AP Police Jobs: పోలీసు ఉద్యోగాలెక్కడ?

ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పిన సీఎం జగన్‌.. అధికారం చేపట్టి నాలుగేళ్లు దాటుతున్నా ఒక్కటంటే ఒక్క పోలీసు ఉద్యోగమూ ఇవ్వలేదు. ఎట్టకేలకు మూడున్నరేళ్ల తర్వాత ఒక నోటిఫికేషన్‌ ఇచ్చినా దానికీ మోక్షం కల్పించట్లేదు.

Updated : 09 Jul 2023 08:36 IST

నాలుగేళ్లలో ఒక్క పోస్టూ భర్తీ చేయని జగన్‌ సర్కారు
ఏటా 6,500 కొలువుల భర్తీ హామీ ఏమైపోయింది?
విడుదల చేసిన నోటిఫికేషన్‌కూ దక్కని మోక్షం
దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణకు ఇంకెన్నాళ్లు?
ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల ప్రాథమిక రాతపరీక్షల్లో
అర్హత సాధించిన లక్షన్నర మంది ఎదురుచూపులు

ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌

రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం.

2019 ఎన్నికల మేనిఫెస్టోలో జగన్‌


రాబోయే నాలుగేళ్లలో సంవత్సరానికి 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేస్తాం. డిసెంబరులో ఖాళీల్ని గుర్తించి జనవరిలో నియామక షెడ్యూల్‌ విడుదల చేస్తాం. వారాంతపు సెలవు విధానానికి కావాల్సిన అదనపు సిబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రక్రియ చేపడతాం.

2020 అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ సందర్భంగా సీఎం జగన్‌ ప్రకటన


నోటిఫికేషన్ల కోసం నిరీక్షణ ఉండదు

ప్రభుత్వోద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఎప్పుడొస్తుందోనని యువత ఎదురుచూస్తారు. నెలల తరబడి నోటిఫికేషన్లు రాక, అవి ఎప్పుడిస్తారో తెలియక ఒక్కోసారి మనోధైర్యం కోల్పోతుంటారు. ఈ పరిస్థితిని మారుస్తూ రాబోయే తొమ్మిది నెలల్లో జులై నుంచి 2022 మార్చి వరకూ ఏయే ఉద్యోగాల భర్తీకి ఏ నెలలో నోటిఫికేషన్‌ ఇస్తామో వివరిస్తూ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తున్నాం. ఈ వ్యవధిలో 10,143 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. వాటిలో 450 పోలీసు పోస్టులున్నాయి.

2021 జూన్‌ 18న జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన సందర్భంలో సీఎం జగన్‌

ఈనాడు - అమరావతి

ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పిన సీఎం జగన్‌.. అధికారం చేపట్టి నాలుగేళ్లు దాటుతున్నా ఒక్కటంటే ఒక్క పోలీసు ఉద్యోగమూ ఇవ్వలేదు. ఎట్టకేలకు మూడున్నరేళ్ల తర్వాత ఒక నోటిఫికేషన్‌ ఇచ్చినా దానికీ మోక్షం కల్పించట్లేదు. ఉద్యోగ ప్రకటన విడుదలై ఎనిమిది నెలలవుతున్నా ఇప్పటి వరకూ దేహదారుఢ్య, శారీరక్ష సామర్థ్య పరీక్షలు నిర్వహించలేదు. కనీసం అవి ఎప్పుడు జరుపుతారో కూడా స్పష్టతివ్వడం లేదు. దీంతో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన 1.53 లక్షల మందికి నెలల తరబడి నిరీక్షణ తప్పట్లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీ మేరకు జాబ్‌ క్యాలెండర్‌ ఎలాగూ ఇవ్వట్లేదు. కనీసం విడుదల చేసిన నోటిఫికేషన్‌ మేరకైనా ఉద్యోగాల భర్తీ సకాలంలో పూర్తి చేయకపోవటం ఏంటి? సీఎం గారూ... పోలీసు ఉద్యోగాలు ఇంకెప్పుడు ఇస్తారు? దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌ ప్రకటించేందుకు మీకు ఇంకెన్నాళ్లు పడుతుంది? ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయటం అంటే ఇదేనా? ఇది నిరుద్యోగుల జీవితంతో చెలగాటం ఆడటం కాదా?

షెడ్యూల్‌ ప్రకటించటానికి ఇంకెన్నాళ్లు?

రాష్ట్రంలో 6,100 కానిస్టేబుల్‌, 411 ఎస్సై ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది నవంబరు 28న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటి ప్రాథమిక రాతపరీక్ష ఫలితాలు ఫిబ్రవరిలో విడుదలయ్యాయి. అర్హత సాధించిన వారికి రెండో దశలో దేహదారుఢ్య, శారీరక సామర్థ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహించాలి. నాలుగు నెలలు గడిచినా ఈ పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌ను పోలీసు నియామక మండలి ప్రకటించకపోవడంపై అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించి మార్చి 13 నుంచి 20వ తేదీ వరకూ పీఈటీ, పీఎంటీ పరీక్షలు నిర్వహిస్తామంటూ అధికారులు షెడ్యూల్‌ విడుదల చేశారు. తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాటిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ఎన్నికల ప్రక్రియ ముగిసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కొత్త షెడ్యూల్‌ మాటే లేదు. ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించాల్సిన పీఎంటీ, పీఈటీ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ఖరారు చేయలేదు.

తెదేపా హయాంలో మూడు నెలల్లోనే మొత్తం పూర్తి

తెదేపా ప్రభుత్వ హయాంలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ కోసం 2018 నవంబరు, డిసెంబరు నెలల్లో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలు, తుది రాత పరీక్ష అన్ని కేవలం మూణ్నెలల్లోనే (2019 ఫిబ్రవరి నాటికే) పూర్తి చేసేశారు. అప్పట్లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావటంతో తుది ఫలితాల విడుదల ఆగిపోయింది. అంతకు ముందే సిద్ధంగా ఉన్న తుది ఫలితాలను 2019 మేలో అధికారం చేపట్టిన జగన్‌ ప్రభుత్వం జూన్‌లో విడుదల చేసింది. అలా చూసినా మొత్తం భర్తీ ప్రక్రియ ఏడు నెలల్లోనే పూర్తయిపోయింది. తెదేపా హయాంలో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అంతా శరవేగంగా జరగ్గా.. ఇప్పుడు వైకాపా హయాంలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. నోటిఫికేషన్‌ విడుదలై ఎనిమిది నెలలవుతున్నా ఇప్పటికీ కనీసం పీఎంటీ, పీఈటీ పరీక్షల షెడ్యూల్‌ కూడా ప్రకటించని పరిస్థితి ఉంది. కనీసం ఆ దిశగా చొరవ కూడా కనిపించడం లేదు. దీనిపై వివరణ కోసం ‘ఈనాడు’ ప్రతినిధి పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ అతుల్‌సింగ్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.


జాబ్‌ క్యాలెండర్‌పై మాట తప్పారు

  • 2021 జూన్‌ 18న జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి 450 పోలీసు ఉద్యోగాల భర్తీకి ఆ ఏడాది సెప్టెంబరులో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని అందులో పొందుపరిచారు. పోలీసు శాఖలో వేల ఖాళీలున్నా కేవలం 450 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్‌ ఇస్తామనటంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. క్యాలెండర్‌లో పేర్కొన్న గడువు ముగిసిపోయినా ఆ నోటిఫికేషన్‌ ఇవ్వకుండా జగన్‌ మాట తప్పారు.
  • రాబోయే నాలుగేళ్లలో ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని 2020 అక్టోబరులో జగన్‌ చెప్పారు. ఆ లెక్కన చూసినా ఇప్పటికే 19,500 పోలీసు ఉద్యోగాలు భర్తీ కావాలి. కానీ ఆ జాడే లేదు.
  • ఎట్టకేలకు అధికారం చేపట్టిన మూడున్నరేళ్ల తర్వాత 6,511 కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టుల భర్తీకి 2022 నవంబరులో నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఆ భర్తీ ప్రక్రియను కూడా ఇప్పటికీ పూర్తి చేయలేకపోతున్నారు.
  • తెదేపా హయాంలో అన్ని రకాల పరీక్షలు పూర్తయిన పోలీస్‌ ఉద్యోగాల ఫలితాలను జగన్‌ అధికారంలోకి వచ్చాక విడుదల చేశారు. అర్హత సాధించిన వారికి పోస్టింగులిచ్చారు. అది మినహా వైకాపా ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో సొంతంగా ఒక్కటంటే ఒక్క పోలీసు ఉద్యోగమూ భర్తీ చేయకపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని