ఆ కలెక్టర్ల తీరు దారుణం

రాష్ట్రంలో శ్రీకాకుళం, కోనసీమ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల కలెక్టర్లు వైకాపా కార్యకర్తల కంటే దారుణంగా పనిచేస్తూ, వైకాపా అక్రమాలకు ఆమోదముద్ర వేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

Updated : 30 Nov 2023 05:24 IST

వైకాపా కార్యకర్తలను మించిపోతున్నారు

ఓటర్ల జాబితాలో అక్రమాలకు ఆమోదముద్ర వేస్తున్నారు

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ధ్వజం

ఓట్ల అక్రమాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో శ్రీకాకుళం, కోనసీమ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల కలెక్టర్లు వైకాపా కార్యకర్తల కంటే దారుణంగా పనిచేస్తూ, వైకాపా అక్రమాలకు ఆమోదముద్ర వేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఈ రెండు మూడు నెలలు వాళ్లు తప్పించుకోవచ్చేమో గానీ, తర్వాత శిక్ష తప్పదని హెచ్చరించారు. ఓటర్ల జాబితాల్లో అక్రమాలపై పార్టీల విజ్ఞప్తులను కలెక్టర్లు పట్టించుకోని తీరుపై ఆధారాలతో ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేశామని తెలిపారు. తెదేపా నేతలు పయ్యావుల కేశవ్‌, బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్‌రావు, అశోక్‌బాబు, వర్ల రామయ్య, నక్కా ఆనంద్‌బాబు, పులివర్తి నాని తదితరులతో కలిసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనాను బుధవారం కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ‘ఏపీలో జగన్‌ ఓడిపోతున్నారని తెలిసి.. తెదేపా వాళ్ల ఓట్లు తొలగించి, లేని ఓట్లు చేర్పించి గెలవాలనే ఇదంతా చేస్తున్నారు. ఫారం-6, 7, 8 సహా నకిలీ ఓట్ల తొలగింపునకు తెదేపా 11.5 లక్షల దరఖాస్తులు చేస్తే, అవి ఏమయ్యాయో తెలియదు. వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాం’ అని అచ్చెన్నాయుడు తెలిపారు.

అనంతపురం కలెక్టర్‌.. రెండు రకాల చర్యలు

‘రాప్తాడులో 20వేల బోగస్‌ ఓట్లు ఉన్నాయని మాజీమంత్రి పరిటాల సునీత ఫిర్యాదుచేస్తే, ఫారం-7 పెట్టుకోవాలని అనంతపురం కలెక్టర్‌ చెప్పారు. ఉరవకొండ నియోజకవర్గంలో 10వేల ఓట్లు తీసేయాలని అక్కడి వైకాపా ఇన్‌ఛార్జ్‌ లేఖ ఇస్తే.. ఫారం-7 లేకుండా ఫార్మాట్‌-బి అనే నోటీసు ఇచ్చి, తొలగించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకే కలెక్టర్‌ ఇలా వేర్వేరుగా వ్యవహరిస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో 20వేల ఓట్లు వేరే ప్రాంతాలవారివి చేర్చారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెబితే అక్కడ 79 కొత్త పోలింగ్‌ కేంద్రాలు ఇచ్చారు. రాష్ట్రమంతటా అక్రమాలు ఉన్నాయని, 17 నియోజకవర్గాల్లో దొంగ ఓట్లపై ఆధారాలు సీఈఓకి అందజేశామన్నారు. నోటీసు ఇవ్వకుండా తప్పు చేస్తే బీఎల్వోలు బాధ్యులవుతారని, దీనిపై మెమో పంపుతామని ఆయన చెప్పారు. అవకతవకలు చేస్తే అందుకు బీఎల్వోలు, తహసీల్దార్లు, ఆర్డీవోలు, కలెక్టర్లు బాధ్యులవుతారు’ అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

సీఈఓ ఆశ్చర్యపోయారు: పయ్యావుల కేశవ్‌

‘ఉరవకొండలో అక్రమాలు చెబితే ఎన్నికల సంఘం కూడా ఆశ్చర్యపోయింది. ఓటర్ల నమోదు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకోవాలి. కానీ వైకాపా నేతలు టోకుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అప్‌లోడ్‌ చేసి, తహసీల్దారుకు ఫోన్‌ చేస్తే.. అధికారులు మూడురోజులు రాత్రిళ్లు కార్యాలయంలో కూర్చుని ఓకే చేశారు. ఇది అసాధ్యమని సీఈవో అన్నారు. కానీ పక్కన ఉన్న సాంకేతిక అధికారి మాత్రం అవకాశం ఉందన్నారు. బీఎల్వోలూ.. ఒత్తిళ్లకు తలొగ్గొద్దు. ఫారం-7 ఇస్తే అభ్యంతరం చెప్పిన వ్యక్తి డిక్లరేషన్‌ ఇవ్వకుండా, అధికారులు ఫార్మాట్‌-2 కొడుతున్నారని వివరించాం. ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఎన్నికల సంఘం ముందు అర్ధరాత్రి వరకైనా కూర్చోవాలని వచ్చాం. కానీ సీఈఓ ఇచ్చిన స్పష్టమైన హామీని నమ్మి బయటకు వచ్చాం’ అని పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ తెలిపారు.


తాడేపల్లి ఆదేశాలు పాటిస్తే శిక్ష తప్పదు

‘ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఇటీవల దిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుచేయగా, అక్కడి నుంచి బృందం త్వరలో రాష్ట్రానికి రానుంది. తాడేపల్లి ఆదేశాలు పాటించి, ఏకపక్షంగా, వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కలెక్టర్లకు శిక్షలు తప్పవు. వీళ్లను జగన్‌ కాపాడలేరు. మూడు నెలల్లో జగన్‌తో, వైకాపా నేతలు తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపోతారు. అధికారులే దొరికిపోతారు. మీపై చర్యలు చేపట్టేవరకూ తెదేపా ఊరుకోదు’ అని బొండా ఉమామహేశ్వరరావు హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు