ఆయనో ‘భూ’చోడు

ఈ వ్యవహారాలన్నింటిలో ఆయన ఆరితేరారు. రూ.కోట్ల ఆర్జనకు భూదందాలనే ఎంచుకున్నారు. ఖాళీ స్థలమైనా.. వివాదంలో ఉన్న భూమైనా కనపడితే చాలు సెటిల్‌ చేసేసుకుంటారు. అంతేకాదు.. అవకాశమున్న అన్ని అక్రమ మార్గాల్లోనూ చేతివాటం చూపిస్తారు.

Updated : 28 Nov 2023 06:43 IST

వివాదాస్పద భూముల సెటిల్‌మెంట్లతో రూ.కోట్లలో సంపాదన
మట్కా, మద్యం, బెట్టింగుల్లోనూ చెయ్యి
కర్నూలు జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి దందా
ఈనాడు - అమరావతి

భూ కబ్జాలు.. దందాలు.. సెటిల్‌మెంట్లు..

ఈ వ్యవహారాలన్నింటిలో ఆయన ఆరితేరారు. రూ.కోట్ల ఆర్జనకు భూదందాలనే ఎంచుకున్నారు. ఖాళీ స్థలమైనా.. వివాదంలో ఉన్న భూమైనా కనపడితే చాలు సెటిల్‌ చేసేసుకుంటారు. అంతేకాదు.. అవకాశమున్న అన్ని అక్రమ మార్గాల్లోనూ చేతివాటం చూపిస్తారు. మాట వినని అధికారులను బదిలీ చేయిస్తారు. కర్నూలు జిల్లాలో వైకాపాకు చెందిన ఆ సీనియర్‌ ప్రజాప్రతినిధి హస్తం బెట్టింగ్‌, కర్ణాటక మద్యం, రేషన్‌ బియ్యం, పేకాట.. ఇలా అన్ని అక్రమాల్లోనూ ఉంటుంది. ఆయన వారసుడూ వీటిని అందుకున్నారు. సెటిల్‌మెంట్ల కోసం 20 మంది ప్రైవేటు ఏజెంట్లను నియమించుకుని మరీ దందా కొనసాగిస్తున్నారు.

సెటిల్‌మెంట్లతో రూ.కోట్ల ఆర్జన

పంచాయితీ చేశారంటే.. ఆ ఆస్తి ఆయనకో, అనుచరులకో రావాల్సిందే. ఇదే ఆయన ప్రధాన ఆదాయవనరు. రూ.కోట్ల విలువ చేసే భూములు సెటిల్‌ చేసి, తానే రాయించుకుంటారు. ఈ సెటిల్‌మెంట్లను తన దగ్గరకు తెచ్చేందుకు 20 మంది ఏజెంట్లను నియమించుకున్నారు. ఎక్కడ ఏ పంచాయితీ ఉన్నా ఈ సైన్యం వాలిపోతుంది. ఆదోని చుట్టుపక్కల సమస్యాత్మకంగా ఉన్న భూముల పంచాయితీలను వీరు తీసుకొస్తారు. ముందుగా ఆయన ప్రధాన అనుచరుడు తమ మనుషుల్లోని ఎస్సీలను బాధితుల వద్దకు పంపి ఆ భూమిని తమకే అమ్మేయాలని బెదిరిస్తారు. వారిపై బాధితులు తిరగబడితే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు బనాయిస్తామంటారు. చివరకు భూములు స్వాధీనం చేసుకుని, వెంచర్లు వేసి అమ్మేస్తున్నారు. బాధితులు స్టేషన్‌కు వెళ్తే.. పోలీసులే వారిని ఆ ప్రజాప్రతినిధి వద్దకు పంపుతున్నారు.

పంచాయతీ బోర్డు పీకేసి.. ప్లాట్లు వేసి..

ఆదోని శివారు మండిగిర పంచాయతీ తిరుమలనగర్‌లో ఒక వెంచర్‌లో పార్కు కోసం వదిలిన 72 సెంట్ల స్థలానికి పంచాయతీ భూమి అని గతంలోనే బోర్డు పెట్టారు. ఇప్పుడు దాన్ని తొలగించి, ప్లాట్లుగా మార్చి అమ్మకానికి సిద్ధం చేశారు వైకాపా నేతలు. ఇక్కడ సెంటు రూ.10-15 లక్షల వరకు పలుకుతోంది. సరాసరి రూ.8-10 కోట్ల విలువైన భూమి ఇది. దీనిపై స్థానికులు జేసీకి ఫిర్యాదు చేయగా, వారిని ఆ ముఖ్య ప్రజాప్రతినిధి తన ఇంటికి పిలిపించుకుని.. ‘ఆ భూమి మా వాళ్లదే. వాళ్లు కోర్టులో కేసు వేశారు. అవసరమైతే మీరూ కోర్టుకు వెళ్లండి’ అని హెచ్చరించినట్లు తెలిసింది.

క్రికెట్‌ బెట్టింగ్‌కు అండగా..

ఆదోని కేంద్రంగా పెద్దఎత్తున క్రికెట్‌ బెట్టింగ్‌ కొనసాగుతోంది. నిర్వాహకులకు ఆ ప్రజాప్రతినిధి అండ ఉంటోంది. గత మేలో జరిగిన ఐపీఎల్‌ సందర్భంగా పోలీసులు ఆరుగురు నిర్వాహకులను అరెస్టు చేసి రూ.80 లక్షల నగదు, ఒక స్కార్పియో, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో కీలక నిర్వాహకుడిని వదిలిపెట్టాలని ప్రజాప్రతినిధి చెప్పినా వినలేదని సీఐని వీఆర్‌లోకి పంపేశారు. ఇదే నిర్వాహకుడు ప్రపంచకప్‌పైనా బెట్టింగులు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతనిపై ఇప్పటి వరకూ 10కిపైగా కేసులున్నా ఆ ప్రజాప్రతినిధి వెంట పార్టీ కార్యక్రమాల్లో యథేచ్ఛగా పాల్గొంటున్నారు.

కర్ణాటక అక్రమ మద్యం

ఈ ప్రజాప్రతినిధి అనుచరుల్లో కొందరు కర్ణాటక అక్రమ మద్యం రవాణా, విక్రయాలు చేస్తారు. పోలీసులు నామమాత్రపు దాడులు నిర్వహిస్తున్నారు. ఎప్పుడైనా తన అనుచరులను పట్టుకుంటే వెంటనే వారిని విడిచిపెట్టాలని పోలీసులకు ఫోన్లు వెళ్తాయి.

వారసుడా.. వారెవ్వా!

రేషన్‌ బియ్యం రవాణాలో ఈ ప్రజాప్రతినిధి వారసుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఈ దందా నిర్వహణకు ఒక సిండికేట్‌ను ఏర్పాటు చేయించారు. ఆ సిండికేట్‌ బియ్యాన్ని కర్ణాటక వంటి ప్రాంతాలకు తరలిస్తోంది. అధికారులు ఎలాంటి ఆటంకం కలిగించకుండా ముందే చూసుకుంటున్నారు.


సాయం కోసం వస్తే ఆక్రమణ

ఆదోని శివారులోని 352 సర్వే నంబరులో దాదాపు 4.54 ఎకరాల్లో 1992లో ఇద్దరు వ్యక్తులు వెంచర్‌ వేసి, కొందరికి ప్లాట్లు కేటాయించారు. తర్వాత వీరు ఆ ప్లాట్లను డబుల్‌ రిజిస్ట్రేషన్లు చేయించారు. భూమి తమదేనంటూ 424 మంది బయటకొచ్చారు. పంచాయితీ ఆ ప్రజాప్రతినిధి వద్దకు చేరింది. బాధితులకు సెంటుకు రూ.లక్ష చొప్పున నామమాత్రపు ధర చెల్లించి లాక్కున్నారు. అదే భూమిని సెంటు రూ.8-10 లక్షల వరకు విక్రయిస్తున్నారు. మండిగిరి పంచాయతీలో ఓ మహిళకు చెందిన 70 సెంట్ల భూమిని ఆక్రమించుకొని వెంచర్‌ వేశారు. ప్రశ్నిస్తే ఆమె కుటుంబానికి నామమాత్రపు ధర చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.


మట్కా మామూళ్లు..

ఆదోనిలో దాదాపు 40 మంది మట్కా నిర్వాహకులు ఉన్నారని పోలీసుల అంచనా. ఒక్కొక్కరు రోజూ రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు ఆడిస్తున్నారు. ప్రతి నిర్వాహకుడి నుంచి నెలవారీ మామూళ్లు ప్రజాప్రతినిధి భార్యకు వెళ్తాయి.


అరగంటలో ఐపీఎస్‌ అధికారి బదిలీ

ఆదోని సబ్‌ డివిజన్‌ ఏఎస్పీగా అధిరాజ్‌సింగ్‌ రాణాను గత మేలో ప్రభుత్వం నియమించింది. ఆయన బాధ్యతలు చేపట్టిన అరగంటలోనే హెడ్‌క్వార్టర్‌కు బదిలీ చేశారు. డీఎస్పీ స్థానంలో ఐపీఎస్‌ అధికారి ఉంటే తమకు కష్టమని.. అప్పటికప్పుడు స్థానిక ప్రజాప్రతినిధి వైకాపా ముఖ్యనేతకు చెప్పి బదిలీ చేయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని