Godavari floods: ముంచేసిన వరద

ఉగ్ర గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. పెరుగుతున్న వరద ఉద్ధృతికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

Updated : 30 Jul 2023 10:05 IST

ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవాహం
జలదిగ్బంధంలో కోనసీమ లంకలు
ఉపాధి కరవై ఇళ్లలోనే మగ్గుతున్న ప్రజలు
అరకొరగా పునరావాస కేంద్రాలు
ఈనాడు-రాజమహేంద్రవరం, కాకినాడ

ఉగ్ర గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. పెరుగుతున్న వరద ఉద్ధృతికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులు, కాజ్‌వేలను వరద ముంచెత్తడంతో గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పడవలు, ట్రాక్టర్లలో రాకపోకలు సాగించాల్సి వస్తోంది. గ్రామాలనుంచి కదల్లేని పరిస్థితి ఉండటంతో వందల కుటుంబాలు ఉపాధి, చేపల వేటకు దూరమయ్యాయి. పరిస్థితి ప్రమాదకరంగా మారుతున్నా ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం చేయడం లేదు. కొన్నిచోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసినా.. చాలాచోట్ల అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వం నిత్యావసరాలు అందిస్తే బాధితులకు ఉపశమనం లభించనుంది. సీఎం జగన్‌ గతంలో గురజాపులంక వద్ద కోత సమస్య పరిష్కారానికి, వెదురుబిడెం వద్ద కాజ్‌వే నిర్మాణంవంటి పలు హామీలిచ్చినా అవి అమలుకాలేదు. ఇలా అయితే తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

అంతకంతకూ పెరుగుతూ..

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. శనివారం ఉదయం ఐదింటికి 14.20 అడుగుల నీటిమట్టం నమోదవగా 13,40,383 క్యూసెక్కులను సముద్రంలోకి విడిచిపెట్టారు. క్రమేపీ ఎగువనుంచి వరద పెరుగుతూ రాత్రి 8 గంటలకు 14,76,922 క్యూసెక్కులు వదిలారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద మూడో ప్రమాదహెచ్చరిక కొనసాగుతోంది.. అక్కడ ఉదయం 5 గంటలకు 54.20 అడుగుల నీటిమట్టం నమోదై రాత్రి 8 గంటలకు 55.80 అడుగులకు చేరింది. ఆ తరువాత 3 సెం.మీ.మేర పెరుగుతూ స్థిరంగా కొనసాగుతోంది. శనివారం అర్ధరాత్రిలోగా ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు 15.50 లక్షల క్యూసెక్కులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎక్కడికక్కడే బందీలుగా..

కోనసీమ లంకల్లోకి శనివారం ఉదయం నుంచి వరద పెరుగుతుండడంతో సుమారు 30 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వారందరికీ పడవలే ఆధారమయ్యాయి. పి.గన్నవరం మండలం కె.ఏనుగుల్లంకలో ముంపు నీటిలోనే స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. పశుగ్రాసమంతా ముంపునకు గురవడంతో అధిక ధరకు దాణా కొనుగోలు చేయాల్సి వస్తోందని పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో పదివేల హెక్టార్లలో ఉద్యాన, కూరగాయల పంటలు నీట మునిగి నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు.

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

సున్నిపెంట సర్కిల్‌, న్యూస్‌టుడే: ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలానికి భారీగా వరదనీరు వస్తోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1,80,835, సుంకేసుల నుంచి 2,181 క్యూసెక్కుల నీరు చేరుతోంది. కృష్ణా జలాలు రేడియల్‌ క్రస్ట్‌గేట్లను తాకాయి. శ్రీశైలం నీటిమట్టం శనివారం సాయంత్రం ఆరింటికి 837.90 అడుగులు, నీటినిల్వ 58.8171 టీఎంసీలుగా నమోదైంది.


దెబ్బతిన్న గుడిసెలకు రూ.10 వేలు

గోదావరి వరదల్లో దెబ్బతిన్న గుడిసెలకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, ఉల్లి, బంగాళదుంపలు, లీటరు పామోలిన్‌ను ఉచితంగా ఇవ్వాలని ఆదేశించింది. సహాయ పునరావాస శిబిరాల్లో ఉన్నవారు.. తమ ఇళ్లకు వెళ్లే సమయంలో కుటుంబానికి రూ.2వేలు, వ్యక్తులకు రూ.1,000 చొప్పున అందించాలని పేర్కొంది. ఈ మేరకు రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీచేశారు.


సంగమేశ్వరాలయంలోకి కృష్ణమ్మ

శ్రీశైల వెనుక జలాలు పెరగడంతో నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వరాలయం చుట్టూ నీటిమట్టం పెరుగుతోంది. సాయంత్రం 6:30 గంటలకు గర్భాలయంలోకి నీరు చేరింది.


ఈనాడు, కర్నూలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు