మేమే ఉద్యోగాలిచ్చాం... చెప్పినట్టు చేయాల్సిందే

ఎన్నికల సంఘం తరఫున క్షేత్రస్థాయిలో పనిచేసే తొలి ప్రతినిధి బూత్‌ స్థాయి అధికారే (బీఎల్వో). ఓటర్ల జాబితా తయారీ, సవరణ ప్రక్రియ వీరివద్దే మొదలవుతుంది.

Updated : 29 Nov 2023 06:40 IST

బీఎల్వో బాధ్యతల్లో ఉన్న సచివాలయాల ఉద్యోగులపై వైకాపా నాయకుల అజమాయిషీ
ఓటర్ల జాబితాలను మార్చేయాలంటూ తీవ్ర ఒత్తిడి
ఆ పర్యవసానమే అక్రమాలు, అవకతవకలు

ఈనాడు, అమరావతి: ఎన్నికల సంఘం తరఫున క్షేత్రస్థాయిలో పనిచేసే తొలి ప్రతినిధి బూత్‌ స్థాయి అధికారే (బీఎల్వో). ఓటర్ల జాబితా తయారీ, సవరణ ప్రక్రియ వీరివద్దే మొదలవుతుంది. అయితే ఈ సారి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులే బీఎల్వోలుగా ఉండటంతో.. వారిపై వైకాపా నాయకులు అజమాయిషీ చలాయిస్తున్నారు. తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. ‘‘మీకు మా పార్టీయే ఉద్యోగాలిచ్చింది. మేం చెప్పినట్టుగా, మాకు నచ్చినట్టుగా ఓటరు జాబితాలు తయారవ్వాల్సిందే. లేదంటే తర్వాత పర్యవసానాలు మరోలా ఉంటాయి’’ అని హెచ్చరిస్తున్నారు. చిరుద్యోగులైన వీరు.. ఈ బెదిరింపులను తట్టుకోలేకపోతున్నారు. పర్యవసానంగా రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితాలు.. వైకాపా జాబితాల్లా మారిపోతున్నాయి. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, సానుభూతిపరులు, తటస్థుల ఓట్ల తొలగింపు, వైకాపాకు అనుకూలంగా భారీగా బోగస్‌ ఓట్ల చేర్పు ఉద్ధృతంగా సాగుతోంది.

సరిదిద్దుకోలేని ఘోర తప్పిదం

ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలను బీఎల్వోలుగా నియమించే విధానం మొదట నుంచి కొనసాగుతోంది. ఎన్నికల సంఘం ఈ సారి దానికి ఎందుకు తూట్లు పొడిచింది? సచివాలయాల ఉద్యోగుల్ని బీఎల్వోలుగా నియమించొద్దని వివిధ ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను ఎందుకు బేఖాతరు చేసింది? ఓటర్ల జాబితా తయారీ, సవరణ ప్రక్రియ లాంటి కీలక బాధ్యతల్ని అనుభవం లేనివారి చేతుల్లో పెట్టడమేంటి? ఈ వైఫల్యం ఎన్నికల సంఘానిది కాదా? ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు బీఎల్వోలుగా వ్యవహరించినప్పుడు వారిపై అధికారపార్టీ నాయకులకు పెద్దగా అజమాయిషీ ఉండేది కాదు. ఈ సారి 46వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాలకు గాను సుమారు 40వేల కేంద్రాల బీఎల్వోలుగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్ని ఎన్నికల సంఘం నియమించింది. సరిదిద్దుకోలేని ఘోర తప్పిదానికి ఇక్కడే బీజం వేసింది. సచివాలయాల ఉద్యోగులకు ఎన్నికల విధులు కొత్త. దీంతో వైకాపా నాయకుల వారిపై స్వారీ చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు బీఎల్వోలు వారి ఒత్తిళ్లకు తలొగ్గుతుండగా... మరికొందరు నిరాకరిస్తున్నారు.

 ‘‘రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో గతంలో ఎన్నడూ లేనంతగా అవకతవకలు చోటుచేసుకోవడానికి, తప్పులు దొర్లడానికి ఈ ప్రక్రియలో సచివాలయాల సిబ్బందిని వినియోగించడమే కారణం. ఇది రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వైఫల్యం. దీనికి పరోక్షంగా కేంద్ర ఎన్నికల సంఘం, ప్రత్యక్షంగా సీఈఓ బాధ్యత వహించాలి’’ అని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) ఇటీవల రాష్ట్ర గవర్నర్‌కు, కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని ఓటర్ల జాబితాల తయారీలో భాగస్వాముల్ని చేయటం, దొర్లిన తప్పులు సరిదిద్దే బాధ్యతను మళ్లీ వారికే అప్పగించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ఆ ఫిర్యాదుల్లో వివరించింది.

ముందు నుయ్యి... వెనక గొయ్యి

‘‘అధికారపార్టీ నాయకులు చెప్పినట్టల్లా చేస్తే జాబితాలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం మమ్మల్ని బలిచేస్తోంది. వైకాపా నాయకులు చెప్పినట్టు వినకపోతే వారినుంచి రోజూ బెదిరింపులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ ఉద్యోగంలోకి ఎందుకు వచ్చామా అనిపిస్తోంది. మా పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్నట్లుగా మారింది’’ అని శ్రీకాకుళం జిల్లాలో బీఎల్వో బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ గ్రామ సచివాలయ ఉద్యోగి వాపోయారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెదేపా మద్దతుదారుల ఓట్లు తొలగించాలంటూ బీఎల్వోగా వ్యవహరిస్తున్న ఓ వార్డు సచివాలయ ఉద్యోగిపై వైకాపా నాయకులు ఇటీవల తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. అందుకు అంగీకరించకపోవడంతో ఘర్షణకు దిగి బెదిరించారు. బీఎల్వోలపై అధికార పార్టీ నాయకులు ఏ స్థాయిలో పెత్తనం చేస్తున్నారో చెప్పేందుకు ఇదో తార్కాణం మాత్రమే.

ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చర్యలు తప్పవు

పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు కోసం వచ్చిన ఫారం-7 దరఖాస్తులు, వాటి పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు స్థానిక ఎస్సైలు, సీఐలకు వాట్సప్‌ గ్రూపుల్లో పంపించిన బీఎల్వోలపై ఎన్నికల సంఘం ఇటీవల క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. వీరిలో ఎక్కువమంది మహిళా పోలీసులే. ఎన్నికల విధుల్లో అక్రమాలకు పాల్పడితే.. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 32 ప్రకారం తీవ్ర చర్యలు తప్పవు. అందుకే ఎవరెన్ని చెప్పినా నిబంధనల ప్రకారమే వ్యవహరించాల్సిన బాధ్యత బీఎల్వోలపై ఉంది. మరోవైపు వారిపై ఒత్తిడి తీసుకొస్తూ తప్పులు చేయిస్తున్న అధికారపార్టీ నాయకులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోవటం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి.


ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియలోకి వైకాపా నాయకుల చొరబాటు

ఓటర్ల జాబితా తయారీ విధుల్లో ఉన్నంత కాలం బీఎల్వోలు ఎన్నికల సంఘంలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నట్లే లెక్క. వారిపై పూర్తి అజమాయిషీ, నియంత్రణ ఎన్నికల సంఘానిదే. క్షేత్రస్థాయిలో వాస్తవ సమాచార సేకరణ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ, ఇంటింటి పరిశీలన, వలస వెళ్లిన, మృతిచెందిన, ఉనికిలో లేని ఓటర్ల గుర్తింపు, ఓటర్ల చేర్పులు, తొలగింపుల్లో తప్పిదాల గుర్తింపు తదితర విధులు బీఎల్వోలు చేపట్టాలి. వీటి నివేదికలను ఈఆర్‌ఓలకు సమర్పించాలి. ఇలా వీరి పాత్ర కీలకం కావడంతోనే ఈ ప్రక్రియలో వైకాపా నాయకులు చొరబడుతున్నారు. బీఎల్వోలపై సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించి తాము చెప్పినట్లు చేయాలని ఆదేశిస్తున్నారు. వైకాపాకు ఓటేసేవారు, వేయనివారు ఎవరనేది వాలంటీర్ల ద్వారా గుర్తించి.. వ్యతిరేకుల ఓట్లు తొలగిస్తూ.. తమకు అనుకూలంగా భారీగా నకిలీ ఓట్లు చేర్పించుకుంటున్నారు. ఇవి జరగకుండా చూడాల్సిన బీఎల్వోలు చేతులెత్తేస్తున్నారు. ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసిన ముసాయిదా జాబితా తప్పులు తడకలతో ఉండటానికి ఇదే ప్రధాన కారణం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని