CM Jagan: చంద్రబాబు జైల్లో ఉన్నా బయటున్నా ఒకటే

చంద్రబాబుకు విశ్వసనీయత లేదు కాబట్టి ఆయన ప్రజల్లో ఉన్నా.. జైల్లో ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated : 10 Oct 2023 07:11 IST

ఆయనపై నాకెలాంటి కక్షా లేదు
పవన్‌ జీవితమంతా చంద్రబాబును మోయడమే
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలితోపాటు ఆ పార్టీలోని సగం మంది తెదేపావారే
వైకాపా ప్రతినిధుల సభలో సీఎం జగన్‌ విమర్శలు
జనవరిలో పింఛను రూ.3వేలకు పెంపు
ఫిబ్రవరిలో పార్టీ మ్యానిఫెస్టో ప్రకటిస్తామని వెల్లడి

ఈనాడు, అమరావతి: చంద్రబాబుకు విశ్వసనీయత లేదు కాబట్టి ఆయన ప్రజల్లో ఉన్నా.. జైల్లో ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబును ఎవరూ కక్ష సాధింపుతో అరెస్టు చేయలేదు. ఆయనపై నాకెలాంటి కక్షా లేదు. నేను లండన్‌లో ఉన్నప్పుడు బాబును పోలీసులు ఎత్తారు (అరెస్టు చేశారు)’ అంటూ నవ్వులు చిందించారు. ‘కేంద్రంలో భాజపా ఉంది. దత్తపుత్రుడు (పవన్‌ కల్యాణ్‌) భాజపాతోనే ఉన్నానని ఇప్పటికీ అంటున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలితోపాటు ఆ పార్టీలోని సగం మంది తెదేపా మనుషులే. అయినా కేంద్రంలోని ఐటీ, ఈడీలు చంద్రబాబుపై విచారణ జరిపి అవినీతిపరుడని నిరూపించాయి. ఈడీ అయితే కొందరు దోషులనూ అరెస్టు చేసింది. ఐటీ విభాగం బాబుకు నోటీసులిచ్చింది. బాబు మీద మోదీ అవినీతి ఆరోపణలు చేసిన సమయానికి మనం (వైకాపా) ప్రతిపక్షంలో ఉన్నాం. అంటే అప్పటికే మోదీకి, కేంద్రానికి అన్నీ తెలుసు కాబట్టే సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాలను రాష్ట్రంలోకి అడుగుపెట్టనివ్వనని నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఉపసంహరించుకున్నారు. ఆనాటికే అవినీతిపరుడని స్పష్టమైన ఆ వ్యక్తిమీద విచారణ చేయకూడదట, ఆధారాలను చూసి కోర్టు రిమాండ్‌కు పంపినా చంద్రబాబులాంటి వారిని చట్టానికి పట్టివ్వడానికి వీల్లేదని పచ్చ బ్యాచ్‌లు వాదిస్తున్నాయి’ అని అన్నారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన వైకాపా ప్రతినిధుల సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. బాబును సమర్థిస్తే పేదవాడిని వ్యతిరేకించడమే, పెత్తందారీ వ్యవస్థను సమర్థించడమే అనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. చంద్రబాబు, ఆయన పార్టీని చూసినప్పుడు పేదవాడికి, ప్రజలకు మోసాలు, అబద్ధాలు గుర్తొస్తే.. మన పార్టీని చూసినప్పుడు, జగన్‌ను చూసినప్పుడు సామాజికన్యాయం గుర్తుకొస్తాయని జగన్‌ చెప్పారు.  

పొత్తుల కోసం ప్రతిపక్షాల వెంపర్లాట

‘మన ప్రతిపక్షాలన్నీ పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయి. ప్రజలకు వారు చేసిన మంచి.. పెద్ద సున్నా కాబట్టి వారిలాంటి ఎన్ని సున్నాలు కలిసినా వచ్చేది ఒక పెద్ద సున్నా మాత్రమే. ఒకరైతే (పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి) పార్టీ పెట్టి 15 సంవత్సరాలైంది. ఈ రోజుకూ ఆయనకు ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థి లేడు, గ్రామంలో జెండా మోసే మనిషి లేడు. ఆయన జీవితమంతా చంద్రబాబును భుజాన ఎత్తుకుని మోయడానికే. చంద్రబాబు చేసిన మోసాల్లో, దోచుకున్న దాంట్లో ఆయన భాగస్వామి. ఇద్దరూ కలిసి ప్రజలను ఎలా మోసం చేయాలనే ఆలోచిస్తారే తప్ప మంచి చేయాలనుకోరు. మీ బిడ్డ పొత్తులను నమ్ముకోడు. ప్రజలతోనే మనకు పొత్తు. ప్రజలకు మనం చేసిన మంచే మన బలం. ఏ గ్రామం, ఏ నియోజకవర్గంలోనైనా 87 శాతం పైచిలుకు ఇళ్లల్లో మనం చేసిన మంచే కనిపిస్తుంది. అలాంటప్పుడు వై నాట్‌ 175 అని అడుగుతున్నా’ అని జగన్‌ పేర్కొన్నారు.

అధికారమనే బాధ్యతతోనే చేయగలిగాం

‘అధికారమనేది మనకు బాధ్యతను మాత్రమే నేర్పింది. బాధ్యతగా వ్యవహరించాం కాబట్టే 52 నెలల పాలనలో రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సువర్ణాక్షరాలతో లిఖించబడేలా పాలన అందించాం. లంచాలు, వివక్షకు చోటు లేకుండా పౌరసేవల పంపిణీలో డీబీటీ ద్వారా గొప్ప విప్లవాత్మక మార్పులు చేయగలిగాం. లంచాలు, వివక్ష లేకుండా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టగలిగాం. మూడు ప్రాంతాల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, మూడు రాజధానులను ప్రకటించే నిర్ణయం తీసుకున్నాం. 13 జిల్లాల ఏపీని 26 జిల్లాలుగా అడుగులు వేశాం.  మ్యానిఫెస్టోలోని 99 శాతం వాగ్దానాలను అమలు చేయడం ద్వారా జగన్‌ చెప్పాడంటే చేస్తాడని.. మాట నిలబెట్టుకుంటాడని.. కష్టమైనా నష్టమైనా అండగా ఉంటాడని మంచి పేరు తెచ్చుకోగలిగాం. రాష్ట్రంలో 2.07 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. నా పాదయాత్రలో నేను తెలుసుకున్న వివిధ వర్గాల సమస్యలన్నింటికీ ఈ 52 నెలల్లో పరిష్కారం చూపగలిగాం’ అని పేర్కొన్నారు.


మ్యానిఫెస్టో అమలు తీరుపై వాలంటీర్ల ప్రచారం

‘మార్చి, ఏప్రిల్‌లలో ఎన్నికలు జరగొచ్చు. మళ్లీ జగనన్ననే తెచ్చుకుందాం అని ప్రతి ఇంటికీ మన ఎన్నికల మ్యానిఫెస్టోను తీసుకువెళ్లాలి. మార్చిలో ఎన్నికలకు సన్నద్ధమవ్వాలి’ అని జగన్‌ పార్టీ శ్రేణులకు చెప్పారు.

  • గత నెల 30న మొదలైన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని నవంబరు 30 వరకు చేపట్టాలి.
  • నవంబరు 1 నుంచి డిసెంబరు 10 వరకు 40 రోజులు ‘ఎందుకు ఆంధ్రప్రదేశ్‌కు జగనే కావాలి’ కార్యక్రమం ఉంటుంది. వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి మన మ్యానిఫెస్టో అమలు తీరును వివరిస్తారు. అదే సమయంలో 2014లో తెదేపా మ్యానిఫెస్టో అమలు చేయలేదని గృహసారథులు, సచివాలయ సమన్వయకర్తలు ఆ ఇంట్లో వారికి వివరించాలి.
  • అక్టోబరు 25 నుంచి డిసెంబరు 31 వరకు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో రోజుకో నియోజకవర్గం చొప్పున 175 నియోజకవర్గాలను చుడుతూ ‘సామాజిక న్యాయ బస్సు యాత్ర’ ఉంటుంది. అందులో పార్టీకి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సీనియర్‌ నాయకులుంటారు. ఎమ్మెల్యేల అధ్యక్షతన వారి నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెట్టాలి. 
  • జనవరి 1న సామాజిక పింఛన్లను రూ.3 వేలకు పెంచుతాం. జనవరి 10 వరకు ప్రతి గ్రామంలోనూ దీనికి సంబంధించిన సంబరాలు నిర్వహించాలి. 
  • జనవరి 10 నుంచి 20 వరకు ‘వైఎస్సార్‌ చేయూత’ కింద గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5 వేల కోట్లు పంపిణీ చేస్తాం.
  • జనవరి 20 నుంచి 30 వరకు ‘వైఎస్సార్‌ ఆసరా’ చివరి విడతగా పొదుపు సంఘాల మహిళలకు రూ.6,500 కోట్లు ఇస్తాం’ అని ప్రకటించారు.

12న సామర్లకోటకు సీఎం జగన్‌

సీఎం జగన్‌ ఈ నెల 12న కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో హెలికాప్టర్‌ ఎక్కి ఉదయం 10 గంటలకు పెద్దాపురం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో సామర్లకోట లే-ఔట్‌కు వెళతారు. ఇక్కడి జగనన్న కాలనీ నుంచి రాష్ట్రస్థాయి సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.


వైకాపా ప్రతినిధుల సభలో ఐప్యాక్‌ హంగామా

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రతినిధుల సమావేశానికి ఐప్యాక్‌ సభ్యులు దాదాపు 100 మందికి పైగా తరలివచ్చారు. సభాప్రాంగణానికి వచ్చీపోయే నేతలతో మాట్లాడారు. క్రూ పేరుతో వీరికి ప్రత్యేకంగా పాస్‌లు ఇవ్వడంతో వారు లోపలా కలియదిరిగారు. నేతలతో కలిసిపోయి.. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏంటి? వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయనే వివరాలు సేకరించారు. కొందరు మాత్రం వైకాపా పథకాలపై ఎలా ప్రచారం చేయాలో నేతలకు వివరించారు. తెదేపా, జనసేనలకు సంబంధించిన వ్యతిరేక అంశాలను జనంలోకి ఎలా తీసుకెళ్లాలో తెలిపారు.


పార్టీ సేవలో వాలంటీర్లు!

విజయవాడ, న్యూస్‌టుడే: సభకు నగరపాలక సంస్థ, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు ఎటువంటి సంబంధం లేకపోయినా... అధికారులు కొందరు స్వామిభక్తి ప్రదర్శించారు. సభ జరిగే ప్రాంతానికి రావాలని విజయవాడలోని వార్డు వాలంటీర్ల గ్రూపుల్లో ముందుగానే మెసేజ్‌లు పెట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నాయకులు, ప్రజాప్రతినిధులకు సభా ప్రాంగణం చిరునామా, గేట్ల వివరాలు తెలిపేందుకు వాలంటీర్లు ముఖ్యంగా సభా ప్రాంగణం సమీపంలోని విజయవాడ తూర్పు, మధ్య నియోజకవర్గాల వాలంటీర్లంతా తప్పక హాజరు కావాలంటూ సమాచారం పంపారు. మహిళా వాలంటీర్లు స్వల్పంగా హాజరైనా, పురుష వాలంటీర్లు మాత్రం అధిక సంఖ్యలోనే వచ్చారు. వారంతా లోపలికి వెళ్లి పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకుంటున్న వాలంటీర్లను పార్టీ కార్యక్రమాలకు తరలించడంపై విమర్శలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని