Amara Raja Group - KTR: తెలంగాణలో ‘అమరరాజా’కు శంకుస్థాపన

దేశ, విదేశాలతో పోటీపడి అవినీతిరహితంగా, పైసా లంచం లేకుండా పరిశ్రమలను తీసుకురావడం సవాలుతో కూడుకున్న పని అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Updated : 07 May 2023 08:06 IST

రూ.9,500 కోట్లు పెట్టుబడి
10 వేల మందికి పైగా ఉపాధి
8 రాష్ట్రాలు పోటీ పడినా తెలంగాణకే తెచ్చామన్న మంత్రి కేటీఆర్‌
ఇది లిథియం అయాన్‌ బ్యాటరీ పరిశ్రమ.. కాలుష్యం ఉండదని వెల్లడి

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌: దేశ, విదేశాలతో పోటీపడి అవినీతిరహితంగా, పైసా లంచం లేకుండా పరిశ్రమలను తీసుకురావడం సవాలుతో కూడుకున్న పని అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ శివారులోని దివిటిపల్లిలో 262 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న అమరరాజా బ్యాటరీస్‌ గిగా కారిడార్‌కు శనివారం కేటీఆర్‌ శంకుస్థాపన, భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమరరాజా పరిశ్రమ కోసం దేశంలో 8 రాష్ట్రాలు పోటీ పడ్డాయని చెప్పారు. తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న ఆ పరిశ్రమతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పాలమూరు రూపురేఖలూ మారిపోతాయన్నారు. పరిశ్రమకు  రూ.9,500 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని.. రాబోయే మూడేళ్లలోనే రూ.3 వేల కోట్లు ఖర్చు అవుతాయన్నారు. అభివృద్ధి నిరోధకులు ప్రతి చోటా ఉంటారని, ఏవో అపోహలు సృష్టించి పరిశ్రమలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారని అన్నారు.

బ్యాటరీ పరిశ్రమతో  కాలుష్యం వస్తుందని కొంతమంది మాట్లాడుతున్నారన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసేది లెడ్‌ యాసిడ్‌ బ్యాటరీ ప్లాంటు కాదని.. లిథియం అయాన్‌ బ్యాటరీ తయారీ కర్మాగారమని వివరించారు. దీన్ని జీరో లిక్విడ్‌ డిశ్ఛార్జితో అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్నారని చెప్పారు. ఈ పరిశ్రమకు 16 గిగావాట్ల సామర్థ్యం ఉంటుందన్నారు. 1 గిగా వాట్‌ ద్వారా 5 లక్షల ద్విచక్ర వాహనాలకు విద్యుత్తును అందించవచ్చన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నామన్నారు. ఈ ప్రాంతానికి ఎవరు వచ్చి పరిశ్రమ పెట్టినా మద్దతిస్తామన్నారు. గుంటూరు ఎంపీ, అమరరాజా ఎండీ గల్లా జయదేవ్‌ మాట్లాడుతూ ఇక్కడ పరిశ్రమకు భూమిపూజ చేయడం గొప్ప మైలురాయిగా నిలుస్తుందన్నారు. స్థానిక యువత వలసలు వెళ్లనవసరం లేకుండా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. అమరరాజా వ్యవస్థాపకులు రామచంద్రనాయుడు మాట్లాడుతూ.. తమ పరిశ్రమ ద్వారా ఈ ప్రాంతాన్ని పూర్తిగా మార్చివేస్తామన్నారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మాట్లాడుతూ స్థానిక యువతకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. మా బిడ్డను మీ ప్రాంతానికి తీసుకొచ్చామని, ఆశీర్వదించాలని కోరారు.


పరిశ్రమల కోసం అన్ని వేదికలనూ వినియోగించుకుంటున్నాం. మా రాష్ట్రానికే రావాలని పారిశ్రామికవేత్తలను కోరుతున్నాం. నీళ్లు, విద్యుత్తు, భూమి, మానవ వనరులు అందుబాటులోకి తెస్తూ ప్రోత్సహిస్తున్నాం. అలాంటి ప్రయత్నాల్లో భాగంగానే అమరరాజా బ్యాటరీస్‌ నెలకొల్పబోయే కొత్త పరిశ్రమ తెలంగాణకు వచ్చింది.

మంత్రి కేటీఆర్‌


దేశంలో 26 ఏళ్లలోపు యువత 80 కోట్ల మంది ఉన్నారు. 35 ఏళ్ల కంటే తక్కువ వయసు వారు 65% మంది ఉన్నారు. అందరికీ ప్రభుత్వ  ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు. ప్రైవేటు భాగస్వామ్యంతో పరిశ్రమల ఏర్పాటుతోనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.  

మంత్రి కేటీఆర్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని