Ithavaram Bridge: గరిష్ఠ వరద రికార్డును పట్టించుకోలేదా?

రెండు రాష్ట్రాలను కలిపే కీలకమైన రహదారి అది. ఈ మార్గంలో గంటకు దాదాపు వెయ్యి వాహనాలు తిరుగుతాయి. అంతటి రద్దీ ఉండే హైదరాబాద్‌-విజయవాడ ఎన్‌హెచ్‌-65 రోడ్డు నిర్మాణంలో అధికారులకు దూరదృష్టి లోపించింది.

Updated : 29 Jul 2023 08:36 IST

హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో.. ఐతవరం వద్ద వంతెన నిర్మాణం లోపభూయిష్టం
ఎత్తు తక్కువగా ఉండటంతోనే రోడ్డుపైకి మునేరు వరద

ఈనాడు, అమరావతి: రెండు రాష్ట్రాలను కలిపే కీలకమైన రహదారి అది. ఈ మార్గంలో గంటకు దాదాపు వెయ్యి వాహనాలు తిరుగుతాయి. అంతటి రద్దీ ఉండే హైదరాబాద్‌-విజయవాడ ఎన్‌హెచ్‌-65 రోడ్డు నిర్మాణంలో అధికారులకు దూరదృష్టి లోపించింది. మునేరు వరద నీరు ఐతవరం వద్ద జాతీయ రహదారి మీదుగా ప్రవాహించింది. దీంతో దాదాపు 36 గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. గతంలో వచ్చిన వరద కంటే ప్రస్తుతం తక్కువ వచ్చినా.. రోడ్డు ముంపునకు గురికావడం గమనార్హం. దీంతో ప్రయాణాలు రద్దు చేసుకున్న వారు కొందరైతే.. మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాల మీదుగా వెళ్లారు. విజయవాడ నుంచి గుంటూరు, పిడుగురాళ్ల, నాగార్జున సాగర్‌ మీదుగా ట్రాఫిక్‌ను మళ్లించారు. ఆర్టీసీ బస్సులకు ఇది వ్యయప్రయాసగా మారింది. సాధారణ వర్షాలకే ఇలా అయితే.. అతిభారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

ఎందుకిలా...?:

విజయవాడ నుంచి సుమారు 25 కిలోమీటరు వద్ద కీసర టోల్‌ప్లాజా ఉంది. ఇక్కడే మునేరు నదిపై హైలెవల్‌ వంతెన నిర్మించారు. కానీ ఐతవరం గ్రామ సమీపంలో జాతీయ రహదారి తక్కువ ఎత్తులో ఉంది. మునేరుకు భారీగా వరద పోటెత్తడంతో దీనిపై దాదాపు 3 అడుగుల ఎత్తు నీరు ప్రవహించింది. జాతీయ రహదారులపైకి నీరు వచ్చేలా ఎలా నిర్మాణం చేశారనది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ రహదారిని 2010లో నాలుగు వరసలుగా ఒక నిర్మాణ సంస్థ చేపట్టింది. మునేరుకు 2005లోనే గరిష్ఠంగా 2.87 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది. అప్పట్లో అయితవరం వద్ద జాతీయ రహదారిపైకి నీరు వచ్చింది. రోడ్డు నిర్మాణంలో భాగంగా వంతెనలు కట్టేటప్పుడు సమీపంలో వరద గణాంకాలను పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు ఎత్తు పెంచి కడతారు. కానీ మునేరు నదిపై నిర్మించిన హైలెవల్‌ వంతెన విషయంలో దీన్ని విస్మరించినట్లు అర్థమవుతుంది. 2005లో గరిష్ఠ వరదను లెక్కలోకి తీసుకుని ఆ స్థాయిలో రహదారి ఎత్తు పెంచాలని ప్రయానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అధికారులు ఏమంటున్నారంటే..?

మునేరు వాగు తెలంగాణ ప్రాంతం వరంగల్‌ జిల్లా పాకాల చెరువు అలుగు నుంచి వస్తుంది. ఖమ్మం మీదుగా వత్సవాయి మండలం పోలంపల్లి వద్ద ఎన్టీఆర్‌ జిల్లాలోకి వస్తుంది. అక్కడ ఒక ఆనకట్ట కట్టారు. దీనికింద 18వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఏడాది వచ్చిన వరద పోలంపల్లి వద్ద 1.84 లక్షల క్యూసెక్కులు గరిష్ఠంగా నమోదైంది. పోలంపల్లి కింది భాగంలో కట్టలేరు, వైరా ఏరు కలుస్తాయి. ఈ రెండు ఉప ఏరుల నుంచి సుమారు 50 వేల క్యూసెక్కుల వరకు వరద వచ్చి ఉంటుందని అంచనా. మునేరు వరదతో పాటు.. స్థానిక వాగులు, వంకల నుంచి అత్యధిక వరద వచ్చి చేరి ఉంటుందని, అందుకే జాతీయ రహదారిపైకి నీరు చేరిందని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అభిప్రాయపడ్డారు. ఒక్కసారిగా వాగుల నుంచి వరద పెరిగిందని జలవనరుల శాఖ ఇంజినీరు ఒకరు చెప్పారు. కీసర వద్దకు 2 లక్షలు పైగా క్యూసెక్కుల నీరు వచ్చి ఉంటుందని పేర్కొన్నారు. జాతీయ రహదారుల సంస్థ పీడీ నారాయణను సంప్రదించగా.. ఐతవరం వద్ద రహదారి ఎత్తు తక్కువగానే ఉందని, 2005లో ఒకసారి వరద వచ్చిందని వివరించారు. నాటి వరదను దృష్టిలో ఉంచుకొని నిర్మించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామనీ, రోడ్డు ఎత్తు పెంచేందుకు ప్రతిపాదిస్తామని ‘ఈనాడు’ తో చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని