జగన్‌ మార్కు నిరంకుశత్వం

బాధితుల్ని పరామర్శించడం.. అధికార పార్టీ నాయకుల అక్రమాల్ని బయటపెట్టడం... ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలపడం... ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు.

Updated : 30 Nov 2023 06:45 IST

ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తున్న వైకాపా ప్రభుత్వం

బాధితుల్ని పరామర్శిస్తే ప్రతిపక్షాలపై కేసులు

అధికార పార్టీ అక్రమాలు బయటపెట్టడానికి కదిలితే గృహనిర్బంధాలు

ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తలపెడితే అష్టదిగ్బంధాలు

ఈనాడు - అమరావతి

బాధితుల్ని పరామర్శించడం.. అధికార పార్టీ నాయకుల అక్రమాల్ని బయటపెట్టడం... ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలపడం... ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు. కానీ నిరంకుశత్వానికి కేరాఫ్‌గా మారిన జగన్‌ ప్రభుత్వం వాటిని కాలరాస్తోంది. నిత్యకల్లోలిత ప్రాంతమైన కశ్మీర్‌లో, అల్లర్లతో అట్టుడికే ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఏనాడూ కనీవినీ ఎరుగని ఆంక్షలు, నిర్బంధాలను ప్రతిపక్షాలపై ప్రయోగిస్తోంది. పోలీసు చట్టంలోని సెక్షన్‌ 30, సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 144 అమల్లో ఉన్నాయంటూ అడుగు తీసి అడుగు వేయనీయకుండా అష్టదిగ్బంధం చేస్తోంది. వైకాపా అధికారం చేపట్టినప్పటి నుంచి ఇదే తీరు. అరాచకానికి మారుపేరైన తాలిబన్‌ రాజ్యాన్ని, కరడుగట్టిన నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పాలిస్తున్న ఉత్తరకొరియాను మించిపోయేలా ఏపీలో ప్రతిపక్షాలపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రజాస్వామిక హక్కులపై ఈ నిర్బంధమేంటి? ఇక్కడ ప్రతిపక్షాలకు భావప్రకటన స్వేచ్ఛ తీసేశారా? పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో రూ.50కోట్ల విలువైన క్వార్ట్జ్‌ ఖనిజాన్ని అధికారపార్టీ నేత కొల్లగొడితే.. తాజాగా ఆ అక్రమ మైనింగ్‌ను పరిశీలించడానికి వెళ్లాలనుకున్న ప్రతిపక్ష నాయకులకు అనుమతి ఇవ్వకపోవడం ఏంటి? అక్కడ ఏ తప్పూ జరగకపోతే ఎందుకంత భయం? పోలీసులను అడ్డంపెట్టుకుని ఎంతకాలం కట్టడి చేస్తారు? ఇంకెన్నాళ్లు హక్కుల్ని హరిస్తారు?

అక్రమాలను బయటపెట్టేందుకు వెళ్తుంటే అడ్డుకుంటారా?

ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైకాపా నాయకులు ఇసుక, మద్యం దందాలకు పాల్పడుతున్నారంటూ తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు కొన్నాళ్ల కిందట పాదయాత్ర తలపెట్టగా పోలీసులు ఆయన్ను ఇంటినుంచి బయటకు రానీయకుండా నిర్బంధించారు. పశ్చిమగోదావరి జిల్లా చించినాడ పరిధి పెరుగులంక భూముల్లో వైకాపా నాయకుల మట్టి అక్రమ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని పోలీసులు అడ్డుకున్నారు. సీఆర్‌జడ్‌ నిబంధనలను ఉల్లంఘించి విశాఖలోని రుషికొండపై చేస్తున్న అక్రమ
తవ్వకాల పరిశీలనకు వెళ్లాలనుకున్న ప్రతిపక్ష నేతలను పలు సందర్భాల్లో పోలీసులు నిర్బంధించారు. అక్రమ మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతంలో నిజనిర్ధారణ కమిటీ పర్యటిస్తే అది శాంతిభద్రతల సమస్య ఎలా అవుతుంది?ఇది ప్రాథమిక హక్కుల్ని హరించడం కాదా?

బాధితుల్ని పరామర్శించడానికి వెళ్తే కేసులా?

జగన్‌ పాలనలో.. ప్రతిపక్ష పార్టీల నాయకులు బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లినా అది శాంతిభద్రతల సమస్యే. పులివెందులలో హత్యాచారానికి గురైన దళిత మహిళ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డీఎస్పీకి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన తెదేపా దళిత నాయకులు వంగలపూడి అనిత, ఎం.ఎస్‌.రాజులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఉన్మాది చేతిలో హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు నరసరావుపేట వెళ్తున్న తెదేపా నేత నారా లోకేశ్‌ను అడ్డుకుని.. శాంతిభద్రతలకు ఆటంకం కలిగించారంటూ కేసు పెట్టారు. పల్నాడులో వైకాపా నాయకుల హింస బారిన పడిన బాధితుల్ని పరామర్శించేందుకు తెదేపా అధినేత చంద్రబాబు చలో ఆత్మకూరుకు పిలుపునివ్వగా ఆయన్ను ఉండవల్లిలోని ఇంటి నుంచి బయటకు రానీయకుండా తాళ్లతో గేట్లు కట్టేసి అడ్డుకున్నారు.

ఇది స్వేచ్ఛను హరించడం కాదా?

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహించే పుంగనూరు, మాచర్ల లాంటి నియోజకవర్గాల్లో ప్రతిపక్ష నాయకులను కాలు కదపనివ్వరు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విజయవాడ వస్తుంటే రాష్ట్ర సరిహద్దుల్లో అడ్డుకున్నారు. అంతకుముందు విశాఖ వెళ్తే వాహనం నుంచి బయటకు కనిపించడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో బీసీలు మచిలీపట్నంలో సైకిల్‌ యాత్ర చేపడితే ఆయన్ను నిర్బంధించారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్లగా అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. ఆర్‌5 జోన్‌కు వ్యతిరేకంగా అమరావతి రైతులు శాంతియుత నిరసన ప్రదర్శన చేపడతామంటే 144 సెక్షన్‌ అమల్లో ఉందంటూ వారిని నిర్బంధించి దాడి చేశారు. ఇదే అంశంపై జైభీమ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌ పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవ్వగా ఆయన్ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

ఏది నేరం?

ప్రజాస్వామిక పద్ధతుల్లో పోరాడటం, ప్రభుత్వ విధానాలపై నిరసన తెలపడం, శాంతియుత ప్రదర్శనల ద్వారా గళం వినిపించడం, బాధితులను పరామర్శించి సంఘీభావం తెలపడం, రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడం నేరమా? వారి హక్కుల్ని కాలరాస్తూ నిర్బంధించడం నేరమా? ఏ చట్టం ప్రకారం ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని గృహనిర్బంధం చేస్తున్నారు?


అధికార పార్టీ అరాచకాలకు మాత్రం పచ్చజెండా

ప్రతిపక్షాలు ఏ కార్యక్రమం తలపెట్టినా శాంతిభద్రతల సమస్య, నేర నియంత్రణ పేరిట గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులు చేస్తున్న పోలీసులు అధికార పార్టీ అరాచకాలకు మాత్రం వత్తాసు పలుకుతున్నారు. ప్రతిపక్ష నాయకులపైకి, పాదయాత్ర చేసే రైతులపైకి రాళ్లు, చెప్పులు విసరడం, జెండా కర్రలతో దాడిచేయడం, ప్రతిపక్ష పార్టీల కార్యాలయాల్లో, ప్రతిపక్ష నాయకుల ఇళ్లలోకి చొరబడి విధ్వంసం సృష్టించడం లాంటి చర్యలకు వైకాపా నాయకులు తెగబడినప్పుడు మాత్రం పోలీసులకు శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ గుర్తుకు రాదు. పైగా వారికి రక్షణ కల్పిస్తారు కూడా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని