విశాఖ నుంచి ఎయిర్‌ కార్గో సేవలకు ఆటంకం

విశాఖ విమానాశ్రయం నుంచి సరకు రవాణా (ఎయిర్‌ కార్గో) సేవలపై ప్రభుత్వం ఇంతవరకూ దృష్టి పెట్టకపోవడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.

Updated : 01 Apr 2023 05:39 IST

బీసీఏఎస్‌ నిబంధనల అమలులో జాప్యం
మార్చి 31తో ముగిసిన మూడు నెలల సడలింపు గడువు

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయం నుంచి సరకు రవాణా (ఎయిర్‌ కార్గో) సేవలపై ప్రభుత్వం ఇంతవరకూ దృష్టి పెట్టకపోవడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. బీసీఏఎస్‌ (బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ) కొత్త నిబంధనలు అమలుచేయడంలో విశాఖ విమానాశ్రయం తడబడటంతో ఈ సేవల్లో అంతరాయం తలెత్తే పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఎయిర్‌ కార్గోలో సరకును భద్రతా పరిశీలన (సెక్యూరిటీ స్క్రీనింగ్‌) చేసి, ఆ తర్వాత తీసుకెళతారు. పాత పద్ధతిలో విమానయాన సంస్థలే సొంత సిబ్బంది, స్కానింగ్‌ యంత్రాలతో తనిఖీలు చేసుకునేవి. ఇది సరికాదని భావించిన బీసీఏఎస్‌ కొత్త నిబంధన పెట్టింది. అన్ని విమానయాన సంస్థలకు ఒకే సెక్యూరిటీ స్క్రీనింగ్‌ జరగాలని స్పష్టం చేసింది. ఈ నిబంధన వెంటనే అమలుచేయాలని మూడు నెలల క్రితం తెలిపారు. విశాఖ విమానాశ్రయం కూడా సొంతంగా సరకు తనిఖీ వసతులు, సిబ్బందిని సమకూర్చుకోవాలని ఆదేశించారు. ఈ నిబంధనల అమలులో విఫలమైన 14 విమానాశ్రయాలకు మూడు నెలల క్రితం కార్గో సేవల అనుమతి నిలిపివేశారు. వాటిలో విశాఖ కూడా ఉంది. రొయ్య పిల్లల ఎగుమతుల సీజన్‌ కనుక మూడు నెలల పాటు రవాణాకు అవకాశం ఇవ్వాలని కేంద్రానికి వెళ్లిన వినతుల మేరకు అందివచ్చిన సడలింపు గడువు సైతం మార్చి 31తో ముగిసింది. శనివారం నుంచి ఉత్తరాంధ్రలోని పలు ఉత్పత్తులను వేగంగా తరలించేందుకు వెసులుబాటు లేని పరిస్థితి నెలకొంది.

నివేదికలు జతపరిచి: విశాఖ విమానాశ్రయంలో అరకొరగా కొందరు సిబ్బందిని, కొన్ని పరిశీలనా పరికరాలను ఏర్పాటుచేశారు. వీటిని తాజాగా బీసీఏఎస్‌ తనిఖీ చేసింది. తక్కువ డిమాండు ఉందని, ఉన్న స్క్రీనర్లు, సిబ్బందితో సర్దుకుంటాం అనుమతివ్వాలని విమానాశ్రయ అధికారులు విన్నవించారు. ఎయిర్‌ కార్గోలో విశాఖ భారతదేశంలో తొమ్మిదోస్థానంలో ఉందని, కార్గో ఆగిపోవడం సబబు కాదని ఎడ్వయిజరీ బోర్డు ఛైర్మన్‌, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ దృష్టికి ఎయిర్‌ ట్రావెలర్స్‌ అసోసియేషన్‌ తీసుకెళ్లింది. విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టరు పేర్కొన్న కార్గో నివేదికలు జతపరుస్తూ విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఎంపీ లేఖ రాశారు. శుక్రవారం బీసీఏఎస్‌, సివిల్‌ ఏవియేషన్‌ సెక్రటరీతో ఫోన్‌లో మాట్లాడారు. వినతి పరిశీలనతో ఉందని, వెంటనే పరిష్కరిస్తామని సమాధానమిచ్చినట్లు ఎంపీ ‘ఈనాడు’తో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని