విశాఖలో ‘భూ’చోళ్లు!

ఎసైన్డ్‌ భూముల చట్టానికి సవరణ వస్తుందని ముందే తెలుసుకున్న వైకాపా నేతలు కొందరు విశాఖలోని పేదల భూములపై కన్నేశారు.

Published : 06 Aug 2023 05:29 IST

ఎసైన్డ్‌ భూములపై వైకాపా కీలక నేతల కన్ను
చట్టసవరణ వస్తుందని తెలిసి వ్యూహాలు
ముందుగానే వందల ఎకరాల కొనుగోలు

ఈనాడు, విశాఖపట్నం, వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ఎసైన్డ్‌ భూముల చట్టానికి సవరణ వస్తుందని ముందే తెలుసుకున్న వైకాపా నేతలు కొందరు విశాఖలోని పేదల భూములపై కన్నేశారు. ఎక్కడికక్కడ రైతుల మీద ఒత్తిడి తెచ్చి విలువైన భూముల్ని కొన్నారు. అడ్వాన్సులు చెల్లించి పత్రాలు రాయించుకున్నారు. కొంతకాలంగా ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా ఎసైన్డ్‌  భూములపై 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రైతులు ఆ ఎసైన్డ్‌ భూముల్ని అమ్ముకునే అవకాశం ఏర్పడినట్లయింది. ఇప్పటికే వాటిని ఒప్పందాల ద్వారా తమ పరం చేసుకున్న పెద్దలు... త్వరలో అధికారికంగా తమ పేరున మార్చుకోవటానికి ప్రభుత్వ తాజా నిర్ణయం అవకాశమిస్తోంది.  

మంత్రి వ్యూహాలతో..

ఎసైన్డ్‌ భూముల్ని సొంతం చేసుకునేందుకు అమరావతి ప్రాంతానికి చెందిన ఒక మంత్రి వ్యూహాల మేరకు వారి కుటుంబీకులు విశాఖలో చక్రం తిప్పినట్లు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఇటీవల విశాఖ జిల్లాలోని 4 మండలాల పరిధిలో ముమ్మరంగా తిరిగారు. వీరికి ఇద్దరు విశ్రాంత రెవెన్యూ అధికారులు సహకారం అందించినట్లు విశ్వసనీయ సమాచారం. పెందుర్తి, ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాల్లో 300 ఎకరాలకుపైగా భూముల్ని ఒప్పంద పత్రాల ద్వారా కొన్నట్లు చెబుతున్నారు. మధురవాడ కేంద్రంగా ఈ వ్యవహారం సాగిందంటున్నారు.

  • ఆనందపురం మండలం గుడిలోవలో మూడెకరాల భూమి కొనుగోలు విషయంలో రైతులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఎకరాకు రూ.35 లక్షలు చెల్లిస్తామని, 9 నెలల్లోపు అభివృద్ధి ఒప్పందం చేసుకుంటామని అలా జరగకుంటే ఇచ్చిన ముందస్తు చెల్లింపును వదులుకొని భూమిని తిరిగిచ్చేస్తామని బేరసారాలు సాగించారు. తమకు రాజధాని స్థాయిలో ఉన్న పలుకుబడిని వివరించడంతో రైతులు భయపడి ఒప్పందం చేసుకోక తప్పలేదు. ఇదంతా మంత్రి కుటుంబసభ్యుల కనుసన్నల్లోనే జరిగిందంటున్నారు. ఆ మంత్రి కూడా ఇటీవల పలుమార్లు తనిఖీల పేరుతో విశాఖ వచ్చి వెళ్లారు. ఆయనకు విశాఖతో ఎక్కువ అనుబంధం ఉంది. గతంలో పనిచేసినప్పటి పరిచయాలను ఈ భూముల కొనుగోలుకు వినియోగించుకున్నట్లు చెబుతున్నారు.

ఈ ప్రాంతాల్లో..

అధికార పార్టీ నేతలు.. విశాఖ జిల్లాలోని పద్మనాభం, ఆనందపురం, అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలాల్లో భారీగా భూముల్ని కొనుగోలు చేశారు. ఎకరాకు రూ.30 లక్షల వరకు, మరికొందరు ఇంకా తక్కువకు కొన్నారు. ఓ నేత అండతో ఒకే చోట ఆనందపురం మండల పరిధిలో 30 ఎకరాల వరకు ఒక వ్యక్తి కొన్నట్లు సమాచారం. వీరందరికీ ప్రభుత్వ నిర్ణయం గురించి ముందే తెలియడంతో పేదల భూములను తమ పరం చేసుకున్నారు.

వెయ్యి ఎకరాలకు..

విశాఖలో 11 మండలాలున్నాయి. ఐదు మండలాల్లో దాదాపు పది వేల ఎకరాలకుపైగా పేదలకు ఎసైన్‌ చేశారు. వీటిలో జగనన్న కాలనీల కోసం ఇటీవల 6 వేల ఎకరాలు సమీకరించారు. వీఎంఆర్‌డీఎ, ఇతర అవసరాలకు 770 ఎకరాలు సమీకరిస్తున్నారు. ప్రస్తుతం రైతుల వద్ద 3 వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నారు. ఆరు నెలలుగా స్థిరాస్తి వ్యాపారులు, అధికార పార్టీ నేతల అండదండలున్న వారు.. వెయ్యి ఎకరాలకు అడ్వాన్సులు చెల్లించి కొనుగోలు ఒప్పందాలు రాయించుకున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని