సీబీఐకి స్కిల్‌ కేసు అప్పగింత పిల్‌పై విచారణ వాయిదా

నైపుణ్యాభివృద్ధి సంస్థ (స్కిల్‌) కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ హైకోర్టులో వేసిన పిల్‌పై విచారణ డిసెంబరు 13కు వాయిదా పడింది.

Updated : 30 Nov 2023 06:47 IST

ప్రతివాదులకు నోటీసులు అందజేసేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు

ఈనాడు, అమరావతి: నైపుణ్యాభివృద్ధి సంస్థ (స్కిల్‌) కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ హైకోర్టులో వేసిన పిల్‌పై విచారణ డిసెంబరు 13కు వాయిదా పడింది. వ్యాజ్యంలో కొందరు ప్రతివాదులకు న్యాయస్థానం జారీచేసిన నోటీసులు అందకపోవడంతో.. పిటిషనర్‌ వ్యక్తిగతంగా నోటీసులు అందజేసేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ ఎం.కిరణ్మయితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ 2021 డిసెంబరు 9న నమోదుచేసిన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించేలా ఆదేశించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న 44 మందికి గతంలో నోటీసులు జారీచేసింది.

మీ పనిని సీఐడీకి ఎందుకు అప్పగించాలి: ధర్మాసనం

బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ.. చిరునామా సక్రమంగా లేకపోవడంతో ప్రతివాదులకు నోటీసులు చేరలేదన్నారు. నోటీసులు అందజేసే బాధ్యతను సీఐడీకి అప్పగించాలని కోరారు. దాన్ని ధర్మాసనం తిరస్కరించింది. మీరు చేయాల్సిన పనిని సీఐడీకి ఎందుకు అప్పగించాలని ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో తామే (పిటిషనర్‌) వ్యక్తిగతంగా నోటీసులు అందజేసేందుకు అనుమతివ్వాలని సీనియర్‌ న్యాయవాది కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది. మరోవైపు కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెదేపా అధినేత చంద్రబాబు తరఫున వకాలత్‌ దాఖలుచేసినట్లు ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని