Chandrababu: రాజకీయాలకు దూరంగా ఉంచాలనే వరుస కేసులు

తెదేపా ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక విధానం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందనే ఆరోపణతో తనపై సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబు హైకోర్టులో మంగళవారం పిటిషన్‌ వేశారు.

Updated : 08 Nov 2023 07:02 IST

ప్రభుత్వం ప్రతీకారానికి పాల్పడుతోంది
ముందస్తు బెయిలు మంజూరు చేయండి
‘ఇసుక’ కేసులో హైకోర్టులో చంద్రబాబు పిటిషన్‌

ఈనాడు, అమరావతి: తెదేపా ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక విధానం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందనే ఆరోపణతో తనపై సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబు హైకోర్టులో మంగళవారం పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యం హైకోర్టులో బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ కార్యకలాపాలకు తనను దూరంగా ఉంచాలని, న్యాయవిచారణ ప్రక్రియలో మునిగిపోయేలా చేయాలని, వేధించాలన్న ఏకైక ఉద్దేశంతో కేసు నమోదు చేశారని పిటిషన్లో చంద్రబాబు పేర్కొన్నారు. ‘వైకాపా పాలనలో ఇసుక అక్రమాలు, అవినీతిపై నేను, ఇతర ప్రతిపక్ష నేతలు గళమెత్తుతున్నాం. మా నోళ్లు మూయించాలనే కేసు పెట్టారు. మేం ప్రభుత్వ అక్రమాలపై గొంతెత్తుతున్న అంశాలను ముడిపెట్టి మాపైనే తప్పుడు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం ప్రతీకారానికి పాల్పడుతోంది’ అని పేర్కొన్నారు.

అధికార పార్టీ సూచనల మేరకే..

‘రాబోయే సార్వత్రిక ఎన్నికలు ముగిసేవరకూ నన్ను జ్యుడిషియల్‌ కస్టడీలో ఉంచాలని చూస్తోంది. అధికార పార్టీ చెప్పినట్లే సీఐడీ నడుస్తోంది. స్కిల్‌ కేసులో మధ్యంతర బెయిలు ఉత్తర్వులు ఉద్దేశం నెరవేరేవరకూ అరెస్టు చేయబోమని ఏజీ హామీ ఇచ్చారు. ఆ విషయాన్ని న్యాయస్థానం గత నెల 31న నమోదు చేసింది. మర్నాడే నాపై సీఐడీ ఇసుక కేసు పెట్టింది. దీన్నిబట్టి సీఐడీ దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందని అర్థమవుతోంది. అధికారిక విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలు, సిఫారసులపై ఆరోపణలు చేస్తున్నారు. కేసు నమోదుకు ముందు ‘సెక్షన్‌ 17-ఎ’ ప్రకారం గవర్నర్‌ నుంచి అనుమతి తీసుకోలేదు. ప్రస్తుతం ఇసుక కేసులోనూ అక్టోబరు 3న ప్రాథమిక విచారణ ప్రారంభించినా.. వివరాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నం చేయలేదు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిలు మంజూరు చేయండి’ అని చంద్రబాబు కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని