ప్రతి గ్రామానికీ నాణ్యమైన విద్యుత్‌

ప్రతి గ్రామానికి, రైతుకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేలా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

Published : 29 Nov 2023 06:14 IST

ఆ దిశగా మౌలిక వసతులు కల్పిస్తున్నాం
వర్చువల్‌గా 12 సబ్‌స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్‌
850 మెగావాట్ల సౌర ప్రాజెక్టులు.. 16 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన

 ఈనాడు, అమరావతి: ప్రతి గ్రామానికి, రైతుకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేలా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. 14 జిల్లాల్లో విద్యుత్‌ పంపిణీ సామర్థ్యాన్ని పెంచడానికి నిర్మిస్తున్న 28 సబ్‌స్టేషన్లలో కొన్నింటిని వర్చువల్‌గా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంనుంచి మంగళవారం ఆయన ప్రారంభించారు. కడపలో 750 మెగావాట్లు, అనంతపురంలో వంద మెగావాట్ల సామర్థ్యమున్న సౌర విద్యుత్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ‘28 సబ్‌స్టేషన్ల కోసం రూ.3,099 కోట్లు వెచ్చిస్తున్నాం. వాటిలో కొన్నింటిని ప్రారంభించాం. మరికొన్నింటి పనులు ప్రారంభిస్తున్నాం. వాటి వల్ల గోదావరి ముంపు మండలాలు చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, ఎటపాకలలో విద్యుత్‌ సమస్యలు పరిష్కారమవుతాయి. శంకుస్థాపన చేసిన 850 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ద్వారా సుమారు రూ.6,500 కోట్ల పెట్టుబడులతోపాటు 1700 మందికి ఉపాధి లభిస్తుంది.

మరో రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను హెచ్‌పీసీఎల్‌తో కుదుర్చుకున్నాం. 500 మెగావాట్ల చొప్పున సౌర, పవన విద్యుత్‌ ప్లాంట్లతోపాటు 250 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు, గ్రీన్‌హైడ్రోజన్‌ ప్లాంటు (100 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజి సిస్టం) ఏర్పాటుచేసేలా ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం’ అని సీఎం తెలిపారు. అవేరా స్కూటర్స్‌ తయారీ సంస్థ రూ.100 కోట్ల విస్తరణ ప్రాజెక్టుకూ సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల కోసం పెండింగులో ఉన్న 1.25 లక్షల దరఖాస్తులను నిర్దేశిత వ్యవధిలో పరిష్కరించామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. విద్యుత్‌ కనెక్షన్ల కోసం రైతులు దరఖాస్తు చేసిన వెంటనే అందిస్తున్నామన్నారు. సబ్‌స్టేషన్లను సీఎం ప్రారంభించాక మంత్రి మాట్లాడుతూ.. ‘స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు వల్ల ప్రభుత్వం ఇచ్చే లబ్ధి తెలుసుకునే వీలుంటుంది. ఈ ఏడాది అక్టోబరు వరకు టారిఫ్‌ సబ్సిడీ కింద రూ.46,581 కోట్లు అందించాం. 39.64 లక్షల మందికి లబ్ధి చేకూరింది’ అని మంత్రి తెలిపారు.

ఎంఎస్‌ఈ-సీడీపీ ప్రాజెక్టులను ప్రారంభించనున్న సీఎం

కేంద్ర ప్రభుత్వ నిధులతో సూక్ష్మ, చిన్న పరిశ్రమల క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఎంఎస్‌ఈ-సీడీపీ) కింద నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టులను సీఎం జగన్‌ బుధవారం వర్చువల్‌గా ప్రారంభిస్తారని ఏపీఐఐసీ వీసీఎండీ ప్రవీణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.286 కోట్లతో 21 ప్రాజెక్టులను ప్రారంభించగా కొన్నింటి నిర్మాణం పూర్తయిందని.. మిగిలిన వాటికి సీఎం శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. ఆగ్రో, ఆహారశుద్ధి, టెక్స్‌టైల్స్‌, కెమికల్స్‌, పెట్రోకెమికల్స్‌, ఆటోమొబైల్‌, ప్లాస్టిక్‌, ఫర్నిచర్‌, సేవా రంగాలకు సంబంధించి 18 జిల్లాలో ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇదే పథకం కింద 28 కొత్త ప్రాజెక్టులకు సంబంధించి రూ.355 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలను పంపినట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో రెండు ఎంఎస్‌ఈ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు