NEET: సులభతరంగా ‘నీట్‌’.. పెరగనున్న పోటీ

జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌) ప్రశ్నపత్రం ఈసారి కూడా సులభతరంగా వచ్చింది. గత ఏడాది సులువుగా ఉందని భావించగా, ఈసారి అంతకంటే సులభతరంగా ఉందని విద్యార్థులు, విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.

Updated : 08 May 2023 08:51 IST

రసాయనశాస్త్రంలోనే లోతుగా ప్రశ్నలు
రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన పరీక్ష


నీట్‌గా తయారై వస్తే.. 

నీట్‌ రాయడానికి జడలతో వెళ్లేందుకు అనుమతించకపోవడంతో ఏలూరులోని సీఆర్‌ఆర్‌ కళాశాల పరీక్ష కేంద్రం వద్ద జుట్టు విరబోసుకుని లోపలికి వెళుతున్న విద్యార్థినులు  


ఈనాడు, అమరావతి: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌) ప్రశ్నపత్రం ఈసారి కూడా సులభతరంగా వచ్చింది. గత ఏడాది సులువుగా ఉందని భావించగా, ఈసారి అంతకంటే సులభతరంగా ఉందని విద్యార్థులు, విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. పోటీతో పాటు కటాఫ్‌ మార్కులు కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. నీట్‌-2023 ఆదివారం దేశవ్యాప్తంగా జరిగింది. మన రాష్ట్రంలో ఆఫ్‌లైన్‌ విధానంలో 140 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించగా, ప్రశాంతంగా ముగిసింది. జీవశాస్త్రం ప్రశ్నలు ఇతర సబ్జెక్టుల కంటే అత్యంత సులువుగా ఉన్నాయని, భౌతికశాస్త్రం ప్రశ్నలు సాధారణ విద్యార్థి సైతం రాసేలా ఉన్నాయని, రసాయనశాస్త్రంలో మాత్రం కొన్ని ప్రశ్నలు లోతుగా (డెప్త్‌గా) ఇచ్చారని విద్యార్థులు పేర్కొన్నారు. మొత్తంగా ప్రవేశ పరీక్ష సులభంగానే ఉందని తెలిపారు. దీంతో గత ఏడాది ఓపెన్‌ కేటగిరీ కటాఫ్‌ మార్కులు 530 ఉండగా, ఈసారి 550కి పెరిగే అవకాశం ఉండొచ్చని విద్యారంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం 200 నిమిషాల సమయం ఇచ్చారు. ఈసారి కూడా ఛాయిస్‌ విధానం, రుణాత్మక (నెగిటివ్‌) మార్కుల విధానం అమలు చేశారు.

విద్యారంగ నిపుణులు ఏమన్నారంటే..

భౌతికశాస్త్రం సులభంగా ఉందని, సాధారణ విద్యార్థి సైతం సులువుగా రాయొచ్చని, జీవశాస్త్రంలో గతంలో వచ్చిన ప్రశ్నలు ఈసారి ఎక్కువగా ఇచ్చారని శారదా విద్యా సంస్థలకు చెందిన వై.శారదాదేవి, జీవీ రావు తెలిపారు. మొత్తంగా ఎన్‌సీఆర్‌టీ పుస్తకాలతో సన్నద్ధమైన వారికి మంచి ర్యాంక్‌ తెచ్చుకునేందుకు వీలుంటుందన్నారు. శ్రీచైతన్య విద్యాసంస్థల డీన్‌ సురేశ్‌బాబు మాట్లాడుతూ.. ఫిజిక్స్‌లో రోలింగ్‌ మోషన్‌ కాన్సెప్ట్‌పై ఇచ్చిన ఓ ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్స్‌లో సమాధానం లేదని చెప్పారు. మొత్తంగా పరీక్ష మధ్యస్థంగా ఉందన్నారు.

క్షుణ్నంగా తనిఖీచేసి అనుమతి

అన్ని పరీక్ష కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి విద్యార్థులను అనుమతించారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పడంతో ముందుగానే విద్యార్థులు చేరుకున్నారు. పూర్తిస్థాయిలో తనిఖీలు చేశాకే లోపలికి పంపారు. గొలుసులు, చెవి రింగులు, దిద్దులు, వాచీ, బెల్టులకు సైతం అనుమతి ఉండదని ముందే చెప్పడంతో.. దాదాపు విద్యార్థులంతా వాటిని తొలగించి పరీక్ష కేంద్రాలకు వచ్చారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరిగింది. అన్ని కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.


జీవశాస్త్రం అత్యంత సులువు

గత ఏడాది జీవశాస్త్రం ప్రశ్నలు కఠినంగా ఉండగా, ఈసారి ఎంతో సులువుగా ఉన్నాయి. ఫిజిక్స్‌ కూడా బాగుంది. ఆర్గానిక్‌ కెమెస్ట్రీలో మాత్రం సులువుగా జవాబు ఎంపిక చేసుకునేలా ప్రశ్నలు లేవు. కొంత లోతుగా ఉన్నాయి.

ప్రియాంక, విద్యార్థిని, విజయవాడ


నిమిషం ఆలస్యం.. ‘కల’కిందులైంది!

చివరి నిమిషం ముగిశాక వచ్చిన ఓ విద్యార్థినిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. దాదాపు ఇరవై నిమిషాల పాటు తల్లీకూతుళ్లు ఎంత వేడుకున్నా సిబ్బంది గేటు తీయకపోవడంతో.. అయ్యా! మీ కాళ్లు మొక్కుతా తలుపు తీయండి. ఏడాది పాటు కష్టపడి చదివింది. తండ్రి లేని పిల్ల కనికరించండి. ట్రాఫిక్‌ జాం కావడంతో ఆలస్యమైందని అక్కడి పోలీసును ఆ తల్లి వేడుకుంది. అయినప్పటికీ గేటు తీయకపోవడంతో.. ఏడుస్తున్న కుమార్తెను ఓదార్చుతూ వెనక్కు తీసుకెళ్లిందా తల్లి. ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులోని రైజ్‌ కళాశాల నీట్‌ పరీక్షా కేంద్రం వద్ద ఆదివారం కనిపించిన దృశ్యాలివి.

ఈనాడు, ఒంగోలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని