JEE Advanced: ‘అడ్వాన్స్‌డ్‌’కు పోటాపోటీ!

జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఈ సారి గణనీయంగా పెరిగింది.

Updated : 12 May 2023 07:37 IST

ఈ సారి భారీగా పెరిగిన అభ్యర్థులు
గతేడాదితో పోల్చితే 15 శాతం అధికంగా దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఈ సారి గణనీయంగా పెరిగింది. ఫలితంగా ఐఐటీ సీట్లకు పోటీ అధికమైంది. ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీ కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. కొన్నేళ్లుగా అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే వారి శాతం తగ్గుతుండగా ఈ సారి ఏకంగా 15 శాతం పెరగడం గమనార్హం. అత్యంత కఠినంగా భావించే అడ్వాన్స్‌డ్‌ రాసినా తాము నెగ్గలేమన్న భావనతో వేలాది మంది ఆ పరీక్ష రాసేందుకు ముందుకు వచ్చేవారు కాదు. వారంతా జేఈఈ మెయిన్‌ ర్యాంకుతో ఎన్‌ఐటీల్లోనే చేరాలని నిర్ణయించుకుంటారు. గతేడాది దేశవ్యాప్తంగా 2.62 లక్షల మంది జేఈఈ మెయిన్‌లో అర్హత పొందారు. అందులో 1.60 లక్షల మంది మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఈ సారి 2.50 లక్షల మంది అర్హత సాధించగా వారిలో ఏకంగా 1.90 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఈ పరీక్షకు 2014 నుంచి 2017 మధ్యకాలంలో 77-81 శాతం మంది పోటీపడ్డారు. ఆ తర్వాతి నుంచి దరఖాస్తు చేసే వారి శాతం తగ్గుతూ వచ్చింది. కరోనా కారణంగా 2021లో కేవలం 58.10 శాతం మందే పరీక్షకు ముందుకొచ్చారు. గతేడాది కూడా 61 శాతం మంది అభ్యర్థులే ఆసక్తి చూపారు. ఈ సారి అది 76 శాతానికి చేరుకోవడంతో ఎందుకు ఇంత పోటీ ఏర్పడిందన్న చర్చలు సాగుతున్నాయి. ఈ సారి తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 30 వేల మంది పోటీపడనున్నారు. ఐఐటీల్లో 18 శాతం సీట్లను తెలుగు విద్యార్థులు కైవసం చేసుకుంటున్నారు.

ఎందుకీ పెరుగుదల?

దేశంలోని 23 ఐఐటీలకు గాను గతేడాది 16,598 బీటెక్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏటా 300-500 సీట్లు పెరుగుతున్నాయి. దీంతో పరీక్ష రాసిన ప్రతి 10 మందిలో ఒకరికే సీటు దొరుకుతుంది. దీనికితోడు ఈ సారి జేఈఈ మెయిన్‌ ఫలితాలు ఏప్రిల్‌ 29న వెలువడగా.. అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జూన్‌ 4న జరగనుంది. అంటే దీనికి సన్నద్ధమయ్యేందుకు 35 రోజుల గడువు ఉండటం కూడా పోటీ పెరగడానికి ఓ కారణమని నానో అకాడమీ సంచాలకుడు కాసుల కృష్ణచైతన్య అభిప్రాయపడ్డారు. గతంలో అడ్వాన్స్‌డ్‌ పరీక్ష మే మూడో వారంలో జరిగేదని, జేఈఈ మెయిన్‌ ఫలితాల తర్వాత ఎక్కువ సమయం ఉండేది కాదన్నారు. దరఖాస్తు చేసిన వారిలో 3-5 శాతం మంది పరీక్షకు హాజరవ్వరని ఆయన తెలిపారు. గతేడాది 1,55,538 మంది మాత్రమే పరీక్ష రాశారని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు