్టుబడులు రావాల్సి ఉండగా కేవలం రూ.44.41 కోట్లే వచ్చాయని 16 యూనిట్లలో ఒక్కటీ ప్రారంభం కాలేదని కాగ్ వివరించింది. 31 వేల మందికి ఉపాధి కల్పించాల్సి ఉన్నా ఒక్కరికీ ఉద్యోగం రాలేదని తెలిపింది. ఇప్పటికీ దీని నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపిందని కాగ్ విచారం వ్యక్తం చేసింది.
* రూ.102.27 కోట్లతో 2006 జులై 1న మంజూరైన హిందూపుర్ వ్యాపార్ అపరెల్ పార్క్‌కు కేంద్ర ప్రభుత్వం తన వాటా రూ.40 కోట్లలో రూ.24 కోట్లు ఇచ్చిందని, ఇప్పటికీ ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయని కాగ్ ఆక్షేపించింది.
* అదే రోజు అనంతపురానికి మంజూరు చేసిన మరో పార్కు రద్దయినట్లు తెలిపింది.
* రూ.101.39 కోట్లతో 2011 సెప్టెంబర్‌లో మంజూరైన లేపాక్షి ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్క్ కూడా రద్దయినట్లు వెల్లడించింది.
* 2015 మార్చి 24న రూ.103.44 కోట్లతో మంజూరైన తారకేశ్వర్ పార్క్‌కి కేంద్రం తాను సమకూర్చే రూ.40 కోట్లలో రూ.20 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టు కూడా ఇంకా కొనసాగింపు దశలోనే ఉన్నట్లు పేర్కొంది.
* 2014 సెప్టెంబర్ 20న రూ.105.12 కోట్లతో మంజూరైన గుంటూరు టెక్స్‌టైల్ పార్క్ కూడా ఇదే పరిస్థితిలో ఉందని వెల్లడించింది.
* రూ.131.73 కోట్లతో 2014 సెప్టెంబర్ 20న మంజూరైన రంగరాయ టెక్స్‌టైల్ పార్క్, 2014 నవంబర్ 9న రూ.102.91 కోట్లతో మంజూరైన గౌతమ్ బుద్ధ టెక్స్‌టైల్ పార్క్ రద్దయినట్లు తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
నా భర్త కళ్లలో చెదరని నిశ్చలత చూశా
-
India News
ప్రపంచంలో ఎక్కడినుంచైనా శబరి గిరీశునికి కానుకలు
-
India News
ప్రతి 5 విద్యార్థి వీసాల్లో ఒకటి భారతీయులకే.. అమెరికా రాయబారి వెల్లడి
-
World News
Space: ఇకపై అంతరిక్షంలో వ్యోమగాములు ఫ్రెంచ్ ఫ్రైస్ తినొచ్చు!
-
India News
Odisha Train Accident: ఏఐ సాంకేతికతతో మృతదేహాల గుర్తింపు!
-
Movies News
Social Look: ఐస్‌క్రీమ్‌తో రకుల్‌ప్రీత్.. చెప్పుతో తేజస్విని.. తమన్నా ప్రచారం!