జాగ్రత్త.. ఎండార్స్‌ చేసినా కేసులు పెడుతున్నారు: మంత్రి ధర్మాన

‘పూర్వం మాదిరిగా తప్పు చేస్తే తప్పించుకునే పరిస్థితి ప్రస్తుతం లేదు. డిజిటలైజేషన్‌ విస్తృతమైన నేపథ్యంలో తప్పులు చేస్తే వెంటనే దొరికిపోయే అవకాశం ఉంది. మంత్రిగా ఉన్నప్పుడు నేను సింపుల్‌గా ఎండార్స్‌ చేస్తే సీబీఐ కేసు నమోదు చేసింది.

Updated : 02 Oct 2023 08:53 IST

ఈనాడు - అమరావతి, విద్యాధరపురం - న్యూస్‌టుడే: ‘పూర్వం మాదిరిగా తప్పు చేస్తే తప్పించుకునే పరిస్థితి ప్రస్తుతం లేదు. డిజిటలైజేషన్‌ విస్తృతమైన నేపథ్యంలో తప్పులు చేస్తే వెంటనే దొరికిపోయే అవకాశం ఉంది. మంత్రిగా ఉన్నప్పుడు నేను సింపుల్‌గా ఎండార్స్‌ చేస్తే సీబీఐ కేసు నమోదు చేసింది. ‘ప్లీజ్‌ ఎగ్జామిన్‌, డూ నెససరీ యాక్షన్‌’ అని మంత్రి రాస్తే తప్పేమిటి?’ అని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర స్థాయి కౌన్సిల్‌ సమావేశం విజయవాడలో ఆదివారం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘భూముల సమస్యల పరిష్కారంలో ఉద్యోగులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. కొందరు రకరకాల వాదనలు చేస్తారు. నిబంధనలు వివరించి సున్నితంగా వాటిని తిరస్కరించే విధానాన్ని అలవర్చుకోవాలి. చిన్నచిన్న అపోహలు ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య ఉంటాయి. ఉద్యోగులు ప్రతి విషయంపై అప్‌డేట్‌ కాకుండా ఉంటే అపఖ్యాతిని మూటగట్టుకోవాల్సి ఉంటుంది. రెవెన్యూశాఖ పేరును ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అని పేరు పెట్టడంపై సీఎం జగన్‌తో త్వరలోనే చర్చిస్తా. ‘టైటిల్‌ యాక్ట్‌’ త్వరలోనే రాష్ట్రంలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. గడిచిన నాలుగు సంవత్సరాల్లో రెవెన్యూ శాఖలో ముఖ్యమైన సంస్కరణలు అమల్లోనికి తెచ్చాం. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తాం’ అని పేర్కొన్నారు.

భూ పరిపాలన విభాగం ప్రధాన కమిషనర్‌ జి.సాయిప్రసాద్‌ మాట్లాడుతూ టైటిల్‌ యాక్ట్‌ అమల్లోకి వస్తే తహసీల్దార్ల బాధ్యత మరింత పెరుగుతుందన్నారు. రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏసీబీ అధికారులు తనిఖీల పేరుతో మూడు, నాలుగు రోజులపాటు ఇబ్బంది పెడుతున్నారని చెప్పగానే ముఖ్యమంత్రి నిలిపివేయించారన్నారు. రెవెన్యూ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతోందన్నారు. జూన్‌ 20ని రెవెన్యూ డే గా ప్రకటించాలని, తమను ఉమ్మడి సర్వీస్‌ రూల్‌్్స పరిధిలోకి తీసుకురావాలని కోరారు. సమావేశంలో ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి చేబ్రోలు కృష్ణమూర్తి, డిప్యూటీ కలెక్టర్ల సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ధర్మచంద్రారెడ్డి, విశ్వేశ్వరనాయుడు, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల కలెక్టర్లు దిల్లీరావు, వేణుగోపాలరెడ్డి, వీఆర్‌ఏ, వీఆర్‌ఓ సంఘాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


టీసీ, వీసీల బెడద నుంచి కాపాడండి: ఉద్యోగులు

టెలీ కాన్ఫరెన్స్‌ (టీసీ), వీడియో కాన్ఫరెన్స్‌ (వీసీ)ల ఒత్తిడితో రోజువారీ కార్యకలాపాలను కూడా చేసుకోలేకపోతున్నామని రెవెన్యూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. నెలలో కనీసం 25 రోజుల పాటు టీసీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు నిర్వహిస్తూ ఉన్నతాధికారులు ఒత్తిడికి గురిచేస్తున్నారన్నారు. విజయవాడలో ఆదివారం జరిగిన ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర స్థాయి కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా టీసీ, వీసీల గురించి వివిధ హోదాల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులు ఏకరవు పెట్టారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని