అడిగేదెవరని.. అడ్డే లేదని!

ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఉపకులపతి(వీసీ)గా ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి తన పదవీకాలంలో ఏపీ విశ్వవిద్యాలయాల చట్టం, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా పలు నియామకాలు చేపట్టారని ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అలుమ్ని అసోసియేషన్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.

Updated : 29 Nov 2023 06:42 IST

అధికారం మాటున.. ఉల్లంఘనలు ఎన్నో!
ఏయూ పూర్వ వీసీ ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నియామకాలపై హైకోర్టులో వ్యాజ్యం

 ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఉపకులపతి(వీసీ)గా ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి తన పదవీకాలంలో ఏపీ విశ్వవిద్యాలయాల చట్టం, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా పలు నియామకాలు చేపట్టారని ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అలుమ్ని అసోసియేషన్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఇది బుధవారం విచారణకు రానుంది. అలాగే ఆయా వివరాలతో కూడిన వినతిపత్రాన్ని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు కూడా సంఘం ప్రతినిధులు పంపారు. ఆయన తీసుకున్న అడ్డగోలు నిర్ణయాల వల్ల పలువురు సీనియర్‌ ఆచార్యులు తమ అవకాశాలు కోల్పోయారని అసోసియేషన్‌ ఆరోపించింది. ప్రసాదరెడ్డిపై లోకాయుక్త లేదా హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించేలా రాష్ట్ర ప్రభుతాన్ని ఆదేశించాలని ఆ వినతిపత్రంలో కోరారు. వీసీగా ప్రసాదరెడ్డి పదవీ కాలం ఈ నెల 24న ముగిసింది. నాలుగేళ్ల తన పదవీకాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు అనేకం వివాదాస్పదమయ్యాయి.

వినతిలో పేర్కొన్న అంశాలివే.: ప్రైవేటు కళాశాలలో పనిచేసిన జేమ్స్‌ స్టీఫెన్‌కు అర్హత లేకున్నా అంబేడ్కర్‌ అధ్యయన కేంద్రం ఛైర్‌ ప్రొఫెసర్‌గా తాత్కాలిక నియామకం పేరుతో వర్సిటీలో స్థానం కల్పించారు. కొద్దిరోజులకే ట్రాన్స్‌ డిసిప్లినరీ రీసెర్చ్‌ (టీడీఆర్‌) హబ్‌ డీన్‌గానూ బాధ్యతలు అప్పగించారు. వర్సిటీలో కనీసం రెండేళ్ల ప్రొబేషన్‌ పూర్తి కాకుండానే సీనియర్‌ ఆచార్యులను పక్కనపెట్టి సెప్టెంబరులో ఆయనకు రిజిస్ట్రార్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

మూడు సార్లు పొడిగింపు: రిజిస్ట్రార్‌గా పనిచేసిన ప్రొఫెసర్‌ వి.కృష్ణమోహన్‌ 2020 ఆగస్టు 31న విశ్వవిద్యాలయ సేవల నుంచి విరమణ పొందారు. ఆయనను రిజిస్ట్రార్‌ పదవిలో కొనసాగించాలని ప్రసాదరెడ్డి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖలు రాశారు. విద్యా సంబంధిత కార్యకలాపాల్లో ఆయన అనుభవం వర్సిటీకి అవసరమని చెప్పడంతో మూడుసార్లు పదవీకాలం పొడిగించారు. మూడోసారి పొడిగించిన పదవీ కాలం కూడా సెప్టెంబరులో ముగియగా అక్టోబరులో ఓఎస్‌డీగా నియమించారు.

ఎలాంటి ప్రకటనా లేకుండా: విద్యాసంస్థలు, పరిశ్రమలకు అనుబంధం ఏర్పరిచేందుకు అడ్జంక్ట్‌ ప్రొఫెసర్లను నియమించాలని యూజీసీ సూచించింది. దీనిని ఆసరాగా చేసుకొని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు చెందిన వారిని ఏయూలో అనుబంధ ఆచార్యులుగా నియమించారు. ఇందుకు దరఖాస్తులు కూడా ఆహ్వానించలేదు. 2021 నుంచి 2023 వరకూ మొత్తం 45 మందిని వివిధ విభాగాల్లో నియమించారు. ముందస్తు అనుమతి లేకుండా ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు చేపట్టరాదని 2021లో ప్రభుత్వం ఆదేశించినా పట్టించుకోకుండా 15 మంది సహాయ ఆచార్యులను నియమించారు.

ఆరోపణలు రుజువైనా: ప్రసాదరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ప్రొఫెసర్‌ రాజేంద్ర కర్మాకర్‌ను ఆర్ట్స్‌, కామర్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా ఎంపికచేశారు. ఆయన రాజేంద్ర కాకినాడలోని ఏయూ పీజీ సెంటర్‌లో పనిచేసే సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా అధ్యాపకురాలు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన తీరుపై పలువురు ఉపాధ్యాయులు వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆరోపణలు రుజువు కావడంతో భవిష్యత్తులో ఆయనకు పరిపాలనాపరమైన ఏ పదవి అప్పగించరాదని ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ తేల్చిచెప్పింది. వీటన్నింటినీ పట్టించుకోకుండా 2020-2022 సమయానికి ప్రిన్సిపల్‌గా, ఆ తర్వాత ఆనరరీ ప్రొఫెసర్‌గా నియమించారు.

కోర్టు ఆదేశించినా: ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల అధ్యాపకులను విశ్వవిద్యాలయాలకు కేటాయించడంపై హైకోర్టు స్టే విధించింది. ప్రసాదరెడ్డి, అప్పటి రిజిస్ట్రార్‌ వి.కృష్ణమోహన్‌ 113 డిగ్రీ కళాశాలల అధ్యాపకులను వివిధ విభాగాల్లో నియమించారు. దీనిపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు కాగా.. వారిని వెనక్కి పంపాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశించారు. ప్రభుత్వం సైతం పాత ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. 73 కళాశాలల అధ్యాపకులు వెనక్కి వెళ్లగా, 40 కళాశాలలకు చెందిన లెక్చరర్లు ఇప్పటికీ వర్సిటీలో కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని