Simhachalam: ఏ ఆలయ ఉత్సవమైనా పోలీసులదే హడావుడి

ఏదైనా ఆలయంలో ముఖ్యమైన పర్వదినాలు, ఉత్సవాల సమయంలో భక్తులు ఎంతమంది వస్తారు? వారందరికీ దర్శనం ఎలా కల్పించాలనే దానిపై దేవాదాయశాఖ అధికారులకు, సదరు ఆలయ ఉద్యోగులకు పూర్తి అవగాహన ఉంటుంది.

Updated : 26 Apr 2023 10:24 IST

దేవాదాయ ఉద్యోగులను పట్టించుకోని వైనం
భక్తుల ఇక్కట్లకు ఇదీ ఓ కారణం

ఈనాడు, అమరావతి: ఏదైనా ఆలయంలో ముఖ్యమైన పర్వదినాలు, ఉత్సవాల సమయంలో భక్తులు ఎంతమంది వస్తారు? వారందరికీ దర్శనం ఎలా కల్పించాలనే దానిపై దేవాదాయశాఖ అధికారులకు, సదరు ఆలయ ఉద్యోగులకు పూర్తి అవగాహన ఉంటుంది. సంప్రదాయాలను పాటిస్తూ, భక్తులకు దర్శనం కల్పించడంపై వారంతా ముందుగా సమాలోచనలు చేస్తుంటారు. రద్దీని నియంత్రించేందుకు, క్యూలైన్లు సక్రమంగా నడిచేందుకు, తొక్కిసలాటల వంటివి జరగకుండా చూసేందుకు పోలీసుల సాయం తీసుకుంటారు. రెండు విభాగాలూ సమన్వయం చేసుకొని పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కువ సందర్భాల్లో పర్యవేక్షణను పోలీసులు తమ చేతుల్లోకి తీసుకొని, దేవాదాయ శాఖ అధికారుల సూచనలను పక్కనపెడుతుండటం విమర్శలకు తావిస్తోంది.

సరైన ఏర్పాట్లు చేయడంలో ఆలయ అధికారుల వైఫల్యం, పోలీసుల తీరు భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. తమకు తెలిసున్నవాళ్లను, బంధువులను నిబంధనలకు విరుద్ధంగా పెద్దసంఖ్యలో ప్రొటోకాల్‌, వీఐపీ లైన్ల ద్వారా దర్శనాలకు పంపి పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. సింహాచలం చందనోత్సవం సందర్భంగా అప్పన్న నిజరూప దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు గతంలో ఎన్నడూలేనంతగా ఈసారి ఇబ్బందులు ఎదుర్కోవడానికి అధికారుల నిర్ణయాలతో పాటు, పోలీసుల తీరూ ఓ కారణమనే విమర్శలున్నాయి. ఇక్కడే కాకుండా శ్రీశైలం, విజయవాడ దుర్గగుడి, కాణిపాకం, శ్రీకాళహస్తి వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నింటిలో ఏటా వివిధ పర్వదినాల సమయంలో ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. దేవాదాయ అధికారులు సైతం, పోలీసులకు ముందుగానే పక్కాగా సూచనలు చేసి, వారితో సమన్వయం చేసుకోవడంలో విఫలమవుతున్నారు.

ఉద్యోగులని చెప్పినా పట్టించుకోలేదు

* సింహాచలం అప్పన్న చందనోత్సవంలో ఆలయం లోపల ఉద్యోగులు ఎక్కువ మందిని విధులు నిర్వహించనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. దేవాదాయశాఖ అధికారులు ముందుగానే ఉత్తరాంధ్రలోని అయిదారు జిల్లాల నుంచి సహాయ కమిషనర్లు, వివిధ ఆలయాల ఈవోలను చందనోత్సవ విధుల కోసం రప్పించారు. వీరిలో ఎక్కువ మందిని వారికి కేటాయించిన చోటికి  పోలీసులు వెళ్లనివ్వలేదు. తాము దేవాదాయశాఖ ఉద్యోగులమని చెప్పినా పట్టించుకోలేదు. స్వామి దర్శనం చేసుకొని భక్తులు బయటికొచ్చేవైపు నుంచి పోలీసులు తమకు తెలిసినవారు, బంధువులను పెద్దసంఖ్యలో లోపలికి పంపడం కనిపించింది.

* విజయవాడ దుర్గగుడిలో దసరా ఉత్సవాల్లో భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఆ తొమ్మిది రోజులూ ఇంద్రకీలాద్రిపై పోలీసుల హడావుడి ఎక్కువగా ఉంటుంది. గతేడాది జరిగిన నవరాత్రి ఉత్సవాల సమయంలో వీఐపీలను ఘాట్‌రోడ్‌లోకి అనుమతించకుండా.. లిఫ్ట్‌ద్వారా దర్శనానికి పంపి, అదే మార్గంలో మళ్లీ కిందకు వచ్చేలా చేయాలని దేవాదాయ మంత్రి, ఆ శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధంచేశారు. దీనివల్ల ఘాట్‌రోడ్‌లో వీఐపీల వాహనాల రాకపోకలు ఉండవని, సాధారణ భక్తులకు ఎక్కువ క్యూలైన్లు ఏర్పాటు చేయవచ్చని భావించారు. చివరకు పోలీసు అధికారులు, కలెక్టర్‌, స్థానిక ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెచ్చి.. వీఐపీలు వాహనాల్లో ఘాట్‌రోడ్‌ ద్వారా కొండపైకి వెళ్లేలా మార్పులు చేశారు. దీనివల్ల వీఐపీలతో పాటు నేతలు, వారి అనుయాయులు భారీ సంఖ్యలో వాహనాల్లో కొండపైకి చేరుకున్నారు. దీంతో సాధారణ భక్తులు ఇబ్బందులు పడ్డారు.

* శ్రీశైలంలో శివరాత్రి బహ్మ్రోత్సవాలు, కార్తిక మాసం, ఉగాది రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఆ రోజుల్లో పోలీసులే అక్కడ హడావుడి చేస్తుంటారు. హరిహరరాయ గోపుర ద్వారం నుంచి తమకు తెలిసున్నవాళ్లను పెద్దసంఖ్యలో లోపలికి దర్శనానికి పంపిస్తుండటం రివాజుగా మారింది.

* వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలు, ఆంగ్ల సంవత్సరాదికి కాణిపాకంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. జనవరి ఒకటిన దాదాపు లక్ష మంది వినాయకున్ని దర్శించుకుంటారు. అలాంటి సందర్భాల్లోనూ ఆలయ ఉద్యోగులపై పోలీసులదే పైచేయిగా ఉంటుందనే విమర్శలున్నాయి.

* శ్రీకాళహస్తిలో శివరాత్రి రోజున భక్తుల రద్దీ అధికం. మూడు, నాలుగేళ్లుగా ఆ రోజున పోలీసుల జోక్యం ఎక్కువైందని ఉద్యోగులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని