Dharmana: ఇష్టముంటే ఓటేయండి.. లేకపోతే మానేయండి: మంత్రి ధర్మాన అసహనం

‘ఇష్టముంటే ఓటేయండి.. లేకపోతే మానేయండి’ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజలనుద్దేశించి పరుషంగా వ్యాఖ్యానించారు.

Updated : 30 Apr 2023 15:21 IST

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: ‘ఇష్టముంటే ఓటేయండి.. లేకపోతే మానేయండి’ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజలనుద్దేశించి పరుషంగా వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పాత్రునివలసలో నిర్మించిన టిడ్కో ఇళ్లను శనివారం మంత్రి ఆదిమూలపు సురేశ్‌తో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ధర్మాన మాట్లాడారు.

‘పేదల పని అంటే సీఎం జగన్‌ ఆషామాషీగా తీసుకోరు. అధికారులకు సూచనలిచ్చినప్పుడు అన్నీ పక్కాగా ఉండాలని చెబుతారు. పిచ్చోడు, క్రాక్‌ అయితే ఇలాంటి పనులన్నీ చేస్తారా..? మీకు ఇష్టముంటే ఓటేయండి.. లేకపోతే మానేయండి. అది వేరే విషయం. కానీ అలా మాట్లాడటం తప్పు. ఈరోజు మీరంతా సంతోషంగా ఉండటానికి కారణం వైకాపా ప్రభుత్వం, దాని అధినేత జగన్‌. చప్పట్లు కొట్టమన్నా మనకి చేతకాదు. అంతటి గొప్ప హృదయం ఉన్నవాళ్లం మనం.

ఇంట్లో ఉండి తెలిసీ తెలియని విషయాలు టీవీలో, పేపర్లలలో చూసి అదే నిజమనుకుంటాం. తగలబెట్టేస్తున్నారండీ రాష్ట్రాన్ని అంటారు. ఎవరి వల్ల తగలబడిపోయింది. మీ వల్లే.. మీకు డబ్బులు ఇవ్వడం వల్లే రాష్ట్రం తగలబడిపోయిందని అనుకుంటే అనుకోండి. మీ పిల్లల్ని చదివించడం, ఇల్లు కట్టించి ఇవ్వడం తగలబెట్టేయడమా? ప్రతినెలా మీకు వస్తున్న డబ్బులు ఎక్కడివి. ఎవరో అంటే మీరు అనేయడమే. కొంచెం అర్థం చేసుకోండి. ఓట్ల కోసం కాదు. ఎన్నికల్లో పోటీ చేయనని ముఖ్యమంత్రికి చెప్తున్నా. పదవులు కావాల్సిన వాళ్లే జగన్‌ను సైకో అని.. పిచ్చోడు అని అంటున్నారు.

గతంలో జన్మభూమి కమిటీ వాళ్లు టిడ్కో ఇళ్ల కోసం డబ్బులు తీసుకున్నారు. అలా తీసుకున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే వారిని జైల్లో పెట్టిస్తా. టిడ్కో ఇళ్లు రద్దయినవాళ్లు మమ్మల్ని డబ్బులడుగుతున్నారు. మాకు మీరు డబ్బులు ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు. కొవిడ్‌ బాధితులకు క్వారంటైన్‌ కేంద్రంగా వినియోగించిన ఇళ్లలోని మరుగుదొడ్లను శుభ్రం చేయకుండానే తమకు అప్పగిస్తున్నారని ఓ లబ్ధిదారుడు మంత్రుల దృష్టికి తీసుకురాగా... ‘రూ.10 లక్షల విలువైన గృహాలు తీసుకుంటున్నారు. ఆ మాత్రం మరుగుదొడ్లను శుభ్రం చేసుకోలేరా.. దీన్ని కూడా మా వరకు తీసుకురావాలా?’ అని మంత్రి ధర్మాన బదులివ్వడంతో లబ్ధిదారులు విస్మయానికి గురయ్యారు. మరోవైపు తెదేపా హయాంలో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించిన టిడ్కో గృహ నిర్మాణ సముదాయాల శిలాఫలకానికి ముసుగు వేయించడం చర్చనీయాంశమైంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని