ఓటర్ల జాబితా బాధ్యతలు సచివాలయ సిబ్బందికా?

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ గెలుపు కోసం నిర్వహిస్తున్న ‘జగనే ఎందుకు కావాలంటే’ కార్యక్రమంలో ప్రభుత్వ వనరులతో పాటు, ప్రభుత్వ అధికారుల్ని, సిబ్బందిని వినియోగించడాన్ని ‘సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ)’ తీవ్రంగా తప్పుబట్టింది.

Updated : 28 Nov 2023 06:53 IST

‘జగనే ఎందుకు కావాలంటే’లో అధికారులు ఎలా పాల్గొంటారు?
గవర్నర్‌, ఈసీకి ‘సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ’ ఫిర్యాదు
ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ గెలుపు కోసం నిర్వహిస్తున్న ‘జగనే ఎందుకు కావాలంటే’ కార్యక్రమంలో ప్రభుత్వ వనరులతో పాటు, ప్రభుత్వ అధికారుల్ని, సిబ్బందిని వినియోగించడాన్ని ‘సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ)’ తీవ్రంగా తప్పుబట్టింది. దీనిపై గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు సీఎఫ్‌డీ ఇటీవల ఫిర్యాదు చేసింది. రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ‘‘ప్రభుత్వం వేరు. పార్టీ వేరు. పార్టీ కార్యక్రమాల్లో అధికారులు పాల్గొనడం అనైతికం, అధర్మం. ఒక రాజకీయ పార్టీకి ప్రయోజనం చేకూర్చేందుకు చేపట్టిన ఆ కార్యక్రమంలో ప్రభుత్వ సిబ్బందిని వినియోగించడం తీవ్రమైన అధికార దుర్వినియోగమే. వైకాపాకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ పథకాలకు ప్రచారం చేసేందుకు ఉద్దేశించిన ‘జగనే ఎందుకు కావాలంటే’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ల నుంచి వాలంటీర్ల వరకు అంతా అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులతో కలసి పాల్గొనడం దురదృష్టకరం. ఇది సివిల్‌ సర్వీస్‌ కోడ్‌కి విఘాతం కలిగించడమే. ప్రభుత్వ ఉద్యోగులు నిష్పాక్షికంగా, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి’’ అని సీఎఫ్‌డీ పేర్కొంది. ఈ మేరకు సీఎఫ్‌డీ అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ భవానీ ప్రసాద్‌, ఉపాధ్యక్షుడు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి టి.గోపాలరావు, సీఎఫ్‌డీ కార్యదర్శి, రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ గవర్నర్‌కు లేఖ రాశారు. దీంతో పాటు ఓటర్ల జాబితాల రూపకల్పనలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించడాన్ని తప్పుబడుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా సీఎఫ్‌డీ ఫిర్యాదు చేసింది.

వారికి ఓటర్ల జాబితాల బాధ్యతా?

రాష్ట్రంలో అధికార పార్టీకి పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తూ, రాజకీయరంగు పులుముకున్న వార్డు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఓటర్ల జాబితా రూపకల్పన వంటి బాధ్యతల్లో కొనసాగించడం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వైఫల్యంగా సీఎఫ్‌డీ అభిప్రాయపడింది. ఓటర్ల జాబితాలో గతంలో ఎన్నడూ లేనంతగా అవకతవకలు చోటు చేసుకోవడానికి, తప్పులు దొర్లడానికి ఈ ప్రక్రియలో సచివాలయ సిబ్బందిని వినియోగించడమే కారణమని పేర్కొంది. ‘గతంలో ప్రభుత్వ సిబ్బంది, ఉపాధ్యాయులు ఆ బాధ్యతలు నిర్వర్తించినప్పుడు ఇన్ని తప్పులు ఎప్పుడూ దొర్లలేదు. ఇప్పటికైనా ఎన్నికల జాబితాల బాధ్యతల నుంచి సచివాలయ సిబ్బందిని తొలగించి, ప్రభుత్వ సిబ్బంది, ఉపాధ్యాయులకు అప్పగించాలి. ఎన్నికల్ని స్వేచ్ఛగా సక్రమంగా నిర్వహించేందుకు కచ్చితత్వంతో కూడిన ఓటర్ల జాబితాలు అవసరం. అలాంటి ఓటర్ల జాబితాల రూపకల్పనలో సచివాలయ సిబ్బందిని వినియోగించినందుకు, గతంలో ఎన్నడూ లేనంతగా తప్పులు దొర్లడానికి పరోక్షంగా కేంద్ర ఎన్నికల సంఘం, ప్రత్యక్షంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బాధ్యత వహించాలి’’ అని పేర్కొంది.

తప్పులు సరిదిద్దకుండా జాబితా ఎలా?

ఎన్నికల జాబితాల్లో అనేక తప్పులు దొర్లాయని ఈ ఏడాది సెప్టెంబరు 8న రాసిన లేఖలో సీఈఓ స్వయంగా అంగీకరించారని సీఎఫ్‌డీ పేర్కొంది. వాటిలో కొన్ని తప్పుల్ని మాత్రమే సరిదిద్దారని తెలిపింది. సీఈఓ లేఖ ప్రకారం... ‘సున్న’ నంబరుతో ఉన్న ఇళ్లు 2,51,767 ఉంటే, వాటిలో 61,374 మాత్రమే సరిదిద్దారని, పది మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న ఇళ్లు 1,57,939గా నమోదైతే, వాటిలో 21,347 మాత్రమే సరిదిద్దారని పేర్కొంది. సీఈఓ స్వయంగా అంగీకరించిన తప్పుల్ని సరిదిద్దకుండా ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురించడం తీవ్ర అభ్యంతరకరమని, నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. ‘‘కొత్తగా ప్రవేశపెట్టిన సచివాలయాల్లో పనిచేస్తున్న అనుభవం, నిష్పాక్షికత కొరవడిన సిబ్బందిని ఓటర్ల జాబితాల రూపకల్పనలో భాగస్వాముల్ని చేయడం అనేక అనుమానాలకు, అభ్యంతరాలకు తావిస్తోంది. ఆ జాబితాల్లో దొర్లిన తప్పుల్ని సరిదిద్దే బాధ్యతను మళ్లీ వారికే అప్పగించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. ఎన్నికల సంఘం, సీఈఓ ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి’’ అని కోరారు.

అర్హులందరికీ ఓటు హక్కు పునరుద్ధరించాలి

రాష్ట్రంలో దురుద్దేశపూర్వకంగా ఫారం-7 దరఖాస్తులు పెట్టి ఓట్లు  తొలగించిన వారందరికీ ఓటు హక్కు పునరుద్ధరించాలని సీఎఫ్‌డీ డిమాండ్‌ చేసింది. అధికార పార్టీకి మేలు చేసేందుకు జరిగిన ఓట్ల తొలగింపు కుట్రలో సచివాలయ సిబ్బందిని బాధ్యులుగా పేర్కొంది. ఓట్లర్ల జాబితాలను సక్రమంగా, నిష్పాక్షికంగా రూపొందించాలని, తప్పులన్నీ వెంటనే సరిదిద్దాలని డిమాండ్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని