Kakinada: ‘2024లో ఓటరంటే ఏంటో చూపిస్తాం’.. సీఎం జగన్‌పై విరుచుకుపడ్డ యువతి

కాకినాడకు చెందిన ఎస్సీ యువతి బొజ్జా ఐశ్యర్య సీఎం జగన్‌ పాలన తీరుపై విరుచుకుపడ్డారు. ఆమె విడుదల చేసిన వీడియో సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

Updated : 28 Nov 2023 07:42 IST

సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కాకినాడకు చెందిన ఎస్సీ యువతి బొజ్జా ఐశ్యర్య సీఎం జగన్‌ పాలన తీరుపై విరుచుకుపడ్డారు. ఆమె విడుదల చేసిన వీడియో సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఆమె ఏమన్నారంటే.. ‘వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో 2014లో వైకాపాకు ఓటేశా. 2019లో కాళ్లచిప్పలు అరిగేలా ప్రచారం చేశా. మా మద్దతుతో సీఎం అయ్యావ్‌. మా సొంత అన్నయ్య సీఎం అయ్యాడన్నంతగా ఆనందించాం. ఆ సీటు ఎక్కాక మాకు ఏం చేశావ్‌? పిల్లలకు పెట్టే ఆహారంనుంచి అన్నింటినీ కలుషితం చేశావ్‌. నీ వెనుక ఉన్న డప్పులబ్యాచ్‌ మాటే వింటున్నావ్‌. బ్రిటిష్‌ పాలన తెచ్చావ్‌. నువ్వు పెంచిన ఎంపీలు, ఎమ్మెల్యేలను చూసి మేమెందుకు భయపడాలి? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు స్వయం ఉపాధి రుణాలు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో ఎస్సీలకు కార్లు ఇచ్చారు. నీ పాలనలో వాటిని అమ్మేసుకున్నాం.

మా రోదన, వేదన వినిపించడం లేదా? 2024లో నీకు ఓటరంటే ఏంటో చూపిస్తాం. కంగారు పడకు. నీకున్న బలం, దొంగ ఓట్లు, డబ్బుతో నెగ్గినా నువ్వు దిగే వరకు నీ గేటు ముందు కూర్చుంటా. ఏం చేస్తావో చేసుకో. నన్ను చంపేసినా నీ ఇష్టం. అన్నింటికీ తెగించి ఉన్నా. నీ ఎమ్మెల్యేలు గడపగడపకు వెళుతున్నారు. అదే ప్రతి గడపకూ నేనూ వెళతా. జగన్‌ మాకు ఎందుకు వద్దో కరపత్రాలనిస్తా. ఇంతకంటే దారుణ పాలన చూడలేం. బైబిల్‌ ఎంత బలమైందో నీకు తెలుసు. దేవుడే నీకు సమాధానం చెబుతారు. జగన్‌కు మాత్రం ఓటేయొద్దు. తెదేపా, జనసేన, నోటా ఎవరికి ఓటేస్తారో వేయండి. ఇప్పుడు వ్యవస్థను అవినీతిమయం చేశారు. దీన్ని సరిచేయడానికి రెండేళ్లు పడుతుంది. 2024లో డౌన్‌డౌన్‌ జగన్‌..’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని