మార్గదర్శికి భారీ ఊరట

మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. చిట్‌ గ్రూప్‌ల నిలిపివేతపై అభ్యంతరాలు తెలపాలని చందాదారులను కోరుతూ ప్రభుత్వం జులై 30న ఇచ్చిన బహిరంగ నోటీసును రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం శుక్రవారం సస్పెండ్‌ చేసింది.

Updated : 12 Aug 2023 06:38 IST

చిట్స్‌ నిలిపివేతపై ప్రభుత్వ నోటీసును సస్పెండ్‌ చేసిన హైకోర్టు  
తదుపరి చర్యలు తీసుకోవద్దని స్పష్టీకరణ
ఈనాడు - అమరావతి

మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. చిట్‌ గ్రూప్‌ల నిలిపివేతపై అభ్యంతరాలు తెలపాలని చందాదారులను కోరుతూ ప్రభుత్వం జులై 30న ఇచ్చిన బహిరంగ నోటీసును రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం శుక్రవారం సస్పెండ్‌ చేసింది. ఆ నోటీసుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవద్దని తేల్చిచెప్పింది. ప్రభుత్వ ప్రోద్బలంతో ఇచ్చిన స్వల్ప ఫిర్యాదు తప్ప.. చందాదారులు దాఖలు చేసిన వ్యాజ్యంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినా పరిస్థితిలో ఎలాంటి మార్పూ కనిపించడం లేదని మార్గదర్శి తరఫున సీనియర్‌ న్యాయవాది వాదనలు వినిపించారని గుర్తుచేసింది. ఈ పరిస్థితుల్లో చిట్‌ గ్రూపుల నిలుపుదలకు చిట్స్‌ రిజిస్ట్రార్‌/ డిప్యూటీ రిజిస్ట్రార్‌ బహిరంగ నోటీసు జారీకి చర్యలు చేపట్టడం చూస్తుంటే చట్టాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వం దురుద్దేశంతో వ్యవహరిస్తోందన్న మార్గదర్శి న్యాయవాది వాదనలకు బలం కనిపిస్తోందని పేర్కొంది. చిట్‌ గ్రూపుల నిలిపివేత విషయంలో చందాదారులు దాఖలు చేసిన వ్యాజ్యాలు, ప్రస్తుతం మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని.. వాటన్నింటినీ కలిపి విచారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోతే మార్గదర్శి, చందాదారులకు పూడ్చుకోలేని నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించింది. కొన్ని చిట్‌ గ్రూపుల నిలుపుదలను సవాలు చేస్తూ చందాదారులు గతంలో దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్లు గుర్తుచేసింది. ప్రస్తుతం జారీ చేసిన బహిరంగ నోటీసు ఆధారంగా చిట్‌ అధికారులు తదుపరి చర్యలు ప్రారంభిస్తే వివిధ బ్రాంచ్‌లలో పెద్దసంఖ్యలో ఉన్న చిట్‌ చందాదారులపై ఆ ప్రభావం పడుతుందని తెలిపింది. మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ చెబుతున్నట్లు గ్రూపుల మూసివేత పర్యవసాన ప్రభావం ఆ సంస్థపై పడుతుందని పేర్కొంది. అందువల్ల మార్గదర్శికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకే మొగ్గు చూపినట్లు కోర్టు స్పష్టం చేసింది. చందాదారులు దాఖలు చేసిన వ్యాజ్యాలతో ప్రస్తుత వాజ్యాలను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న స్ట్రాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌- ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, విశాఖ జిల్లాల చిట్స్‌ డిప్యూటీ రిజిస్ట్రార్లకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్య శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

ప్రభుత్వం కౌంటర్‌ వేశాక ఇతర అంశాలపై విచారణ: ప్రభుత్వ వెబ్‌సైట్లో ఉంచిన చిట్‌ గ్రూపుల విషయంలో అభ్యంతరాలు తెలపాలని చందాదారులను కోరుతూ చిట్స్‌ రిజిస్ట్రార్‌ ఈ ఏడాది జులై 30న ఇచ్చిన బహిరంగ నోటీసు, దాని ఆధారంగా చిట్‌ గ్రూపుల నిలిపివేతను సవాలు చేస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ ఆథరైజ్డ్‌ రిప్రజెంటేటివ్‌ పి.రాజాజీ హైకోర్టును ఆశ్రయించారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, విశాఖ జిల్లాల చిట్‌ గ్రూపుల విషయంలో ఇచ్చిన బహిరంగ నోటీసులను సవాలు చేస్తూ వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇటీవల జరిగిన విచారణలో వాదనలు ముగియడంతో బహిరంగ నోటీసును సస్పెండ్‌ చేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌ జయసూర్య శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేశాక ఇతర విషయాలపై విచారణ జరపాల్సి ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. మధ్యంతర ఉత్తర్వుల దశలో ఇరువైపుల న్యాయవాదులు చెప్పిన వాదనల లోతుల్లోకి ప్రస్తుతం వెళ్లడం లేదన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ, చందాదారులు దాఖలు చేసిన వివిధ వ్యాజ్యాలు, వాటిలో తెలంగాణ, ఏపీ హైకోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తుత వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీచేసే విషయంలో పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని బహిరంగ నోటీసులను సస్పెండ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాల్లో సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ సింఘ్వీ, నాగముత్తు, దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని