Buggana: ఆర్థికంగా కష్టకాలమే

గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే అన్ని రంగాల్లోనూ ఆర్థికంగా ఎంతో ప్రగతి సాధించామని ప్రకటించిన ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం బాగోలేదని స్పష్టం చేశారు.

Updated : 03 Nov 2023 11:31 IST

జీతాలు, పెన్షన్లు ఆలస్యం కావచ్చు
రాబడి, తలసరి ఆదాయం, ఉత్పత్తి పెరిగినా ఆర్థిక పరిస్థితి బాగోలేదు
ఆర్థిక మంత్రి బుగ్గన

ఈనాడు, అమరావతి: గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే అన్ని రంగాల్లోనూ ఆర్థికంగా ఎంతో ప్రగతి సాధించామని ప్రకటించిన ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం బాగోలేదని స్పష్టం చేశారు. ఆర్థికంగా కష్టకాలమే (డిఫికల్ట్‌ టైమ్‌) అని అభివర్ణించారు. అందుకే జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు ఆలస్యమవుతోందని సూత్రీకరించారు. వెలగపూడి సచివాలయంలో గురువారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అప్పుల విషయంలో తెదేపా నేత యనమల రామకృష్ణుడు రాసిన లేఖపై ఆయన స్పందిస్తూ.. నాటి తెదేపా ప్రభుత్వం, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కన్నా తాము తక్కువ అప్పులే చేశామని తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే రాబడులు పెరిగాయన్నారు. మూలధన వ్యయం ఎంతో పెంచామని గణాంకాలు వెల్లడించారు. ఆర్థికంగా అన్ని విషయాల్లో ఎంతో సాధించామని ప్రకటించారు.

‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని చెబుతున్నారు. మరి ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు’ అని ప్రశ్నించగా.. ‘నో నో నో ఆర్థిక పరిస్థితి గురించి నేను అలా చెప్పలేదు. యనమల ప్రస్తావించిన అంశాలపై మాట్లాడాను. ఆయన రాబడి పెరగలేదు అంటే, పెరిగింది అని చెప్పాను. తలసరి ఆదాయం పెరగలేదు అంటే, పెరిగిందని చెప్పాను. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరగలేదంటే, కాదు పెరిగిందని చెప్పాను. అలా చెప్పానంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని చెప్పినట్లు కాదు. రాష్ట్రంలో కష్టకాలమే (డిఫికల్ట్‌ టైమ్‌).. అందుకే జీతాలు, పెన్షన్లు ఆలస్యమవుతాయని ముందు నుంచి చెబుతూనే ఉన్నాం’ అని వెల్లడించారు. రాబడి పెరిగినా ఖర్చులు కూడా పెరిగిపోయాయన్నారు.

యనమల లెక్కలు సరికాదు

‘అప్పులపై యనమల భిన్నమైన లెక్కలు చెబుతున్నారు. ఆయనే రూ.4.50 లక్షల కోట్లు అంటారు. మళ్లీ రూ.10 లక్షల కోట్లు అంటారు, రూ.11 లక్షల కోట్ల అప్పు అంటారు. ఆయన లెక్కలను ఆయనే ఖండించుకుంటున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పు ఏదైనా అది 60 ఏళ్లలో చేసిందే తప్ప వైకాపా ప్రభుత్వంలో చేసింది కాదు’ అని మంత్రి బుగ్గన తేల్చారు. ‘భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఫోరెన్సిక్‌ ఆడిట్‌ కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. కానీ ఆ లెక్కలు చెప్పింది కాగ్‌, కేంద్ర ప్రభుత్వమే. కాగ్‌ ఇచ్చిన లెక్కలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ ఏమిటి’ అని ఆయన ప్రశ్నించారు. ‘కేంద్రం చెప్పినవైనా వాటికి ఆధారం రాష్ట్రం ఇచ్చిన లెక్కలే కదా అని ప్రశ్నిస్తే.. ‘అవి కేంద్రం ధ్రువీకరించిన లెక్కలే’ అని పేర్కొన్నారు. యనమల అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తాను లేఖ రాస్తానని మంత్రి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని