JEE Advanced results: మనవాళ్లే అడ్వాన్స్‌డ్‌.. జేఈఈ టాప్‌ టెన్‌లో ఆరుగురు తెలుగు వారే

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. ఒకటి, రెండు ర్యాంకులతో పాటు ఏకంగా తొలి 10లో ఆరింటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు సొంతం చేసుకున్నారు.

Updated : 19 Jun 2023 08:10 IST

తెలంగాణ విద్యార్థి చిద్విలాస్‌రెడ్డికి తొలి ర్యాంకు..  
ఏపీ విద్యార్థి రమేశ్‌ సూర్యతేజకు రెండో ర్యాంకు
ప్రొద్దుటూరు బాలిక నాగ భవ్యశ్రీకి.. అమ్మాయిల్లో తొలి స్థానం
100 లోపు ర్యాంకుల్లో 30 మంది జయకేతనం

ఈనాడు- హైదరాబాద్‌, అమరావతి, న్యూస్‌టుడే యంత్రాంగం: అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. ఒకటి, రెండు ర్యాంకులతో పాటు ఏకంగా తొలి 10లో ఆరింటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు సొంతం చేసుకున్నారు. వీరిలో నలుగురు ఏపీ, ఇద్దరు తెలంగాణ విద్యార్థులు. హైదరాబాద్‌లో చదివిన నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటకు చెందిన వావిలాల చిద్విలాస్‌రెడ్డి 360 మార్కులకు 341 సాధించి జాతీయస్థాయిలో ప్రథమ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన రమేశ్‌ సూర్యతేజ రెండో ర్యాంకు సాధించాడు. అడ్డగడ వెంకటశివరామ్‌ (ఏపీ) 5, బిక్కిన అభినవ్‌చౌదరి (ఏపీ) 7, నాగిరెడ్డి బాలాజీరెడ్డి (తెలంగాణ) 9, యక్కంటి ఫణి వెంకటమణీందర్‌రెడ్డి (ఏపీ) 10వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. బాలికల విభాగంలో వైయస్‌ఆర్‌ జిల్లా అమ్మాయి నయకంటి నాగభవ్యశ్రీ 298 మార్కులు సాధించి దేశంలో మొదటి ర్యాంకు పొందగా.. జనరల్‌ కేటగిరీలో 56వ ర్యాంకు సాధించింది. ఈ నెల 4న జరిగిన అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాలను ఐఐటీ గువాహటి ఆదివారం విడుదల చేసింది. టాప్‌ 100లో 40 మంది ఐఐటీ హైదరాబాద్‌ జోన్‌ (ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ) విద్యార్థులు ఉన్నారని తెలిపింది. వారిలో 30 మంది తెలుగు వారు ఉండటం ఖాయమని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.

కౌన్సెలింగ్‌కు 43,773 మందికి అర్హత

ఈసారి జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించి ఉత్తీర్ణులైన 2.52 లక్షల మందిలో అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు 1,89,744 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,80,372 మంది పరీక్ష రాశారు. అందులో కటాఫ్‌ మార్కుల ఆధారంగా 43,773 మందికి జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హత కల్పించారు. వారు మాత్రమే ఐఐటీల్లో సీట్లు పొందేందుకు అర్హులు. వారిలో 36,264 మంది అబ్బాయిలు, 7,509 మంది అమ్మాయిలున్నారు. గతేడాది ఐఐటీల్లో మొత్తం 16,598, ఎన్‌ఐటీల్లో 23,994 సీట్లు ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల నుంచే 7 వేల మంది వరకు!

ఈసారి టాప్‌ 200 ర్యాంకుల్లో 75 మంది, 300లోపు 121 మంది, 400లోపు 149 మంది, 500 ర్యాంకులోపు 174 మంది ఐఐటీ హైదరాబాద్‌ జోన్‌కు చెందిన వారే ఉన్నారు. అంటే 500 ర్యాంకుల్లోపు 35 శాతం మంది ఈ జోన్‌ వారే. వారిలో కనీసం 125 మంది ఏపీ, తెలంగాణ వారు ఉంటారని చెబుతున్నారు. అడ్వాన్స్‌డ్‌లో అన్ని కేటగిరీల వారు కలిపి 43,773 మంది ఐఐటీల్లో సీట్లకు పోటీపడేందుకు అర్హత సాధించగా వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 7 వేల మంది వరకు ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఐటీ హైదరాబాద్‌ జోన్‌ నుంచి 10,432 మంది అర్హత పొందారు. వారిలో కనీసం 6 వేల మంది ఏపీ, తెలంగాణ వారు ఉంటారని చెబుతున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల్లో పరీక్షలు రాసిన వారు ఐఐటీ ఖరగ్‌పూర్‌ జోన్‌ కిందకు వస్తారు. ఆ జోన్‌ నుంచి 4,618 ఎంపికకాగా.. అందులో కనీసం 500 మంది ఈ మూడు జిల్లాల వారు ఉండొచ్చని చెబుతున్నారు. మొత్తం మీద జోసా కౌన్సెలింగ్‌ ద్వారా ఐఐటీ సీట్ల కోసం 7 వేల మంది వరకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పోటీపడనున్నారు. కొన్నేళ్లుగా ఐఐటీల్లో ఏటా 18-20% సీట్లను తెలుగు విద్యార్థులు సాధిస్తున్నారు. 

  • జేఈఈ మెయిన్‌లో ప్రథమ ర్యాంకు సాధించిన హైదరాబాద్‌కు చెందిన వెంకటకౌండిన్య అడ్వాన్స్‌డ్‌లో 84వ ర్యాంకుకు పరిమితమయ్యాడు. సాయిదుర్గారెడ్డి మెయిన్‌లో 6వ ర్యాంకు పొందగా.. అడ్వాన్స్‌డ్‌లో 35 ర్యాంకు సాధించాడు. మెయిన్‌లో తొలి 10 ర్యాంకుల్లో ఉన్న మిగతా విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌లో 100లోపు కనిపించలేదు. మెయిన్‌లో 15వ ర్యాంకు పొందిన వావిలాల చిద్విలాస్‌రెడ్డి అడ్వాన్స్‌డ్‌లో 1వ ర్యాంకు పొందటం విశేషం.

8వ తరగతి నుంచే లక్ష్యంగా పెట్టుకున్నా

- వావిలాల చిద్విలాస్‌రెడ్డి, ప్రథమ ర్యాంకు

జేఈఈ సాధించాలనే లక్ష్యం 8వ తరగతిలోనే పెట్టుకున్నా. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులందరికీ సాఫ్ట్‌వేర్‌ విద్యను అందుబాటులోకి తేవాలనేది నా లక్ష్యం. జేఈఈ కోసం సిద్ధమయ్యే విద్యార్థులు మొదటి నుంచి ఒకే రకమైన పుస్తకాలను అనుసరించాలి. ఎప్పుడు ప్రారంభించాం, ఎంత సమయం చదివామని కాకుండా ప్రణాళిక ప్రకారం చదివితే లక్ష్యం నెరవేరుతుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని