కడపలో ఉన్నాం.. వచ్చి ఓట్లు వేస్తాం!

ఈ ఇంటిని చూశారా... కింద దుకాణం ఉంది. ఒకటో అంతస్తులో నలుగురు సభ్యుల కుటుంబం నివసిస్తోంది. ఈ ఇంటి నంబరు 77-149-20తో ఓటరు జాబితాలో 51 ఓట్లున్నాయి. ఇంట్లోని వారివి తప్ప, మిగతా వాటిని తొలగించాలని కొందరు దరఖాస్తులు చేస్తే.. ఎట్టకేలకు 30 తొలగించారు.

Updated : 28 Nov 2023 06:42 IST

మా పేర్లను జాబితా నుంచి తొలగించవద్దు
బీఎల్వోలకు దొంగ ఓటర్ల విన్నపాలు
విజయవాడ సెంట్రల్‌లో విచిత్రం
15 వేల మంది మృతుల పేర్లు యథాతథం
ఈనాడు, అమరావతి

ఈ ఇంటిని చూశారా... కింద దుకాణం ఉంది. ఒకటో అంతస్తులో నలుగురు సభ్యుల కుటుంబం నివసిస్తోంది. ఈ ఇంటి నంబరు 77-149-20తో ఓటరు జాబితాలో 51 ఓట్లున్నాయి. ఇంట్లోని వారివి తప్ప, మిగతా వాటిని తొలగించాలని కొందరు దరఖాస్తులు చేస్తే.. ఎట్టకేలకు 30 తొలగించారు. మరో 21 ఓట్లు అలాగే ఉన్నాయి. జాబితాలో పేర్లున్న వారికి ఫోన్లు చేస్తే... ‘మేం కడపలో ఉన్నాం. మా ఓట్లు తీసేయకండి. ఎన్నికలప్పుడు వచ్చి ఓట్లేస్తాం’ అని బీఎల్వోలకు సమాధానం చెబుతున్నారు. దీంతో వారు వాటిని తొలగించలేదు. ఈ విచిత్రం విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం 63వ డివిజన్‌లో చోటుచేసుకుంది. దీనిపై నున్న పోలీసుస్టేషన్‌లో తెదేపా నాయకులు ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేదు. విచారణ చేయలేదు.

ఇలాంటి చిత్రవిచిత్రాలు నియోజవకర్గంలో చాలానే ఉన్నాయి. జాబితాల్లో ఓట్ల తొలగింపునకు సంబంధించి ఫోన్‌లు చేస్తే... ‘మేం కడపలో ఉన్నాం.. హైదరాబాద్‌లో ఉన్నాం.. ఖమ్మంలో ఉన్నాం అనీ... మా శాశ్వత చిరునామా విజయవాడే’ అని చెబుతున్నారంటూ బీఎల్వోలు వాపోతున్నారు. అంతేనా... తమ వారు ఎక్కడ ఉన్నా.. వారి ఓట్లను జాబితాలో అలాగే ఉంచుతున్నారు. తమవారు కాకపోతే... ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఓటు హక్కు కల్పించడం లేదు. దీనిపై పలుమార్లు ఎన్నికల అధికారి, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌కు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు.

ఎన్నెన్నో అభ్యంతరాలు... అనుమానాలు

నియోజకవర్గంలో ముసాయిదా జాబితా ప్రకటించాక అభ్యంతరాలు తెలుపుతూ భారీగా 26,458 దరఖాస్తులొచ్చాయి. 257 బూత్‌లు ఉంటే... కేవలం 98 బూత్‌ల పరిధిలోనే ఇన్ని దరఖాస్తులు రావడం గమనార్హం. మార్పుల కోసమూ 49,195 దరఖాస్తులు అందాయి. మిగిలిన బూత్‌లలో డిసెంబరు 3, 4 తేదీల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. విజయవాడ మధ్య నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి బొండా ఉమా కేవలం 25 ఓట్లతో ఓడిపోయారు. ఈసారి పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది. దీంతో జాబితా సవరణల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • మధురానగర్‌ 162 పోలింగ్‌ బూత్‌ పరిధిలో ఇంటింటి సర్వే జరగనేలేదు. ఇక్కడ 35 మంది మృతుల ఓట్లు, 29వ డివిజనులోని పది పోలింగ్‌ బూత్‌ల పరిధిలో 305 మంది మృతుల పేర్లు జాబితాలో యథాతథంగా ఉన్నాయి. మొత్తం నియోజకవర్గంలో 15 వేల మంది మృతుల పేర్లు ఉన్నాయి.
  • 162వ పోలింగ్‌ బూత్‌ పరిధిలో వి.వెంకటేశ్వరరావు అనే వ్యక్తి రెండేళ్ల కిందట చనిపోయారు. ఆయన తనయుడు తన తండ్రి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ముసాయిదాలో వెంకటేశ్వరరావు పేరు తొలగించకపోగా.. ఆయన తనయుడు, భార్య పేర్లతో రెండేసి చోట్ల (సీరియల్‌ నంబర్లు 180, 173, 177, 174) ఓటు హక్కు కల్పించారు. దీనిపై డబుల్‌ ఎంట్రీ కింద ఫిర్యాదు చేసినా చర్యల్లేవు.
  • వైకాపా కార్పొరేటర్‌ ఆలంపూర్‌ విజయలక్ష్మికి వేర్వేరు పోలింగ్‌ బూత్‌లలో రెండు ఓట్లున్నాయి. ఇలా రెండేసి ఓట్లు దాదాపు 4,232 ఉన్నట్లు గుర్తించారు.
  • సింగ్‌నగర్‌, న్యూరాజరాజేశ్వరి పేట, జేఎన్‌యూఆర్‌ఎం కాలనీల్లో వందల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆరోపణలున్నాయి. 

ప్రతిపక్ష సానుభూతి పరులంటూ...

58వ డివిజన్‌ తోటవారి వీధిలోని రెండు అపార్టుమెంట్లలో 18 ఏళ్ల వయసు దాటిన వారు 178 మంది ఉన్నారు. ఓటు హక్కు కోసం రెండుసార్లు దరఖాస్తులు చేసినా వారికి జాబితాలో స్థానం దక్కలేదు. మూడోసారి దరఖాస్తులిచ్చారు. ఇక్కడ తెదేపా సానుభూతిపరులు ఉన్నారనే కారణంతో ఓట్లు ఇవ్వడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో కృష్ణా ఒడ్డున నివసించే 714 మంది 59వ డివిజన్‌ రామానగర్‌లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వీరిలో కొందరు తమ ఓట్లను సెంట్రల్‌ నియోజకవర్గానికి మార్చాలని, మరికొందరు కొత్తగా ఓటు హక్కు ఇవ్వాలని దరఖాస్తు చేసినా ఫలితం శూన్యం.

మార్పులు చేర్పులు నిరంతర ప్రక్రియ...

నియోజకవర్గ ఎన్నికల అధికారి, వీఎంసీ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ను సంప్రదించగా.. జాబితాలో మార్పులు, చేర్పులు నిరంతరం కొనసాగుతాయన్నారు. బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి పరిశీలన చేశారని చెప్పారు. చెట్టుకు ఓటున్నట్లు జాబితాలో పొరపాటున ముద్రితమైందని, దాన్ని తొలగించేందుకు నోటీసు జారీ చేసినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని