మండే ఎండల్లో.. కారు జాగ్రత్త
రాష్ట్రం నిప్పుల కొలిమిలా ఉంది. అనేక ప్రాంతాల్లో 46, 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంతటి వేడిలో కార్లలో ప్రయాణిస్తున్నవారు.. కొన్ని ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, అప్రమత్తంగా లేకపోవడంతో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు.
రన్నింగ్‌లో పేలుతున్న టైర్లు, కాలిపోతున్న వాహనాలు
టైర్లలో అధిక గాలే ప్రమాదాలకు కారణం
అదనపు లైట్లు, హారన్ల వైరింగ్‌తో షార్ట్‌సర్క్యూట్‌కు అవకాశం
రాష్ట్రం నిప్పుల కొలిమిలా ఉంది. అనేక ప్రాంతాల్లో 46, 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంతటి వేడిలో కార్లలో ప్రయాణిస్తున్నవారు.. కొన్ని ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, అప్రమత్తంగా లేకపోవడంతో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ఇటీవల కారు టైర్లు పేలి ప్రమాదాలు జరుగుతున్న ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. అత్యంత వేగంతో వెళ్తున్న కారు టైరు పేలడంతో, నియంత్రణ తప్పి అందులో ఉన్నవారు ప్రాణాలు కోల్పోతున్నారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు టైరు పేలడంతో జరిగిన ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు అధిక వేడికి రన్నింగ్‌లో ఉన్న కార్లు, ఆగి ఉన్న కార్లలో సైతం మంటలు చెలరేగి ఆహుతవుతున్నాయి. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల వెంకటాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. చిన్న చిన్న విషయాల్లో నిర్లక్ష్యమే ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతుందని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే వీటిని నివారించవచ్చని వాహన రంగ నిపుణులు చెబుతున్నారు.
టైర్లలో గాలి కీలకం
* కారు టైర్లలో గాలి ప్రెజర్ ఎన్ని పౌండ్స్ ఫర్ స్క్వేర్ ఇంచ్ (పీఎస్‌ఐ) పాయింట్లు ఉందో తరచూ చెక్ చేయించుకోవాలి. కార్ల కంపెనీలు ఇచ్చే ప్రమాణాల కన్నా ఒకటి, రెండు పాయింట్లు తక్కువ ఉన్నా ఫర్వాలేదు గానీ ఎక్కువ ఉండకూడదు.
* కారు ప్రయాణిస్తున్నప్పుడు టైర్లలో ఒత్తిడి పెరుగుతుంది. టైర్లలో అధికంగా గాలి పట్టిస్తే టైరు లోపల ఒత్తిడి, ఎండల్లో బయటి వేడి వల్ల ఒత్తిడి మరింత పెరిగి.. వాటికి చిన్న రాయి తగిలినా పేలే ప్రమాదం ఉంది.
* టైర్లకు కంపెనీలు ఏడాది గ్యారంటీ ఇస్తాయి. తర్వాత కారు వినియోగం బట్టి మరో రెండు, మూడేళ్లు మన్నుతాయి. కారు వినియోగం, నిర్వహణ బట్టి టైరు మన్నిక 60 వేల కి.మీ.పైనే వస్తుంది. తర్వాత టైరు మార్చాలి. కొందరు నాలుగైదేళ్లయినా 10 వేల కి.మీ. మాత్రమే తిరిగామనే ఉద్దేశంతో.. టైర్లు మార్చకుండా పాతవాటితోనే నడిపిస్తారు. ఎండా వానలకు టైర్లు క్రమంగా గట్టిబడి, పగుళ్లు వస్తాయి. అవి ప్రమాదాలకు కారణమవుతాయి.
* కొత్త టైర్లు వేసినప్పుడు వాటి తయారీ సంవత్సరాన్ని చూడాలి. ఎప్పుడో తయారైనవి తీసుకోకూడదు.
టైర్లలో ఎక్కువ గాలి ఉంటే మైలేజ్ పెరుగుతుందనే భావన సరికాదు.
వైరింగ్‌లో మార్పులు చేస్తే షార్ట్‌సర్క్యూట్
* కార్ల తయారీ కంపెనీలు ప్రమాణాల ప్రకారం హెడ్‌లైట్లు, హారన్లు వంటివి ఏర్పాటు చేస్తాయి. ఇవికాకుండా యజమానులు అదనంగా మరికొన్ని అమరుస్తుంటారు. ఇందుకోసం వైరింగ్‌లో కొన్నిచోట్ల మార్పులు చేస్తారు. ఇది షార్ట్ సర్క్యూట్‌కు దారి తీసి, కారులో మంటలు చెలరేగేందుకు కారణమవుతుంది.
* సాధారణంగా కార్ల హెడ్‌లైట్లు 50-40 వాల్ట్‌లతో ఉంటాయి. కొందరు అధిక లైటింగ్ కోసం కంపెనీ ఇచ్చిన బల్బుల స్థానంలో 100-90 వాల్ట్‌ల బల్బులు ఏర్పాటు చేయిస్తారు. ఎల్‌ఈడీ లైట్లు కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఇందుకోసం వైరింగ్ సాకెట్ సిస్టమ్‌ను కట్ చేసి, దానికి అదనంగా వైర్లు కలిపి, టేప్ వేస్తారు. ఎండ వేడికి టేపులో జిగురు కరిగిపోయి, వైరు జాయింట్ బయటికొస్తుంది. అది ఇంజిన్‌లో అధిక వేడి ఉన్నచోట ఎక్కడైనా తగిలితే షార్ట్‌సర్క్యూట్ అవుతుంది.
ప్రాథమికంగా పాటించాల్సిన సూచనలు
* కారు ఇంజిన్ ఆన్ చేయగానే డిస్‌ప్లే బోర్డుపై అన్నీ చూపిస్తాయి. వాటిని సరిచూసుకోవాలి. ఏదైనా లైటు వెలుగుతూ ఇండికేషన్ ఇస్తే, దానిపై దృష్టిపెట్టాలి.
* దూర ప్రయాణాలు చేసేవారు 150- 200 కి.మీ. ప్రయాణించాక గానీ, రెండున్నర గంటలకోసారి గానీ కారును కొంత సమయం ఆపి మళ్లీ బయల్దేరడం మంచిది. వీలైతే కారును నీడలో ఆపాలి. అలాంటప్పుడు అద్దం కొంత దించితే, బయటి గాలి లోపలికి వెళ్లి.. వేడి కొంత తగ్గుతుంది.
* ఎక్కడికైనా బయలుదేరేందుకు సిద్ధమైనప్పుడు కారు వెంటనే స్టార్ట్ చేయకూడదు. ఏసీ ఆన్ చేయకూడదు. ముందుగా అద్దాలు దించి కారులోని గాలి బయటకు వెళ్లేలా చూడాలి. ఎండ వేడికి కారు లోపల ఉండే ప్లాస్టిక్, ఫైబర్, రెగ్జిన్‌తో చేసిన విడిభాగాల నుంచి వెలువడే విషవాయువులను బయటికి పంపడానికి ఇది చాలా అవసరం.
* ఎండలో కారు ఎక్కువ సమయం నిలిపి ఉంచినప్పుడు, ఇంజిన్ ఆపకుండా ఏసీ ఆన్ చేసి ఉంచుతుంటారు. దీనివల్ల ఇంజిన్ జీవితకాలం తగ్గిపోయే ప్రమాదం ఉంది.
పాత టైర్లలో గ్రిప్ ఉండదు
- హర్షిణ్, వాహన రంగ నిపుణుడు
పాత టైర్లలో గ్రిప్ ఉండదు. వాటి వల్ల డ్రైవరు కారును సక్రమంగా అదుపు చేయడం కష్టం. అందుకే సకాలంలో వాటిని మార్చాలి. ఎక్కువ గాలి పెట్టిస్తే.. టైరు మధ్య భాగంలో త్వరగా అరిగిపోతుంది. తక్కువ పెట్టిస్తే మధ్యభాగం కాకుండా రెండువైపులా అరిగిపోతుంది. టైరు ప్రమాణాల ప్రకారం గాలి ఉండేలా చూసుకోవాలి.
యాక్సెసరీస్ వేయించినప్పుడు జాగ్రత్తలు అవసరం
- గిరి, సీఈవో, వరణ్ మోటార్స్ కార్స్ విభాగం, విజయవాడ క్లస్టర్
కారుకు సాధారణంగా కంపెనీ ఇచ్చే లైటింగ్, హారన్, సౌండ్ సిస్టమ్ సరిపోతాయి. ఇవి కాకుండా అదనపు యాక్సెసరీలు వేయించాలనుకుంటే వైరింగ్‌లో సమస్య రాకుండా, సాకెట్ విధానంతో ఉన్నవాటిని చూసుకోవాలి. ఈ వైరింగ్ సక్రమంగా లేకపోతే షార్ట్‌సర్క్యూట్‌కు దారితీయొచ్చు.
లారీలకు పంక్చర్లు వేసేచోట కార్లకు గాలి పెట్టించొద్దు
- చంటి, చంటి కార్స్ నిర్వాహకులు, విజయవాడ
లారీ టైర్లకు పంక్చర్లు వేసేచోట్ల.. కార్లకు గాలి పెట్టిస్తే కొన్ని పీఎస్‌ఐ పాయింట్లు తక్కువగానే చూపిస్తుంది. ఉదాహరణకు కారు టైరుకు 32 పీఎస్‌ఐ పాయింట్ల గాలి పెట్టినట్లు మీటరులో చూపిస్తుంది. వాస్తవంగా అది ఇంకా ఎక్కువ పీఎస్‌ఐ పాయింట్లు ఉంటుంది. ఇది ప్రమాదకరం. అందుకే కార్లకు పెట్రోలు బంకుల వద్ద గాలి పెట్టించడం ఉత్తమం.
ఈనాడు, అమరావతి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్
-
Movies News
RRR: ఎన్టీఆర్-రామ్‌చరణ్‌లతో నటించే అవకాశం వస్తే అది అదృష్టమే: హాలీవుడ్ స్టార్ హీరో
-
World News
Pakistan: బడ్జెట్ ప్రవేశపెట్టిన పాక్.. సగం అప్పులకే కేటాయింపు!