Jogi ramesh: ఒక రాష్ట్రంలోనే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలి

సుమారు 16 లక్షల మందికి ఏపీ, తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లోనూ ఓట్లు ఉన్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని మంత్రులు జోగి రమేశ్‌, మేరుగు నాగార్జున అన్నారు.

Updated : 30 Nov 2023 06:51 IST

16 లక్షల మందికి  ఏపీ, తెలంగాణల్లో ఓట్లు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి మంత్రులు జోగి రమేశ్‌, మేరుగు నాగార్జున వినతి

ఈనాడు, అమరావతి: సుమారు 16 లక్షల మందికి ఏపీ, తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లోనూ ఓట్లు ఉన్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని మంత్రులు జోగి రమేశ్‌, మేరుగు నాగార్జున అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ)కి విజ్ఞప్తి చేసినట్లు బుధవారం వెల్లడించారు. సీఈఓను కలిసిన అనంతరం వీరు సచివాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ‘తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకొని తర్వాత ఏపీ ఎన్నికల్లోనూ ఓటు వేయాలని కొందరు చూస్తున్నారు. ఇలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరాం. దీనికి సంబంధించిన ఆధారాలను సీఈఓకు అందజేశాం. మరికొన్నింటిని ఇస్తాం’ అని పేర్కొన్నారు. వైకాపా నేతలు లక్షల సంఖ్యలో ఓట్లు చేర్చించారని, కొన్ని లక్షల ఓట్లను తొలగించారంటూ తెదేపా, జనసేన ఆరోపిస్తున్నాయని మంత్రులు అన్నారు. వాళ్లు ఎలాగూ ఓడిపోతారనే ఇలా తమపై బురదజల్లే యత్నం చేస్తున్నారని విమర్శించారు.

యుద్ధం చేయకుండానే అస్త్రసన్యాసం

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ యుద్ధం చేయకుండానే అస్త్రసన్యాసం చేశారని జోగి రమేశ్‌ విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఎక్కడుందని ప్రశ్నించారు. 79 రోజుల పాటు పారిపోయిన లోకేశ్‌.. మంత్రులకు భయమంటే ఏమిటో చూపిస్తానని అంటున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో వారిని ఉరికిస్తామని హెచ్చరించారు. ఉద్యోగులను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయాలనే ఆలోచన తమకు లేదని మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని