Illegal Soil Mining: ముళ్ల కంచెలు వేసి.. కందకాలు తవ్వి

వాహనాలు వెళ్లకుండా అడ్డంగా కందకాలు.. ముళ్లకంచెల ఏర్పాటు.. రకరకాలుగా ఆటంకాలు.. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆదేశాల మేరకు అక్రమ క్వారీల పరిశీలనకు వెళ్లిన బృందానికి మట్టి మాఫియా నుంచి ఎదురైన చేదు అనుభవాలివి.

Updated : 22 Apr 2023 12:57 IST

ఎన్జీటీ బృందానికి అడుగడుగునా అడ్డంకులు
విజయవాడ సమీపంలో మట్టి మాఫియా తీరు

ఈనాడు, అమరావతి: వాహనాలు వెళ్లకుండా అడ్డంగా కందకాలు.. ముళ్లకంచెల ఏర్పాటు.. రకరకాలుగా ఆటంకాలు.. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆదేశాల మేరకు అక్రమ క్వారీల పరిశీలనకు వెళ్లిన బృందానికి మట్టి మాఫియా నుంచి ఎదురైన చేదు అనుభవాలివి. పలు చోట్ల నడవ వీలులేక అధికారులు కిందపడ్డారు. పట్టుదలతో ముందుకుసాగి అక్రమాలను గమనించి అవాక్కయ్యారు. ప్రభుత్వ యంత్రాంగం ఉందా? అన్న అనుమానాలను వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ గ్రామీణ మండలంలో మట్టి తవ్వకాలను ఎన్‌జీటీ విచారణ బృందం శుక్రవారం పరిశీలించింది. మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలంలోనూ పర్యటించింది. అధికారులు ఆయా ప్రాంతాలకు వెళ్లకూడదనే ఉద్దేశంతో అక్రమార్కులు ముందుగానే ఆటంకాలను సృష్టించారు. వీటిని అధిగమిస్తూ వెళ్లిన ఎన్‌జీటీ అధికారులు మట్టి కోసం ఇంత లోతుగా, ఎక్కువ విస్తీర్ణంలో అక్రమార్కులెలా తవ్వగలిగారని స్థానిక అధికారులను ప్రశ్నించారు. కొన్ని వందల ఎకరాల్లో మట్టి తవ్వకాలు వారికి కనిపించాయి. వీటిలో ఒక్క దానికీ పర్యావరణ, రెవెన్యూ అనుమతులు లేవని అధికారులు తెలిపారు. సమగ్ర నివేదికనిస్తామని సబ్‌కలెక్టర్‌ అదితి సింగ్‌ విలేకరులకు చెప్పారు. ఫిర్యాదు ప్రకారం ఎన్‌జీటీ సూచించిన గ్రామాలకే ఎన్‌జీటీ బృందం పరిమితమైంది. వెలగలేరులో 50 ఎకరాల క్వారీని పరిశీలించవద్దనే ఉద్దేశంతో అక్రమార్కులు తవ్విన ప్రాంతానికి వెళ్లేందుకు అధికారులు వాహనాలు దిగి కందకాలను దాటుతూ రెండు కి.మీ.నడిచారు. వెళ్లలేని ప్రాంతాలను డ్రోన్‌తో పరిశీలించారు. ఎన్‌జీటీ బృందానికి మరోసారి స్థానిక అధికారులనుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. పరిశీలనకు గనులు, భూగర్భ వనరులు, జలవనరుల శాఖ అధికారులు గైర్హాజరయ్యారు. సమాచారం లేదని, తమ ఉన్నతాధికారులనుంచి ఆదేశాలు లేవనే సమాధానాలు వారినుంచి వస్తున్నాయి.

రెండోసారి పర్యటన

మట్టి తరలింపుపై పిల్లి సురేంద్రబాబు ఎన్‌జీటీని లోగడ ఆశ్రయించారు. దీనిపై మార్చి 20న బృందం పర్యటించింది. నాడు అధికారులు సక్రమంగా పరిశీలించలేదని ఫిర్యాదుదారు మరోసారి ఎన్‌జీటీకి లేఖ రాశారు. దీంతోవారు మళ్లీ వచ్చారు. ఈసారి బృందంలో కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ రీజినల్‌ సెంటర్‌ (విజయవాడ) జాయింట్‌ డైరెక్టర్‌ పి.సురేష్‌బాబు, ప్రాంతీయ అటవీ అధికారి శ్రీనివాసులరెడ్డి, డీఎఫ్‌ఓ త్రిమూర్తులు, రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులున్నారు.

* మైనింగ్‌పై సీబీఐ విచారించాలని ఎన్‌జీటీకి ఫిర్యాదు చేసిన పిల్లి సురేంద్రబాబు డిమాండ్‌ చేశారు. దాదాపు 750 ఎకరాల్లో అక్రమంగా మట్టిని తరలించారని ఆరోపించారు. దీనిలో భాగంగానే ఎన్‌జీటీని ఆశ్రయించానని, హైకోర్టులోనూ వ్యాజ్యం వేశానని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని