ఒప్పంద సమయంలో తప్పించుకున్నారా!

గనుల శాఖలో ఆయనో కీలక అధికారి.. ఆ శాఖలో అసలు బాస్‌ తర్వాత ఆయనదే ముఖ్యమైన పోస్టు. అటువంటి అధికారి దాదాపు నెల రోజులుగా సెలవులో ఉన్నారు.

Published : 30 Nov 2023 06:14 IST

సెలవులో గనులశాఖ కీలక అధికారి

ఇసుక గుత్తేదారు ఎంపిక వేళ దూరం

ఇరుక్కుంటాననే ముందు జాగ్రత్త?

ఈనాడు, అమరావతి: గనుల శాఖలో ఆయనో కీలక అధికారి.. ఆ శాఖలో అసలు బాస్‌ తర్వాత ఆయనదే ముఖ్యమైన పోస్టు. అటువంటి అధికారి దాదాపు నెల రోజులుగా సెలవులో ఉన్నారు. అదీ ఆర్జిత సెలవులు పెట్టుకొని వెళ్లడం ఆ శాఖలో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలకు సంబంధించి టెండర్ల ద్వారా ఏజెన్సీల ఎంపిక, వాటితో ఒప్పందాలు జరగాల్సిన సమయంలో ఆయన విధులకు దూరంగా ఉండటం వెనుక ఆంతర్యం ఏదో ఉందనే వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో గత రెండున్నరేళ్లుగా ఇసుక తవ్వకాలు, విక్రయాలు జేపీ సంస్థ పేరిట ఉపగుత్తేదారు టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్‌, ఆ తర్వాత స్వయంగా వైకాపా నేతలు రంగంలోకి దిగి నిర్వహించారు. ఇప్పుడు కొత్తగా పిలిచిన టెండర్లలో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు చెందిన రెండు ప్యాకేజీలు తెలంగాణకు చెందిన ప్రతిమ ఇండస్ట్రీస్‌, కోస్తాంధ్ర జిల్లాల ప్యాకేజీని చెన్నైలో రిజిస్టర్‌ అయిన రాజస్థాన్‌కు చెందిన జీసీకేసీ అనే సంస్థ దక్కించుకున్నాయి. ఇవి పేరుకే గుత్తేదారు సంస్థలని, వ్యవహారమంతా పులివెందులకు చెందిన ఓ కీలక నేత కుటుంబీకుల కనుసన్నల్లోనే జరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులతో త్వరలో గనులశాఖ ఒప్పందం చేసుకొని తవ్వకాలు, విక్రయాలు అప్పగించనుంది. అయితే వాటిలో అనేక లొసుగులు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. గనులశాఖ సంచాలకుని కార్యాలయంలో ఇసుక అంశాలన్నీ ఆ కీలక అధికారే పర్యవేక్షిస్తారు. కొత్త గుత్తేదారులతో ఒప్పంద సమయంలో ఉంటే తలనొప్పులు ఉంటాయనే ఉద్దేశంతో ఆయన సెలవుపై వెళ్లిపోయారని చర్చ జరుగుతోంది.

ప్రభుత్వం మారితే ఇక్కట్లే..

గనులశాఖ సంచాలకులు కేంద్ర సర్వీసులకు చెందిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఆయన మళ్లీ కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతారు. కీలక అధికారి మాత్రం గనుల శాఖలోనే మరో రెండేళ్లు పనిచేయాల్సి ఉంది. దీంతో ప్రభుత్వం మారితే కేసులతో అనేక ఇబ్బందులు రావచ్చనే ఉద్దేశంతోనే.. కొత్త గుత్తేదారు ఎంపిక, వాళ్లతో ఒప్పందాల సమయంలో దూరంగా ఉండడం కోసం సెలవులో వెళ్లారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన దంత సంబంధమైన సమస్యతోసెలవు తీసుకున్నారని, డిసెంబరు 1 నుంచి విధులకు హాజరయ్యే వీలుందని కొందరు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని