Mangalagiri: తమిళిసై గారూ.. ఏపీ రోడ్ల దుస్థితి చూడండి: కురగల్లులో వెలసిన ఫ్లెక్సీ

ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల దుస్థితిని తెలియజేయడానికి తమ గ్రామ రోడ్లే నిదర్శనమని తెలుపుతూ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లులో తెలుగు యువత ఆధ్వర్యంలో శనివారం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

Updated : 03 Sep 2023 08:51 IST

ఏర్పాటు చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

మంగళగిరి, తాడేపల్లి, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల దుస్థితిని తెలియజేయడానికి తమ గ్రామ రోడ్లే నిదర్శనమని తెలుపుతూ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లులో తెలుగు యువత ఆధ్వర్యంలో శనివారం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై తుళ్లూరు మండలంలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరైన నేపథ్యంలో ఆమె కురగల్లు మీదుగా వెళతారని తెలిసి దీన్ని ఏర్పాటు చేశారు. గవర్నర్‌ వస్తున్నారని గుంతలు పూడ్చారు తప్ప.. రోడ్ల అసలు పరిస్థితి ఇదంటూ చిత్రాలు, వివరాలను ఫ్లెక్సీలో ముద్రించారు. గ్రామంలోని ప్రధాన రోడ్డుపై దాన్ని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న మంగళగిరి గ్రామీణ పోలీసులు అక్కడకు చేరుకుని ఫ్లెక్సీ తొలగించాలని తెలుగు యువత నాయకుడు గుడారి గోపాలరావును ఆదేశించారు. ఆయన ససేమిరా అనడంతో గోపాలరావు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ఫ్లెక్సీని చించేసి, ఆయన్ని బలవంతంగా అదుపులోకి తీసుకుని మంగళగిరి గ్రామీణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. గవర్నర్‌ వెళ్లిపోయిన తర్వాత విడుదల చేశారు. ఈ సందర్భంగా గుడారి గోపాలరావు మాట్లాడుతూ కురగల్లు రోడ్ల దుస్థితిపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సీఆర్డీఏ కమిషనర్‌, ఆర్‌అండ్‌బీ, గ్రామ పంచాయతీ అధికారులకు నాలుగేళ్లుగా అర్జీలు ఇస్తూనే ఉన్నామన్నారు. వారెవరూ స్పందించకపోవడంతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశామని తెలిపారు. గవర్నర్‌ లాంటి వారు వస్తేనే రోడ్లకు మరమ్మతులు చేస్తారా? అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని