మాట తప్పడం ఈ సీఎంకు అలవాటే!

గోదావరి నది కోత వల్ల ఇళ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో గ్రోయిన్లు, రివిట్‌మెంట్ల నిర్మాణాల కోసం రూ.200 కోట్లు మంజూరు చేస్తాం.

Updated : 18 Nov 2023 09:53 IST

గోదావరి వరద ప్రాంతాల్లో గ్రోయిన్ల నిర్మాణానికి హామీ
రెండు నెలల్లోనే పనులు మొదలవుతాయంటూ బడాయి మాటలు
ఇప్పటికీ నిధుల మంజూరే లేదు
ఈనాడు - అమరావతి

గోదావరి నది కోత వల్ల ఇళ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో గ్రోయిన్లు, రివిట్‌మెంట్ల నిర్మాణాల కోసం రూ.200 కోట్లు మంజూరు చేస్తాం. అంచనాలు వేసి నెలరోజుల్లోపు టెండర్లు పూర్తి చేయాలి. ఆ తర్వాత నెల రోజుల్లో పనులు ప్రారంభించాలి. పనులు మొదలైన తర్వాత కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్యే పొన్నాడ వెంకటసతీష్‌కుమార్‌లు వాటి ఫొటోలు నాకు పంపాలి.

ఆగస్టు 8న ముఖ్యమంత్రి జగన్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో నది కోత వల్ల ఊళ్లు ఎలా దెబ్బతిన్నాయో పరిశీలించారు. తక్షణమే పనులు చేపడతామని  చెబుతూ ఈ హామీ ఇచ్చారు.

ఇంకా పాలనామోదమే దక్కలేదు

ముఖ్యమంత్రి జగన్‌ ఆగస్టు నెలలో ఈ హామీ ఇచ్చారు. నెల రోజుల్లో టెండర్లు పూర్తి చేస్తామని చెప్పారు. అంటే ఎంత లేదన్నా సెప్టెంబరు నెలాఖరుకు అవి పూర్తి కావాలి. ఆ తర్వాత నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి హోదాలో ప్రజల సమక్షంలో సెలవిచ్చారు. కనీసం అక్టోబరు నెలాఖరు కల్లా వాటిని ప్రారంభించి ఉండాలి. అలాంటిది ఇప్పటికీ ఆ పనులకు ప్రభుత్వం నుంచి పాలనామోదమే దక్కలేదు. ఇక టెండర్లు ఎక్కడ? పనులు ఎక్కడ?
ఒక నాయకుడు చెప్పిన మాటకు కట్టుబడి ఉండకపోతే ఇక ఆ మాటకు అర్ధం ఏముంటుంద’ని సాక్షాత్తూ సీఎం జగన్‌ అనేకసార్లు చెప్పారు. నోరు విప్పితే చాలు విశ్వసనీయత అంటూ రాగాలు తీస్తారు. మాట ఇస్తే తప్పకూడదనీ చెబుతుంటారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట తప్పితే.. ఆ పదవినైనా వదులుకోవాలి తప్ప మాటకు కట్టుబడి ఉండాలని బహిరంగంగా చెప్పిందీ ఆయనే. మరి పవిత్ర గోదావరి సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో పర్యటనకు వచ్చి.. కోనసీమ ప్రజలకు ఆయన ఇచ్చిన మాటను తప్పేశారు. ప్రజలతో చప్పట్లు కొట్టించుకునేందుకు ఆయన ఆ రోజు పడ్డ తాపత్రయంలో కొంతైనా మాట నిలబెట్టుకోవటంలో చూపించకపోవటమే విడ్డూరం.

గోదావరి వరదలకు కోనసీమ నదీ పరీవాహక ప్రాంతాలు తల్లడిల్లాయి. వరద నీరు ఊళ్లను ముంచెత్తి అనేక రోజుల పాటు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఆగస్టు 8న వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ముమ్మిడివరం మండలం గురజాపులంక, కూనలంక, ఠాణేలంక, అయినవిల్లి మండలం కొండుకుదురులంక ప్రాంతాల్లో నదీ కోత ప్రాంతాలను పరిశీలించారు. రక్షణగా గ్రోయిన్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరగా అక్కడికక్కడే ఆయన ఈ పనులకు రూ. 200 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కలెక్టర్‌ హిమాన్షుశుక్లా, జలవనరులశాఖ అధికారులు సైతం సమస్యను వివరించి పరిష్కార మార్గాలు తెలియజేశారు. నెల రోజుల్లోనే నిధులు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.


రూ.150 కోట్లతో ప్రతిపాదనలు...

ముఖ్యమంత్రి హామీ మేరకు ముమ్మిడివరం నియోజకవర్గంలోని అయిదు ప్రాంతాల్లో గ్రోయిన్ల నిర్మాణానికి రూ. 150 కోట్లతో జలవనరులశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. సీఎం చెప్పిన రెండు నెలలు గడిచిపోయినా ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు. జలవనరులశాఖ నుంచి ఈ ప్రతిపాదనలు ఆర్థికశాఖకు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. తొలుత ఈ పనులకు పాలనామోదం ఇవ్వాలి. ఆ తర్వాత టెండర్లు పిలవాలి. గుత్తేదారుతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి. ఆనక పనులు ప్రారంభించాలి. వీటి సంగతి అటుంచితే 2022 గోదావరి వరదల సమయంలో రాజోలు నియోజకవర్గంలోనూ సీఎం ఇలాంటి హామీలే ఇచ్చారు. రాజోలు మండలం మేకలవానిపాలెం, బూరుగులంక వద్ద కూడా గ్రోయిన్ల నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. ఇప్పటికీ అతీగతీ లేదు. అంతేకాదు ఎప్పుడో 2020లోనే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో వరద గట్ల రక్షణకు  ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి అనేక చోట్ల కరకట్టలు బలహీనంగా ఉన్నాయని తేల్చి చెప్పింది. ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టే నాధుడే కరువయ్యాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని