మరో నాలుగు రోజులు సెగలే!

సూర్యోదయంతోనే సెగలు మొదలవుతున్నాయి.. రాత్రి 10 గంటలు.. 11 గంటలు అయినా తగ్గడం లేదు. ముఖ్యంగా నాలుగు రోజుల నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.

Published : 05 Jun 2023 04:48 IST

46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు.. వడగాలులు
గాలిలో తగ్గిన తేమ.. ఉడుకుతున్న దక్షిణ కోస్తా
8న రుతుపవనాల రాక.. అప్పటి వరకు ఇంతే  
బయటకొస్తే జాగ్రత్తలు తప్పనిసరి

ఈనాడు-అమరావతి: సూర్యోదయంతోనే సెగలు మొదలవుతున్నాయి.. రాత్రి 10 గంటలు.. 11 గంటలు అయినా తగ్గడం లేదు. ముఖ్యంగా నాలుగు రోజుల నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. గాలిలో తేమశాతం తగ్గిపోవడంతో.. వడగాలుల ప్రభావం పెరిగింది. దక్షిణ కోస్తా జిల్లాలు ఉడికిపోతున్నాయి. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి. సోమ, మంగళవారాల్లోనూ ఇవే పరిస్థితులు కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో.. సాధ్యమైనంత వరకు ఎండలోకి రావద్దని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ఉత్తర కోస్తాలో పిడుగులు.. ఉరుములు, మెరుపుల హోరు.. ఈదురుగాలులు చుట్టేస్తున్నాయి. అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలోనూ గరిష్ఠంగా 42 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా సాయంత్రానికి కొంత చల్లబడుతోంది. అక్కడ సాధారణం కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. రాష్ట్రానికి ఈ నెల 8వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సోమవారం 213 మండలాల్లో, మంగళవారం 285 మండలాల్లో తీవ్ర వడగాలులు, వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

గాలిలో తేమ 30% నుంచి 40%

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, ఏలూరు, కర్నూలు జిల్లాల్లో గాలిలో తేమ 30% నుంచి 40% మధ్యనే ఉంది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే.. దక్షిణ కోస్తా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి అధికంగా ఉంది.

* ఆదివారం రాష్ట్రంలోనే అత్యధికంగా ఏలూరు జిల్లా కామవరపు కోటలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్‌, తూర్పుగోదావరి, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోనూ 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత ఉంది. సాయంత్రం 6 గంటలకు కూడా గరిష్ఠంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం గమనార్హం. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో బాపట్ల, కృష్ణా, గుంటూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని పలు మండలాల్లో 38 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఈ సమయంలో ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని.. జాగ్రత్తలు పాటించాలని నిపుణులు పేర్కొంటున్నారు. పని ప్రదేశాలు, ప్రయాణ సమయంలో డీహైడ్రేషన్‌కు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని.. మజ్జిగ, నిమ్మకాయ నీరు, కొబ్బరినీరు తాగాలని పేర్కొంటున్నారు. ఇళ్లలో ఉండే వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని