మౌనంగా విన్నారు.. వెళ్లారు

ఓటర్ల జాబితా పరిశీలకుడు, ఏపీ పొల్యూషన్‌ బోర్డు మెంబర్‌ సెక్రటరీ బి.శ్రీధర్‌ తొలి విడత జిల్లా పర్యటన గంటన్నర వ్యవధిలో ముగిసింది. ప్రధాన రాజకీయ పక్షాలు, అధికారులు చెప్పింది మౌనంగా విన్నారు.

Updated : 29 Nov 2023 05:57 IST

గంటన్నరలో ముగిసిన ఓటర్ల జాబితా పరిశీలకుడి పర్యటన

మచిలీపట్నం (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: ఓటర్ల జాబితా పరిశీలకుడు, ఏపీ పొల్యూషన్‌ బోర్డు మెంబర్‌ సెక్రటరీ బి.శ్రీధర్‌ తొలి విడత జిల్లా పర్యటన గంటన్నర వ్యవధిలో ముగిసింది. ప్రధాన రాజకీయ పక్షాలు, అధికారులు చెప్పింది మౌనంగా విన్నారు. మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో తాము గుర్తించిన 45,000 అభ్యంతరాలను ఇంకా సవరించాల్సి ఉందని.. పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా జిల్లా అధ్యక్షుడు.. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆధారాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేయగా దీనిపైనా ఆయన ఎలాంటి వ్యాఖ్యానాలు చేయలేదు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు, జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్‌ పి.రాజబాబు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తీరు, వచ్చిన అభ్యంతరాలు, పరిష్కారాలకు సంబంధించిన అంశాలను పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.

భారీ సంఖ్యలో కొత్త ఓటర్ల నమోదు, ఉన్న ఓటుహక్కు తొలగించారన్న ఫిర్యాదులు ఏమీ లేవని చెబుతూ ఒకే డోర్‌ నంబరుతో ఎక్కువ ఓటర్లు, బూత్‌ల మార్పు, డబల్‌ ఎంట్రీలపై వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని, తాము ఎత్తిచూపిన పొరపాట్లను పరిష్కరించకుండా అవే తప్పులతో ముసాయిదా జాబితా ప్రచురించారని తెదేపా, వైకాపా ప్రతినిధులు తెలియజేశారు. బ్యాలెట్‌ పేపర్లు, ఈవీఎంల గురించి సీపీఎం ప్రతినిధి ప్రస్తావించారు. సమావేశంలో వివిధ పక్షాల ప్రతినిధులు చేసిన ఫిర్యాదులను పరిశీలించాలని కలెక్టర్‌కు సూచించారు. ఓటర్ల జాబితాలో లోటుపాట్లపై విస్తృత చర్చ నిర్వహిస్తారనే భావనతో వచ్చిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు నిరాశ కలిగించేలా ఎన్నికల పరిశీలకుడు మౌనంగా వారు చెప్పిన అంశాల విని ఎటువంటి క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని