Nikhil Siddhartha: డ్రగ్స్‌ తీసుకోవాలని చాలాసార్లు అడిగారు: సినీనటుడు నిఖిల్‌

విద్యార్థులకు ఎంతో అందమైన జీవితం ఉందని.. దాన్ని ఆస్వాదించేందుకు తప్పటడుగులు వేయవద్దని సినీ నటుడు నిఖిల్‌ సిద్ధార్థ సూచించారు.

Updated : 25 Jun 2023 07:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: విద్యార్థులకు ఎంతో అందమైన జీవితం ఉందని.. దాన్ని ఆస్వాదించేందుకు తప్పటడుగులు వేయవద్దని సినీ నటుడు నిఖిల్‌ సిద్ధార్థ సూచించారు. ఈ నెల 26న అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్‌ కమాండ్‌ కంట్రోల్‌ భవనంలో తెలంగాణ స్టేట్‌ యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో(టీఎస్‌ న్యాబ్‌) ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న కార్యక్రమాలను శనివారం ప్రారంభించారు. పరివర్తన లోగోను ఆవిష్కరించారు. నగరం నలువైపుల నుంచి హాజరైన విద్యార్థులకు మాదకద్రవ్యాల వాడటంతో తలెత్తే ఇబ్బందులపై పోలీసులు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన నిఖిల్‌ మాట్లాడుతూ తనను కూడా చాలాసార్లు డ్రగ్స్‌ తీసుకోమని అడిగారంటూ సంచలన విషయం బయటపెట్టారు.

ఒక్కసారి మత్తుకు అలవాటుపడితే అది మరణంతో సమానమన్నారు. ఇటీవల టాలీవుడ్‌లో బయటపడిన డ్రగ్స్‌ కేసుపై స్పందిస్తూ సినీ పరిశ్రమలో ఎవరో చేసిన తప్పిదానికి అందరినీ నిందించటం సరికాదన్నారు. సినీ నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ పదేళ్ల క్రితం 21 ఏళ్ల వయసులో తాను సిగరెట్‌కు అలవాటైనట్టు తెలిపారు. మొదట్లో బాగానే అనిపించినా క్రమంగా దాని వల్ల తలెత్తే సమస్యను గుర్తించానన్నారు. తనలో వచ్చిన పరివర్తనతో మెల్లగా ఆ అలవాటు నుంచి బయటపడినట్టు వివరించారు. టీఎస్‌ న్యాబ్‌ డైరెక్టర్‌, నగర సీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ మత్తుపదార్థాలను అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల్లో యాంటీడ్రగ్స్‌ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. విద్యార్థులంతా సభ్యులుగా చేరి యాంటీడ్రగ్స్‌ సోల్జర్స్‌గా సహకరించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని