Tirumala: ఆర్భాటమే.. ఆచరణ ఎప్పుడు?

తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం కోసం బియ్యాన్ని సరాసరి మిల్లర్ల నుంచి కొంటామన్న తితిదే అధికారుల ప్రకటనలు ఆచరణకు నోచుకోవడం లేదు.

Updated : 19 Nov 2023 09:02 IST

తితిదేలో ప్రకటనలకే పరిమితమవుతున్న అన్నప్రసాద నాణ్యత పెంపు
మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలులో మీనమేషాలు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం కోసం బియ్యాన్ని సరాసరి మిల్లర్ల నుంచి కొంటామన్న తితిదే అధికారుల ప్రకటనలు ఆచరణకు నోచుకోవడం లేదు. అన్నప్రసాదాల నాణ్యతను పెంచాలని డయల్‌ యువర్‌ ఈవోలో భక్తుల నుంచి అనేక ఫిర్యాదులందాయి. ప్రస్తుతం టెండర్ల ద్వారా బియ్యాన్ని సేకరిస్తున్నారు. నాణ్యతను పెంచడానికి గతంలోలాగే మిల్లర్ల నుంచి బియ్యం కొంటామని అధికారులు ప్రకటించారు. ఆ మేరకు ఏపీ, తెలంగాణ మిల్లర్ల సంఘాలతోనూ చర్చించారు. వారు సమావేశమై ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. మరోవైపు ప్రసాదాల తయారీకి సలహాలనిచ్చేందుకు నిపుణులను నియమించుకోవాలని తితిదే భావించింది. క్యాటరింగ్‌ విభాగాన్ని పరిపాలన, అన్నప్రసాదాల తయారీ, పంపిణీ, పారిశుద్ధ్య, స్టోర్స్‌ నిర్వహణ విభాగాలుగా విభజించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దాదాపు 33 మంది కుక్‌లు, సర్వర్లు, ఇతర కుకింగ్‌ విభాగంలో నిపుణులను నియమించుకుంటామని ప్రణాళికను వెల్లడించింది. ఈ నియామకాలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.

మూడు హోటళ్ల అందుబాటులోనూ జాప్యం

తిరుమలలోని ప్రైవేటు హోటళ్లలో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ టూరిజం కార్పొరేషన్‌కు అన్నమయ్య భవన్‌, నారాయణగిరి హోటల్‌, జనతా హోటళ్లను కేటాయిస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఇవి అందుబాటులోకి వస్తే భక్తులకు తక్కువ ధరకు అన్నప్రసాదాలు అందుతాయని అప్పట్లో తెలిపింది. ఇది ప్రకటించి రెండు నెలలైనా కార్యాచరణ కనిపించడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని