ఇదేం అస్తవ్యస్త ఇసుక విధానం?

ఇసుక తవ్వకాలపై రాష్ట్రప్రభుత్వ విధానాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల లారీ యజమానులు మండిపడ్డారు.

Published : 29 Nov 2023 05:27 IST

జొన్నాడ ర్యాంపు లారీ యజమానుల ఆందోళన

 ఆలమూరు, న్యూస్‌టుడే: ఇసుక తవ్వకాలపై రాష్ట్రప్రభుత్వ విధానాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల లారీ యజమానులు మండిపడ్డారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా జొన్నాడ ఇసుక ర్యాంపు వద్ద మంగళవారం వారు ఆందోళన చేశారు. అక్టోబరు 30 నుంచి ర్యాంపులను మూసేసి ఈ నెల 20 నుంచి తెరిచారన్నారు. జిల్లాకు ఒకటి, రెండు ర్యాంపులనే తెరవడంతో ఇసుక కొరత ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జోన్‌ వన్‌ను ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు అప్పగించినట్లు వార్తలు వచ్చినా.. ఇప్పటికీ జేపీ కంపెనీ బిల్లులతోనే ఇసుక లోడ్‌ చేస్తున్నారని తెలిపారు. ఇసుక ర్యాంపుల నిర్వహణ ఎవరి చేతుల్లో ఉందో అర్థం కావట్లేదని, ప్రశ్నిస్తే సీఎంఓ నుంచి వచ్చామని బెదిరిస్తున్నారని తెలిపారు. ర్యాంపుల నిర్వాహకులు ఇసుక ఎప్పుడు లోడ్‌ చేస్తారో తెలియక రెండు, మూడు రోజులు లారీలను నిలిపి.. వేచిచూడాల్సిన పరిస్థితి ఉందని, దీనివల్ల డ్రైవర్ల జీతాలు తడిసి మోపెడవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే అన్ని ర్యాంపులూ తెరవాలని, లారీ యజమానులు, డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టిప్పర్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ రావూరి రాజా తదితరులు డిమాండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని