AP HighCourt: ఎత్తు కొలుస్తాం.. తప్పయితే డబ్బులు కట్టిస్తాం..

ఎస్సై పోస్టుల భర్తీ వ్యవహారం హైకోర్టులో కొత్త మలుపు తిరిగింది. 2018నాటి ప్రకటన ప్రకారం ఎత్తు విషయంలో అర్హత సాధించిన తమను 2023 నోటిఫికేషన్లో అనర్హులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ వ్యాజ్యం దాఖలు చేసిన 24 మందికి హైకోర్టు పర్యవేక్షణలో, న్యాయస్థానం ప్రాంగణంలోనే ఎత్తు కొలతలు తీసేందుకు నిర్ణయించింది.

Updated : 25 Nov 2023 07:52 IST
కోర్టును ఆశ్రయించిన ఎస్సై అభ్యర్థులకు హైకోర్టు స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: ఎస్సై పోస్టుల భర్తీ వ్యవహారం హైకోర్టు(AP HighCourt)లో కొత్త మలుపు తిరిగింది. 2018నాటి ప్రకటన ప్రకారం ఎత్తు విషయంలో అర్హత సాధించిన తమను 2023 నోటిఫికేషన్లో అనర్హులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ వ్యాజ్యం దాఖలు చేసిన 24 మందికి హైకోర్టు పర్యవేక్షణలో, న్యాయస్థానం ప్రాంగణంలోనే ఎత్తు కొలతలు తీసేందుకు నిర్ణయించింది. ఎత్తు విషయంలో నియామక బోర్డు చెబుతున్న వివరాలు వాస్తవమని తేలితే ఒక్కో పిటిషనర్‌ ఖర్చుల కింద రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఎత్తు కొలతకు సిద్ధంగా ఉన్న పిటిషనర్ల వివరాలను కోర్టుకు ఇవ్వాలని వారి తరఫు న్యాయవాదికి సూచించింది. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జి. నరేంద్ర, జస్టిస్‌ న్యాపతి విజయ్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది.

ఎస్సై పోస్టుల భర్తీలో(2023 నోటిఫికేషన్‌) శారీరకదారుఢ్య పరీక్షల్లో భాగంగా డిజిటల్‌మెషీన్‌తో ఎత్తును కొలవడాన్ని సవాలు చేస్తూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మాన్యువల్‌ విధానంలో ఎత్తు కొలతను నిర్వహించిన అధికారులు.. పిటిషనర్లు అందరిని అనర్హులుగా పేర్కొన్నారు. దీంతో ఎ.దుర్గాప్రసాద్‌ మరో 23 మంది హైకోర్టులో తాజాగా పిటిషన్‌ వేశారు. ఈ నెల 17న విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి.. ఎస్సై ఎంపిక ఫలితాలు ప్రకటించొద్దని రాష్ట్రప్రభుత్వం, పోలీసు నియామక బోర్డును ఆదేశించారు. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ.. రాష్ట్రప్రభుత్వం, పోలీసు నియామక బోర్డు ధర్మాసనం ముందు అప్పీల్‌ వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని