Buggana Rajendranath - Farmer: మంత్రి బుగ్గన అనుచరులు నా పొలంలో రోడ్డేస్తున్నారు

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అనుచరులు తన పొలంలో అక్రమంగా రహదారి వేస్తున్నారంటూ నంద్యాల కలెక్టరేట్‌ ఎదుట బేతంచెర్ల మండలం కుమ్మరికొట్టాలకు చెందిన రవికుమార్‌ మంగళవారం ఆత్మహత్యాయత్నం చేశారు.

Updated : 17 May 2023 11:48 IST

అడ్డుకోవాలంటూ కలెక్టరేట్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

నంద్యాల నేరవిభాగం, నంద్యాల గాంధీచౌక్‌, బేతంచెర్ల, న్యూస్‌టుడే: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అనుచరులు తన పొలంలో అక్రమంగా రహదారి వేస్తున్నారంటూ నంద్యాల కలెక్టరేట్‌ ఎదుట బేతంచెర్ల మండలం కుమ్మరికొట్టాలకు చెందిన రవికుమార్‌ మంగళవారం ఆత్మహత్యాయత్నం చేశారు. అధికారులు, పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదంటూ ఒంటిపై డీజిల్‌ పోసుకున్నారు. పోలీసులు అతడిని అడ్డుకుని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ‘నా పొలంలో నడిచేందుకు మాత్రమే బాట ఉంది. సర్వే చేసిన అధికారులూ కాలిబాటనే ధ్రువీకరించారు. అయినా సరే మంత్రి ఒత్తిడితో ఆయన అనుచరులు రహదారి వేస్తున్నారు. సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక కలెక్టర్‌ కార్యాలయం ఎదుట చనిపోవాలనుకున్నా’ అని బాధితుడు రవికుమార్‌ వాపోయారు. ఆత్మహత్యాయత్నం చేయడం చట్టరీత్యా నేరమని, రవికుమార్‌పై కేసు నమోదు చేసినట్లు మూడో పట్టణ సీఐ నరసింహులు తెలిపారు.

రూ.20 లక్షల డీఎంఎఫ్‌ నిధులతో...: కొమ్మూరుకొట్టాలలో డీఎంఎఫ్‌ నిధులతో రెండు కిలోమీటర్ల మేర గ్రావెల్‌ రోడ్డు వేసేందుకు ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసింది. రోడ్డు వేసేందుకు గుత్తేదారు సిద్ధమయ్యారు. పనులు చేస్తున్నది గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు, ఆర్థికమంత్రి బుగ్గనకు ముఖ్య అనుచరుడు. రహదారి కోసం గ్రావెల్‌ను పెద్ద ఎత్తున పోశారు. తమ అనుమతి లేకుండా పనులు చేస్తున్నారంటూ రెండురోజుల కిందట రైతులు అడ్డుకున్నారు. కాలిబాటను 18 అడుగుల మేర వెడల్పు చేస్తూ రెండు అడుగుల ఎత్తున రోడ్డు నిర్మిస్తే... పొలాల్లో వర్షపు   నీరు నిలిచి పంటలకు నష్టం కలుగుతుందని రైతులు వాపోతున్నారు. ఎగువన పొలాలున్న వైకాపా నాయకులకు లబ్ధి చేకూర్చాలనే ఇలా రోడ్డు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎస్సై, మండల సర్వేయర్‌, పీఆర్‌ ఏఈలను పంపించి సమస్య  పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ నరేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. రైతుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్నాక... రహదారి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పంచాయతీ రాజ్‌ ఇంజినీర్‌ గణేష్‌ కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని