CM Jagan: సీఎం జగన్‌ సభకు రాకపోతే ఇబ్బందులు పడతారు

కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో జగనన్న కాలనీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్‌ ఈ నెలలో రానున్నారు.

Updated : 19 Aug 2023 08:14 IST

సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్న సందేశం

కాకినాడ, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో జగనన్న కాలనీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్‌ ఈ నెలలో రానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం సభకు రావాలని, లేకపోతే పథకాల లబ్ధి ఆగిపోతుందని స్వయం సహాయ సంఘాల మహిళలను హెచ్చరిస్తూ వాట్సప్‌లో పంపిన మెప్మాకు చెందిన ఓ రిసోర్సు పర్సన్‌ వాయిస్‌ సందేశం సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం వైరల్‌ అయింది. ‘ఈ నెలలో ముఖ్యమంత్రి జగన్‌ సామర్లకోటకు వస్తున్నందున సంఘాల నుంచి మహిళలు సభకు రావాలి. ఈ రోజు ఉదయం జిల్లా అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఒక్కో ఆర్పీ.. ప్రతి గ్రూప్‌ నుంచి పది మంది సభ్యులను తీసుకురావాలని అధికారులు చెప్పారు. అయిదుగురు సభ్యుల్ని తీసుకువస్తామని చెప్పాం. ఒక్కో గ్రూపు నుంచి ఎంత మంది వస్తున్నారు? వారి పేర్లు, ఫోన్‌ నంబర్ల వివరాలు జిల్లా అధికారులకు ఇవ్వాలి. సంఘాల్లో ప్రతి సభ్యురాలూ లబ్ధి పొంది ఉన్నందున ముఖ్యమంత్రికి కృతజ్ఞత  చూపించుకోవాలి. కాబట్టి కచ్చితంగా హాజరుకావాలి. ఎవరెవరు వచ్చేదీ తక్షణం నాకు వాట్సప్‌లో మెసేజ్‌ పంపండి. స్పందించని వారి వివరాలు ఆఫీసుకు ఇచ్చేస్తా. తరువాత ఏ పథకం రాకపోయినా నన్ను అడగొద్దు. ఇంకా రుణమాఫీ డబ్బులు పడాల్సినవి ఉన్నాయి. పావలా వడ్డీ రావాల్సి ఉంది. అవి రాకపోతే ఇబ్బందులు పడతారు చూసుకోండి. సీఎం సభ జరిగే రోజు ఉదయం 7 గంటలకు వెళ్తే సాయంత్రం 4 గంటలకల్లా ఎవరింటికి వారు తిరిగి వచ్చేయవచ్చు. ఆటోలు, బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. వారే తీసుకువెళ్లి తీసుకువస్తారు’ అనేది ఆ సందేశంలో సారాంశం. దీనిపై సామాజిక మాధ్యమాల్లో చర్చ సాగుతోంది. సీఎం సభకు వెళ్లకపోతే పథకాల లబ్ధి ఆపేస్తారా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని