YS Jagan: సిరిలా పెరుగుతోందక్కడ.. ఉరిపై ఒరుగుతోందిక్కడ

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన మీ బిడ్డ ప్రభుత్వమిది. రైతుల పట్ల మీ ప్రభుత్వం చూపిస్తున్న ప్రేమతో రాష్ట్రంలో పంటల దిగుబడి పెరిగింది.

Updated : 06 Aug 2023 08:23 IST

వరిపంటపై వైకాపా ప్రభుత్వ తీరు దారుణం
2019-20తో పోలిస్తే రాష్ట్రంలో తగ్గిన సాగు, ఉత్పత్తి
తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి 2.71 కోట్ల టన్నులు
ఆంధ్రప్రదేశ్‌లో 1.29 కోట్ల టన్నులే
సేద్యంలో అద్భుత ఫలితాలంటే ఇవేనా సీఎం గారూ?
ఈనాడు - అమరావతి

దిగుబడి పెరిగింది..

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన మీ బిడ్డ ప్రభుత్వమిది. రైతుల పట్ల మీ ప్రభుత్వం చూపిస్తున్న ప్రేమతో రాష్ట్రంలో పంటల దిగుబడి పెరిగింది.

రైతు భరోసా విడుదల సందర్భంగా ఈ ఏడాది జూన్‌ 1న కర్నూలు జిల్లా పత్తికొండలో సీఎం జగన్‌


ఇదా పెరగడమంటే?

2019-20తో పోలిస్తే.. ధాన్యం ఉత్పత్తి తెలంగాణలో 1.78 కోట్ల టన్నుల నుంచి 2.72 కోట్ల టన్నులకు పైగా చేరింది. అక్కడ సాగు విస్తీర్ణం, ఉత్పత్తి 50% పైనే పెరిగాయి. ధాన్యాగారంగా గుర్తింపు పొందిన ఏపీలో సాగు, ఉత్పత్తి పెరగనేలేదు. 2019-20తో పోలిస్తే గతేడాది 7 లక్షల టన్నుల దిగుబడి తగ్గింది. సీఎం జగన్‌ రోజూ చాటింపు వేసుకుంటున్నట్లు.. వ్యవసాయంలో అద్భుత ఫలితాలు సాధించడమంటే ఇదేనా? వరి ఉత్పత్తిని కోటిన్నర టన్నులకూ చేర్చలేకపోయామని ఎప్పుడైనా గుర్తించారా?

  • రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం ఎందుకు తగ్గుతోందో పరిశీలించారా? ముంపు భరించలేక గోదావరి, కృష్ణా డెల్టాల్లో సాగు మానుకుంటున్నారనే సంగతైనా సీఎంకు తెలుసా?
  • నిద్రలేని రాత్రులెన్నో గడిపి.. అప్పు తెచ్చి మరీ ఎకరానికి రూ.45 వేలకు పైగా పెట్టుబడి పెడితేనే ధాన్యం చేతికొస్తుంది. ఆ ధాన్యాన్ని కొనడం ద్వారా.. రైతులకు నాలుగేళ్లలో రూ.58,800 కోట్ల సాయం చేశామని చెప్పడం సీఎం జగన్‌కే సాధ్యం.

ధాన్యాగారం.. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణ.. ఆంధ్రప్రదేశ్‌లో ఇవి గతవైభవాలే. రాష్ట్రంలో వరి సాగు గాలిలో దీపంలా తయారవుతోంది. తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం, ఉత్పత్తి భారీగా పెరగ్గా.. ఇక్కడ తగ్గింది. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోతోందని, ఆహార కొరత తలెత్తే ప్రమాదం ఉందని అధ్యయనాలు స్పష్టంచేస్తున్నా.. సీఎం జగన్‌ మొద్దు నిద్ర వీడటం లేదు. వరి రైతును ఆదుకునే చర్యలే లేవు. మొన్నటికి మొన్న దేశం నుంచి బియ్యం ఎగుమతుల్ని నిషేధిస్తే... అమెరికాలో మనవారు ఎంతలా ఎగబడాల్సి వచ్చిందో, ధరలు ఎలా పెరిగాయో చూశాం? అయినా ప్రభుత్వం వరి ఉత్పత్తిని పెంచే ప్రయత్నమే చేయడం లేదు. నాలుగేళ్ల వైకాపా పాలనలో వరి రైతులకు మిగిలింది నష్టాలూ కష్టాలే. ఏటా ఒకటికి రెండు, మూడు సార్లు మునుగుతూ.. మాగాణి సాగు అంటేనే వణికిపోతున్నారు. మద్దతు ధర దక్కదు. ధాన్యం అమ్మిన సొమ్ము ఎప్పుడిస్తారో దైవాధీనమే. వర్షాలొచ్చి పంట దెబ్బతిన్నా పట్టించుకునే దిక్కులేదు. మద్దతు ధరతోపాటు గోతాలు, రవాణా ఖర్చులకు అదనంగా క్వింటాలుకు రూ.300 ఇస్తున్నామని గొప్పలు చెప్పడం తప్పితే... వాస్తవంగా ఎంతమందికి లబ్ధి కలుగుతోందో పట్టించుకోవడం లేదు. ధాన్యం సేకరణలో మెరుగైన విధానం తెచ్చామని, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఉద్ధరిస్తున్నామంటూ ప్రచారం చేసుకోవడం తప్పితే.. ఒనగూరిందేమీ లేదని రైతులు మండిపడుతున్నారు. గతంతో పోలిస్తే ధాన్యం కొనుగోలులో నిబంధనలు పెట్టి సతాయిస్తున్నారని అన్నదాతలు వాపోతున్నారు. లోపాల్ని సమీక్షించుకుందామనే కనీస ఆలోచనా ప్రభుత్వంలో కొరవడింది. ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణస్వీకారం చేసే నాటికి... అంటే 2018-19లో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 1.23 కోట్ల టన్నులుంది. తర్వాతి ఏడాది 1.37 కోట్ల టన్నులకు పెరిగినా, 2022-23లో 1.29 కోట్లకు తగ్గింది. ఇదే సమయంలో తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి 1.78 కోట్ల టన్నుల నుంచి 2.72 కోట్ల టన్నులకు ఎగసింది. జగన్‌ దృష్టిలో వ్యవసాయంలో వృద్ధి అంటే ఇదేనేమో?

పంట విరామం ప్రకటించినా మొద్దు నిద్రే

గోదావరి, కృష్ణా డెల్టాల్లో మురుగునీరు ముందుకు పారే పరిస్థితి లేదు. చిన్న వర్షం కురిసినా నీరు నిలిచి పంట మునుగుతోంది. దీంతో రైతులు గతేడాది పంట విరామం ప్రకటించారు. 2022-23 ఖరీఫ్‌లో పశ్చిమగోదావరి జిల్లాలో 50 వేల ఎకరాలు, కోనసీమ జిల్లాలో 46 వేల ఎకరాలు, ఏలూరు జిల్లాలో 35 వేల ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 28 వేలు, వైయస్‌ఆర్‌ జిల్లాలో 12 వేల ఎకరాల్లో సాగు తగ్గింది. బాపట్ల, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ కొందరు రైతులు ఖరీఫ్‌కు దూరంగా ఉన్నారు. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. 2020-21లో గోదావరికి మూడుసార్లు వరదలొచ్చాయి. నారుమడి దశలో, నాట్లు వేశాక, కోత దశలో పొలాలు మునిగాయి. పూర్తిగా నష్టపోయిన కౌలు రైతులు లక్షల మంది ఉన్నారు.  వారి గోడు ప్రభుత్వానికి పట్టలేదు. నామమాత్ర పెట్టుబడి రాయితీ, పరిహారంతో సరిపెట్టి.. ఆదుకున్నామని గొప్పలు చెబుతోంది. ఒక్కో కుటుంబానికి అప్పులు ఎంత పెరిగాయో పట్టించుకోలేదు. నాగార్జునసాగర్‌ ఆయకట్టులో రెండేళ్ల కిందట.. కౌలు ఇవ్వొద్దు, సాగు చేసుకోవాలని చెప్పినా ఎవరూ ముందుకు రాని పరిస్థితులున్నాయి. దీనికి కారణాలేమిటనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు.

ఏటా ఉత్పాతమే

రాష్ట్రంలో వరి ఉత్పత్తికి విఘాతం కలుగుతున్నా.. అదేమీ పెద్ద విషయం కాదన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీని ప్రభావం రైతులు, రైతు కూలీలపై ఉంటుందని గుర్తించడం లేదు. పనుల్లేక కూలీల జీవనమే ప్రశ్నార్థకం అవుతుందనే విషయాన్ని విస్మరిస్తోంది. ఉదాహరణకు 2022-23లో సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే 6.34 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. ఎకరానికి 23.24 క్వింటాళ్ల దిగుబడి లెక్కన చూస్తే 14.58 లక్షల టన్నుల ఉత్పత్తి తగ్గిపోయినట్లే. ఆ మేరకు రైతులకు ఆదాయం పోవడమే కాకుండా, కూలీలూ ఉపాధి కోల్పోయినట్లే.

  • 2020లో అక్టోబరు నాటికి వర్షాల కారణంగా 3.51 లక్షల ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. 39.27 లక్షల క్వింటాళ్ల ధాన్యం ఉత్పత్తి దెబ్బతిందని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి నివేదించింది. అంటే సుమారు రూ.734 కోట్ల విలువైన ఉత్పత్తికి విఘాతం కలిగింది. వర్షాలు వెంటాడటంతో.. 2021 ఖరీఫ్‌లో వరి సాగు చేసిన రైతులకూ నష్టాలే మిగిలాయి. పెద్దఎత్తున పంటనష్టం జరగడంతో అధికశాతం రైతులకు పెట్టుబడిలో చిల్లిగవ్వ అయినా దక్కలేదు.
  • 2020-21 ఖరీఫ్‌లో సగటు దిగుబడి ఎకరాకు 16.89 క్వింటాళ్లే వచ్చింది. రైతులు అధికశాతం నష్టపోయారు. 2021-22 ఖరీఫ్‌లోనూ సగటున ఎకరాకు 17.21 క్వింటాళ్లే లభించాయి. 2022-23 రబీలో ధాన్యం రైతుల ఆశలపై వర్షాలు నీళ్లు చల్లాయి.
  • 2022-23లో సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే వరి సాగు 6.34 లక్షల ఎకరాలు తగ్గింది. అంటే ఎకరానికి 23 క్వింటాళ్ల లెక్కన పంట ఉత్పత్తి తగ్గినట్లే.

ఒక ఎకరా వరి మానితే

ఒక ఎకరా వరి సాగుకు.. నారు మడి నుంచి గట్లు చెక్కడం, నాట్లు, కలుపు తీతలు, కోతలు, నూర్పిడికి సుమారు 45 మంది కూలీలు అవసరం. సగటున రూ.400 ప్రకారం చూసినా రూ.18,000 కూలీ చెల్లిస్తారు. ఒక ఎకరాలో వరి వేయకపోతే 45 మందికి పనిదినాలు తగ్గిపోయినట్లే.

మద్దతు ధరలో మాయ..  

కష్టాలకోర్చి ధాన్యాన్ని పండించినా... కొనడానికి ప్రభుత్వం సతాయిస్తోంది. మద్దతు ధర క్వింటాలుకు రూ.2,040(సాధారణ రకం) చొప్పున ఉంటే.. రైతుకు వాస్తవంగా దక్కేది రూ.1,700 లోపే. గోతాలు, రవాణా ఖర్చుల రూపంలో క్వింటాలుకు రూ.300 అదనంగా భరిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. 10% మందికీ దక్కడం లేదు. మద్దతు ధరకు ధాన్యం కొనకుండానే... కొన్నట్లు లెక్కల్లో రాయడానికి రైతుల నుంచి ఎదురు సొమ్ము వసూలు చేస్తున్నారు. గతంలో పంట అమ్మితే వెంటనే సొమ్ములొచ్చేవి, అవసరమైతే మిల్లర్లు కొంత మొత్తాన్ని అడ్వాన్సుగా ఇచ్చేవారు. ఇప్పుడు అమ్ముకోవడానికే అగచాట్లు పడాల్సి వస్తోంది.


సాయంలోనూ మొండిచేయి

  • రైతులకు రాయితీపై టార్పాలిన్లూ ఇవ్వలేదు. ధాన్యం ఆరబెట్టేందుకు.. పట్టల అద్దెలకే రూ.5 వేలకు పైగా అవుతోంది.
  • తడిసిన ధాన్యాన్ని కొంటామని ఊకదంపుడు ఉపన్యాసాలు తప్పితే.. కొన్నదే లేదు. అన్నదాతలు తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది.
  • విపత్తుల నష్టానికి ఇచ్చే పెట్టుబడి రాయితీ మొక్కుబడి చందమే. 2018 తిత్లీ తుపాను సమయంలో ఎకరాకు రూ.8 వేల చొప్పున ఇచ్చారు. జగన్‌ ప్రభుత్వం మాత్రం ఎకరాకు రూ.6 వేలు ఇచ్చి మమ అనిపిస్తోంది.
  • ధాన్యం కొన్నాక ఒకటి రెండు రోజుల్లో సొమ్ము జమ చేయాల్సి ఉండగా... గడువును 21 రోజులకు పెంచారు. దాన్నీ నెలల తరబడి ఇవ్వకుండా సతాయించడమూ సీఎం జగన్‌కే చెల్లింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని