సమస్య చెప్పుకుందామని వస్తే గెంటేశారు: మంత్రి ధర్మాన సభలో ఓ వ్యక్తికి భంగపాటు

మంత్రి అడిగారు కదా తన సమస్య చెప్పుకొందాం అని ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు బయటకు గెంటేసిన ఘటన ఇది.

Updated : 11 Aug 2023 08:06 IST

ఆత్మకూరు, న్యూస్‌టుడే: మంత్రి అడిగారు కదా తన సమస్య చెప్పుకొందాం అని ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు బయటకు గెంటేసిన ఘటన ఇది. గురువారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అధ్యక్షతన రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘రెవెన్యూ సంస్కరణల వల్ల ఎవరైనా నష్టపోయారా‘ అని ప్రశ్నించారు. నేను నష్టపోయానని బోయిళ్లచిరువెళ్ల ఎస్సీ కాలనీకి చెందిన ఏసిపోగు రామకృష్ణ అనే వ్యక్తి బదులివ్వగా వెంటనే పోలీసులు అతడిని నెట్టుకుంటూ బయటకు తీసుకెళ్లిపోయారు. సభా మందిరం బయట రామకృష్ణ మాట్లాడుతూ 1956లో వేమన రామచంద్రనాయుడు కుటుంబీకుల పొలం తమకు రిజిస్టర్‌ చేయగా.. గ్రామంలోని కొందరు పెత్తందారులు దానిని ఆక్రమించారని ఆరోపించారు. నాలుగేళ్ల నుంచి పొలం ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదన్నారు. రెవెన్యూ సదస్సులో మంత్రికి చెప్పాలని ప్రయత్నించగా తనను మాట్లాడనీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతుండగా పోలీసులు గమనించి ఆ ఆవరణలో నుంచి వెళ్లిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు మర్రిపాడుకు చెందిన మహబూబ్‌బాషా అనే వ్యక్తి మంత్రి ధర్మాన రాక ముందు స్థానికులకు సమస్య చెబుతుండగా పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. మంత్రి సమావేశం పూర్తయిన అనంతరం విడిచి పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని