అనగనగా అవుకు.. పూర్తికాకుండానే టముకు

అనగనగా అదొక అవుకు టన్నెల్‌. గాలేరు నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా కొండలను తొలచి నిర్మిస్తున్నారు. ఎప్పుడో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒక టన్నెల్‌ను తవ్వి (రెండు చిన్న డైవర్షన్‌ ఛానళ్లతో) 10వేల క్యూసెక్కుల నీటిని గండికోట జలాశయానికి తరలించేలా నిర్మించారు.

Published : 29 Nov 2023 06:15 IST

లైనింగు పనులు కాకుండానే మమ
ఎన్నికలొస్తున్నాయని ప్రారంభించేస్తున్న జగన్‌
రూ.30 కోట్ల పనులు పెండింగ్‌
నీళ్లు వదిలి.. ఫొటోలతో సరి
అవుకు ప్రాజెక్టు కథ ఈ ఏడాదికి అంతే

నగనగా అదొక అవుకు టన్నెల్‌. గాలేరు నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా కొండలను తొలచి నిర్మిస్తున్నారు. ఎప్పుడో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒక టన్నెల్‌ను తవ్వి (రెండు చిన్న డైవర్షన్‌ ఛానళ్లతో) 10వేల క్యూసెక్కుల నీటిని గండికోట జలాశయానికి తరలించేలా నిర్మించారు. 2018-19లోనే నీటిని మళ్లించారు. మరో టన్నెల్‌ పనులు సాగుతుండగానే ఎన్నికలు వచ్చాయి.కర్నూలు, కడప జిల్లాల్లో  జగన్‌ తిరుగుతూ తానే ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే అవుకు ప్రాజెక్టును ఎప్పుడో పూర్తి చేసేవాడినని, రాయలసీమ కరవు జిల్లాలు ఆ 20 వేల క్యూసెక్కుల నీటితో సస్యశ్యామలం అయ్యేవని చెప్పారు. తానైతే కరవు సీమను పచ్చని సీమగా మార్చేసేవాడినని ఎన్నికల ముందు జనాన్ని నమ్మించారు. అధికారంలోకి వస్తూనే జలవనరులశాఖ అధికారులతో సమీక్షించారు. 2020-21లో పూర్తి చేసేసే ప్రాజెక్టుల్లో అవుకును చేర్చారు. 2021 మార్చి నాటికల్లా అవుకు టన్నెళ్ల తవ్వకాలు పూర్తి చేసి 20 వేల క్యూసెక్కులు మళ్లించేస్తామని అధికారులు చెప్పారు. ఒక ఏడాదిలోనే ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. అలా మాటలు చెప్పి నాలుగున్నరేళ్లు అయ్యాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికైనా అవుకు టన్నెల్‌ పనులు పూర్తయ్యాయా అంటే లేదు అనే చెప్పాలి.

వెయ్యి మీటర్ల లైనింగ్‌ పనులు పూర్తి కాలేదు

అధికారులు 150 మీటర్ల వరకు లైనింగు పనులు పూర్తి చేయాలని అంటున్నారు. వాస్తవానికి దాదాపు వెయ్యి మీటర్ల మేర ఇంకా లైనింగు పూర్తి చేయనేలేదు. లోపల టన్నెల్‌లోకి వెళ్లి చూస్తాం అని పత్రికా ప్రతినిధులు అడిగితే కుదరదంటే కుదరదంటున్నారు. నీళ్లు మళ్లిస్తాం కదా అప్పుడు ఫొటోలు తీసుకోవచ్చని చెబుతున్నారు. తానే సీఎంగా ఉంటే సీమకు నీళ్లు ఇచ్చి పచ్చగా మార్చేసేవాడినని చెప్పిన జగన్‌ ఇప్పుడు ఉన్న ఆయకట్టును ఎండబెట్టి మరీ అవుకులో నీళ్లు పారించేందుకు తంటాలు పడుతున్నారు. ముఖ్యమంత్రి అవుకు రెండో టన్నెల్‌ను బుధవారం ప్రారంభించబోతున్నారు. గోరకల్లు నుంచి 20వేల క్యూసెక్కులు రెండు టన్నెళ్ల ద్వారా మళ్లిస్తారు. ఆ నీళ్లు అవుకు జలాశయానికి చేరతాయి. ఆ ఫొటోలు తీసి టన్నెల్‌ తవ్వాం, ప్రారంభించాం అని చెప్పబోతున్నారు. ఆ తరవాత నీళ్లు బంద్‌.. ఈ సీజన్‌కు ఇక ఇంతే. మళ్లీ పెండింగ్‌లో ఉన్న లైనింగు పనులు చేసుకోవడమే. అవుకు టన్నెల్‌ అయ్యిందా అంటే అయ్యింది. మరి నీటిని నిరంతరం పారిస్తారా అంటే వచ్చే వర్షాకాలం తర్వాతే ఆ విషయంపై ఆలోచిస్తారు. అంటే ప్రస్తుతానికి అవుకు అయిపోయిందని చెప్పి ఎన్నికల ప్రచారం చేసుకుంటారు.


ఏమిటీ అవుకు టన్నెల్‌?

  • శ్రీశైలం జలాలు ఎస్‌ఆర్‌బీసీ ద్వారా గోరకల్లు జలాశయానికి చేరతాయి. గోరకల్లు మొత్తం నీటి నిల్వ 12 టీఎంసీలు. గోరకల్లు నుంచి గాలేరు నగరి వరద కాలువ తవ్వి అవుకు టన్నెల్‌కు అక్కడి నుంచి గండికోట జలాశయానికి నీళ్లు తీసుకువెళ్లే ప్రణాళికలో భాగంగా ఎప్పుడో పనులు ప్రారంభించారు.

  • ఇందులో భాగంగానే అవుకు వద్ద టన్నెళ్ల తవ్వకం అవసరమైంది. చంద్రబాబు సీఎంగా ఉన్న తొలినాళ్లలో ఈ టన్నెళ్ల ప్రతిపాదనలు చేశారు. వైఎస్‌ హయాంలో 2008లో పనులు ప్రారంభమయ్యాయి. 2009లో ఆగిపోయాయి.

  • మళ్లీ 2014లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. రూ. 401 కోట్లతో ఎన్‌.సి.సి., మైటాస్‌ సంస్థలు పనులు చేపట్టాయి. 12 మీటర్ల ఎత్తు, 12 మీటర్ల వెడల్పున 5.6 కిలోమీటర్ల మేర రెండు సొరంగాలు తవ్వాలన్నది ప్రణాళిక.

  • ఒక సొరంగం తవ్వుతుండగా 280 మీటర్లకు పైగా ఫాల్ట్‌ జోన్‌ రావడంతో అక్కడ ఇక పనులు చేసే పరిస్థితి లేక ఆ సొరంగం పనులు నిలిపివేశారు. రెండో దాంట్లోనూ ఫాల్ట్‌ జోన్‌ రావడంతో ఆ సొరంగం ప్రణాళికలు మార్చారు. అందులోనే రెండు చిన్న సొరంగాలుగా మార్చి ఒక్కోదాంట్లో 10 వేల క్యూసెక్కులు మళ్లించేలా ప్రణాళిక రూపొందించారు.

  • 2018-19లో ఒక సొరంగం పూర్తి చేసి 10 వేల క్యూసెక్కులు పంపించారు. రెండో సొరంగంలో 180 మీటర్ల ఫాల్ట్‌ జోన్‌, లైనింగు పని మాత్రమే మిగిలిపోయింది.

జగన్‌ అధికారంలోకి రాగానే పని ఆపేశారు. పాత గుత్తేదారుడి పని రద్దు చేశారు. కొత్తగా టెండర్లు పిలిచారు. రివర్స్‌ టెండర్ల పేరుతో మ్యాక్స్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థకు మిగిలిన పనిని రూ. 108 కోట్లతో అప్పచెప్పారు. నిధులు సకాలంలో ఇవ్వక పనులు ఆలస్యమయ్యాయి. ఇప్పటికీ లైనింగు పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. హడావుడిగా రిబ్బను కత్తిరించేందుకు సిద్ధమయ్యారు.


  • అవుకు టన్నెల్‌లో ఇంకా రూ. 30 కోట్ల విలువైన పనులు పెండింగ్‌లో ఉన్నాయి. రూ. 24 కోట్ల వరకు బిల్లులూ పెండింగ్‌లో పెట్టారు.

ఈనాడు,అమరావతి, - న్యూస్‌టుడే,అవుకు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని