CM Jagan: సారు పెళ్లికి వచ్చినా.. అంతే!

ఎమ్మెల్యే సోదరుడి వివాహ రిసెప్షన్‌ హడావుడి కాస్తా ప్రయాణికులకు చుక్కలు చూపించింది. సీఎం జగన్‌ సహా పలువురు మంత్రులు, ముఖ్యనాయకులు హాజరుకావడం వల్ల గంటల తరబడి ట్రాఫిక్‌ ఆపేయడంతో జనం అసహనం వ్యక్తం చేశారు.

Updated : 27 Oct 2023 07:57 IST

ప్రైవేటు, ప్రభుత్వ బడులకు సెలవులు
సీఎం, మంత్రుల రాకతో ట్రాఫిక్‌ నిలిపివేత
జాతీయ రహదారిపై గంటలకొద్దీ జామ్‌

ఈనాడు, రాజమహేద్రవరం, న్యూస్‌టుడే, రాజానగరం: ఎమ్మెల్యే సోదరుడి వివాహ రిసెప్షన్‌ హడావుడి కాస్తా ప్రయాణికులకు చుక్కలు చూపించింది. సీఎం జగన్‌ సహా పలువురు మంత్రులు, ముఖ్యనాయకులు హాజరుకావడం వల్ల గంటల తరబడి ట్రాఫిక్‌ ఆపేయడంతో జనం అసహనం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌చెరువులో జిల్లా వైకాపా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేశ్‌, సుకీర్తిల వివాహ రిసెప్షన్‌ గురువారం జరిగింది. సీఎం వస్తుండడంతో పోలీసులు జాతీయ రహదారిపై లారీలు, ఇతర భారీ వాహనాలను మళ్లించారు. దివాన్‌చెరువు కూడలి నుంచి ముందుకు వెళ్లే మార్గం లేక వాహనదారులు తీవ్ర అగచాట్లు చవిచూశారు. గంటల తరబడి నిరీక్షించాల్సి రావడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జాతీయ రహదారి నుంచి వేదిక వద్దకు వెళ్లే మార్గం సింగిల్‌ రోడ్డు కావడం, వేల వాహనాల రాకతో అక్కడా సమస్యలు తలెత్తాయి.

ట్రాఫిక్‌ నియంత్రణలో పోలీసులు వైఫల్యం చెందారని మాజీ ఎంపీ హర్షకుమార్‌ సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శించారు. రాజానగరం నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి బడి బస్సుల్లో జనాన్ని తరలించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. దీంతో రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు రాజమహేంద్రవరం నగరం, గ్రామీణంలోని కొన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలు ఐచ్ఛిక సెలవు వినియోగించుకోగా.. డీఈవో ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పేర్కొన్నాయి. జనాన్ని తీసుకువచ్చిన బడి బస్సులు ప్రాంగణం వరకు వెళ్లే అవకాశం లేక వాటిని జాతీయ రహదారి పక్కనే ఆపేయడంతో ట్రాఫిక్‌ సమస్య మరింత పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు